
బొమ్మనహళ్లి : నేటి కలికాలంలో అనుబంధాల కంటే ఆస్తులే ముఖ్యమవుతున్నాయి. అందుకోసం రక్త సంబంధాలను కూడా రక్తతర్పణం చేస్తున్నారు. తల్లి పేరుపై ఉన్న ఆస్తి కోసం కుమారుడు తండ్రితో కలిసి కిరాయి హంతకులకు సుపారీ ఇచ్చి కన్నతల్లిని హత్య చేయించాడు. అయితే నేరం దాగలేదు. బండెపాళ్య పోలీసులు ప్రధాన నిందితులతో పాటు సుపారీ కిల్లర్స్‌ను అరెస్ట్ చేశారు. వివరాలు.. ఈ నెల 16న ఇక్కడి హెచ్‌ఎస్‌ఆర్ లేఔట్‌లో బూటీ పార్లర్ నిర్వహిస్తున్న గీత (40) హత్యకు గురైంది. బెంగళూరు నగర ఆగ్నేయ విభాగం డీసీపీ శ్రీనాథ్ జోషి వివరాల మేరకు... గీత, అంజన్‌లకు 21 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి వరుణ్ (20) అనే కుమారుడు ఉన్నాడు. 15 సంవత్సరాల క్రితం విడిపోయారు. కుమారుడు వరుణ్ తండ్రితో కలిసి ఉంటున్నాడు.
భవనంపై అడ్వాన్స్ తీసుకుని..
గీతాకు ఆమె తండ్రి రాసిచ్చిన 3 అంతస్తుల భవనం మంగమ్మనపాళ్యలో ఉంది. ఆ భవనంపై తండ్రీ కొడుకుల కన్ను పడింది. గీత తండ్రి ఈ భవనాన్ని గీత కుమారుడు వరుణ్ పేరుపైనే రాసిప్పటికీ తల్లి బతికి ఉంటే తనకు ఆస్తి దక్కదని వరుణ్ అనుకున్నాడు. దీనిపై కొన్నిసార్లు గొడవలు కూడ జరిగాయి. ఆస్తి దక్కాలంటే తల్లిని చంపడమే మార్గమని తండ్రికి చెప్పి పథకం సిద్ధం చేశాడు. అప్పటికే ఈ భవనాన్ని అమ్ముతామని వరుణ్, తండ్రి ఒకరి నుంచి రూ. కోటి అడ్వాన్స్ తీసుకున్నారు. ఈ విషయాన్ని కొనుగోలుదారులు గీతకు చెప్పడంతో ఆమె కోర్టుకు వెళ్లింది. కోర్టులో కూడా గీతకు మద్దతుగా తీర్పు రావడంతో ఆమెను ఎలాగైన హత్య చేయాలని అంజన్, వరుణ్ హత్యకు పథకం పన్నారు. నవీన్ కుమార్ అనే వ్యక్తికి రూ. 7 లక్షలు చెక్కును సుపారీగా ఇచ్చారు. ఈ నెల 16న అర్ధరాత్రి గీతను హత్య చేశారు. విచారణ చేపట్టిన పోలీసులు తండ్రీ కొడుకుల పాత్రను గుర్తించి అరెస్టు చేసి వివరాలను రాబట్టారు. కిరాయి హంతకులు నవీన్, నాగరాజు, ప్రదీప్, బనహళ్లి నాగరాజులను అరెస్ట్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment