మధ్యప్రదేశ్‌లో ఆరుగురి అరెస్ట్
భోపాల్: మధ్యప్రదేశ్‌లో ఘరానా మోసం చోటుచేసుకుంది. ప్రభుత్వ విత్తన ధ్రువీకరణ కార్యాలయంలో ప్యూన్‌గా పనిచేసే వ్యక్తి, బ్యాంకు అధికారులు ఇతరులతో కలిసి నకిలీ పత్రాలతో రూ.10 కోట్లను తన బ్యాంకు ఖాతాలో జమ చేయించుకున్నాడు. ఈ మొత్తంతో భూమి కొనుగోలు చేసి ప్రభుత్వ పథకాలను ఉపయోగించుకుని సగానికి సగం సబ్సిడీ కొట్టేయాలని పథకం పన్నాడు. అనుకోకుండా పోలీసులకు దొరికిపోవడంతో ఈ బాగోతం బట్టబయలైంది.
మధ్యప్రదేశ్ విత్తన ధ్రువీకరణ విభాగంలో ప్యూన్‌గా పనిచేసే బ్రిజేంద్ర దాస్ నామ్‌దేవ్ ఈ మొత్తం వ్యవహారంలో కీలకంగా ఉన్నాడు. ఇతడు నాలుగు నెలల క్రితం అక్కౌంటింగ్ అసిస్టెంట్‌గా పనిచేసే దీపక్ పాంటీ సాయంతో విత్తన ద్రువీకరణ విభాగానికి సంబంధించిన ఫోర్జరీ పత్రాలు, సీళ్లను తయారు చేశాడు. వీటిలో నామ్‌దేవ్ తనను డ్రాయింగ్ అండ్ డిస్బర్సింగ్ అధికారిగా, విత్తన ధ్రువీకరణ విభాగం హెడ్‌గా పేర్కొన్నాడు.
బ్యాంక్ మేనేజర్ నోయెల్ సింగ్‌తో కుమ్మక్కై నామ్‌దేవ్ ఎకౌంట్‌లో రూ.10 కోట్లు డిపాజిట్ చేయించారు. ఆ మొత్తాన్ని 50 వేర్వేరు బ్యాంకు ఖాతాల్లో జమ చేశారు. ఇవన్నీ నకిలీ పత్రాలతో తెరిచినవే. ఈ ఖాతాదారుల్లో శైలేంద్ర ప్రధాన్, అతడి పరిచయస్తులైన మరికొందరు ఉన్నారు. వీరంతా జమ అయిన డబ్బును విత్ డ్రా చేసుకుని, తమకివ్వాల్సిన కమిషన్ పోను మిగతాది నామ్‌దేవ్ ముఠాకు ఇచ్చేశారు. నామ్‌దేవ్ ముఠా సభ్యులు ఈ డబ్బుతో రూ.6.40 కోట్లు, రూ.1.25 కోట్లు పెట్టి రెండు చోట్ల ప్లాట్లు కొన్నారు.
జాతీయ పశుసంవర్థక శాఖ పథకాన్ని వాడుకుని ఈ భూముల్లో వేర్వేరు ప్రాజెక్టులను ప్రారంభించాలనేది ఈ ముఠా పథకం. ప్రభుత్వ పథకంలో రూ.5 కోట్ల రుణం తీసుకుంటే అందులో సగం వరకు సబ్సిడీ పొందొచ్చు. ఇలా రూ.10 కోట్ల పెట్టుబడితో 50 శాతం సబ్సిడీ పొందాలనేది వీరి ప్లాన్. అయితే, నామ్‌దేవ్ తీరుపై అనుమానం వచ్చిన విత్తన ధ్రువీకరణ అధికారి సుఖ్‌దేవ్ ప్రసాద్ సెపె్టంబర్ 14వ తేదీన పోలీసులకు ఫిర్యాదు చేశారు.
అధికారులు దీనిపై దర్యాప్తునకు సిట్ ఏర్పాటు చేశారు.తెలిసిన నామ్‌దేవ్, నోయెల్ సింగ్‌లు తమ ఫోన్లను స్విచ్చాఫ్ చేసుకుని, కుటుంబాలతో సహా పరారయ్యారు. అయితే, పోలీసులుదీపక్ పాంటీ, ధనంజయ్ గిరి, శైలేంద్ర ప్రథమ్‌లను అరెస్ట్ చేశారు. అరెస్ట్ నుంచి తప్పించుకునేందుకు నామ్‌దేవ్ ఇతరుల ఫోన్లతో వేర్వేరు చోట్ల నుంచి ఫోన్లు చేసేవాడు. పత్రికలు, మీడియా ద్వారా పోలీసుల చర్యలను ఎప్పటికప్పుడు ఫాలో అయ్యేవాడు. చివరికి రెవాలో ఉండగా సిట్ సభ్యులకు నామ్‌దేవ్ దొరికిపోయాడు. రూ.10 కోట్లు పంపిన 50 బ్యాంకు ఖాతాలను స్తంభింపజేశారు.
Comments
Please login to add a commentAdd a comment