స్కీమ్ కట్టించుకుంటున్న వ్యక్తి (ఫైల్),స్కీమ్ పేరుతో మోసపోయామంటున్న యాతపేట మహిళలు
విజయనగరం,వేపాడ: వారం వారం కొంత మొత్తం కడితే గృహోపకరణాలు ఇస్తామంటూ ఆకర్షిస్తూ మహిళలను మోసం చేసిన మరో స్కీం బాగోతం వెలుగులోకి వచ్చింది. తొలుత డబ్బులు కట్టిన వారికి చిన్నచిన్న వస్తువులు ఇచ్చి నమ్మించి తరువాత పెద్ద మొత్తంలో వసూలు చేసి చేతులెత్తేసిన వైనం బయటపడింది. బాధితులు తెలిపిన వివరాల్లోకి వెళ్తే..
మండల కేంద్రమైన వేపాడ, వల్లంపూడి గ్రామాల్లోకి ఏడు వారాల కిందట శ్రీసిద్ధి వినాయక ఈజీ ఇన్‌స్టాల్‌మెంట్ స్కీం పేరిట గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి మహిళలను మోసపుచ్చారు. మొత్తం 19 వారాలు స్కీం ఉంటుందని మొదటి వారం రూ.30, రెండో వారం రూ.50, మూడో వారం రూ.100 ఇలా వారానికి రూ.50లు పెంచుకుంటూ ఏడు వారాలు, ఎనిమిదో వారం నుంచి వారానికొక రూపాయి చొప్పులు పెంచుకుతూ 17వ వారం వరకు, 18, 19 వారాల్లో రూ.పది పెంచి రూ.320, 330 కట్టాలంటూ... ఇందులో 201 మంది సభ్యులు ఉంటారని స్కీం లబ్ధిదారులను ఆకర్షించి కార్డులు అందజేశారు. ప్రతీ వారం డ్రా తీసి విజేతలకు దుప్పట్లు మొదటి వారం ఇచ్చారని, రెండో వారం నుంచి బహుమతులు ఇవ్వడానికి కరోనా అడ్డంకిగా మారిందని నమ్మబలికారు.
ఇలా ఏడు వారాలు నమ్మించి డబ్బులు కట్టించుకుని ఏడో వారంలో అదనపు సొమ్ము కడితే వస్తువులు ఇంటికి తెచ్చి ఇస్తామంటూ నమ్మబలికి పలువురి నుంచి రూ.2వేల నుంచి నాలుగు వేల వరకు కార్డుకు అదనంగా వసూలు చేశారని వల్లంపూడిలోని యాతపేటకు చెందిన బాధితులు శెట్టి ఈశ్వరమ్మ, శెట్టి సత్యవతి, కక్కల భవానీ, కక్కల భారతి, గొర్లె ఈశ్వరమ్మ, కక్కర రమణమ్మ, శెట్టి వెంకటరమణ తదితరులు తెలిపారు. ఆగస్టు 1న సొమ్ము తీసుకువెళ్లిన వ్యక్తులు ఎనిమిదో తేదీకి వస్తామని చెప్పి రాకపోవడంతో 15వ తేదీన ఫోన్లు చేస్తే పలకపోవడంతో తామంతా మోసపోయినట్టు గుర్తించి లబోదిబోమంటున్నారు. స్కీం కార్డుపై ప్రొ.గౌరీశంకర్, హౌసింగ్‌బోర్డు కాలనీ, డోర్ నంబరు 16 – 20 – ఇ/ఏ అని రబ్బరు స్టాంప్ తప్ప ఊరు పేరు నమోదు చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు. డబ్బులు కట్టించుకున్న వారు పలువురు కొత్తవలస, ఎస్.కోట అని చెప్పారని తెలిపారు. పోలీసులను ఆశ్రయించనున్నట్టు చెప్పారు.
అదనంగా 20వేలు కట్టాం..
మా ఇంట్లో ఐదు కార్డులు కట్టాం. ఏడు వారాల తరువాత వస్తువులిస్తామంటే అదనంగా రూ.20వేలు కట్టాను. తీరా ఇప్పుడు కనిపించకుండా పోయారు. మాతో పాటు చాలా మంది ఉన్నారు. ఫోన్ నంబరుకు చేస్తుంటే అందుబాటులో లేదని చెబుతోంది. – శెట్టి వెంకటరమణ, వల్లంపూడి
వస్తువు సమకూర్చుకుందామని..
స్కీం డబ్బులు కట్టి మోసపోయా.. స్కీం కాకుండా అదనంగా రూ.800 కట్టాను. మా తోటికోడలు భారతి డబుల్‌కాట్ మంచం కోసం అదనంగా రూ.నాలుగు వేలు కట్టింది. మోసం చేశారు. – కక్కల భవానీ, వల్లంపూడి
Comments
Please login to add a commentAdd a comment