అతనో డాక్టర్. విజయవాడ నుంచి ఢిల్లీ వెళుతూ ఆన్‌లైన్‌లో ఓ బాలిక పోర్న్ వీడియో చూశాడు. అంతటితో ఆగని వైద్యుడు వీడియోను డౌన్‌లోడ్ చేసి ఇన్‌స్టాలో ఉన్న తన ఫేక్ ఐడీ ద్వారా పబ్లిక్ డొమైన్‌లో షేర్ చేశాడు. సాంకేతిక పరిజ్ఞానం ద్వారా వివరాలన్నింటినీ సేకరించిన పోలీసులు.. ఆ డాక్టర్‌ను అరెస్ట్ చేసేందుకు వెళితే ఆ తప్పు తాను చేయలేదంటూ బుకాయించాడు. తీరా సాక్ష్యాలు చూపించాక తోక ముడవగా నిందితుడిని కోర్టుకు తరలించారు.
చిత్తూరు అర్బన్: రాష్ట్రంలో గత నెల వరకు 1,787 మంది పిల్లల పోర్న్(అశ్లీల) వీడియోలను పలు సామాజిక మాధ్యమాల్లో, స్నేహితులకు షేర్ చేశారు. చట్ట విరుద్ధమైన ఈ నేరానికి పాల్పడిన వాళ్లపై క్రిమినల్ కేసుల నమోదుకు రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించుకుంది. ఇందులో భాగంగా నిందితుల వివరాలను 26 జిల్లాల ఎస్పీలకు అందజేయగా.. వాళ్లపై చర్యలకు పోలీసులు సిద్ధమయ్యారు. నేషనల్ సెంటర్ ఫర్ మిస్సింగ్ అండ్ ఎక్స్‌ప్లాయిటెడ్ చిల్డ్రన్(ఎన్‌సీఎంఈసీ).. అనేది అమెరికాకు చెందిన ఎలాంటి లాభాపేక్ష ఆశించని స్వచ్ఛంద సంస్థ. 2019లో ఈ సంస్థ మనదేశంతో ఒప్పందం చేసుకుంది.
కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో సహకారంతో ఇక్కడ పనిచేస్తోంది. ఈ సంస్థ తప్పిపోయిన, అక్రమ రవాణాకు గురైన పిల్లలతో పాటు లైంగిక దాడికి గురైన పిల్లల్ని సంరక్షిస్తుంది. అలాగే 18 ఏళ్లలోపు వయస్సున్న పిల్లలకు సంబంధించిన అసభ్య వీడియోలు(పోర్న్) ఇంటర్‌నెట్ నుంచి తీసుకుని మరొకరికి చేరవేయడం, సామాజిక మాధ్యమాల ద్వారా షేర్ చేయడం వంటివి చేస్తే ఆ వీడియోలను తొలగించడంతో పాటు వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటుంది.
ఇలా దేశంలోని ప్రతి రాష్ట్రంలో జిల్లాల వారీగా వివరాలు సేకరించి కేంద్ర హోంశాఖ ద్వారా ఆయా రాష్ట్రాల హోంశాఖలకు పంపుతోంది. లింగ భేదంతో సంబంధం లేకుండా పిల్లల గోప్యత, హక్కులను కాలరాసే ఈ చర్యను తీవ్రంగా పరిగణిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం.. ఎస్‌సీఎంఈసీ పంపిన వివరాల ఆధారంగా నిందితులపై ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేయాలని ఆయా జిల్లాల ఎస్పీలకు ఆదేశాలిచ్చింది. ఈ మేరకు నిందితులపై పోలీసులు కేసులు నమోదు చేస్తున్నారు.
అప్‌లోడ్ చేసినా, షేర్ చేసినా.. ఇక అంతే!
ప్రతి నెలా ఇలాంటి నేరాలకు పాల్పడుతున్న నిందితుల వివరాలను టిప్‌లైన్ సాంకేతిక వ్యవస్థతో కేంద్ర హోంశాఖ నుంచి రాష్ట్ర హోంశాఖకు అందుతోంది. ఒక టిప్‌లైన్‌లో ఏ వ్యక్తి ఏ తేదీన, ఏ సమయంలో, ఏ మొబైల్/కంప్యూటర్ నుంచి ఏ పోర్న్ వీడియోను ఆప్‌లోడ్ చేశాడు? ఎందులో షేర్ చేశాడు? ఏ స్థలం నుంచి పోర్న్ వీడియో అప్‌లోడ్ చేశాడు? ఆ చిత్రం ఎన్ని నిమిషాలు ఉంది? ఉపయోగించిన ఎలక్ట్రానిక్ పరికరం ఇంటర్నెట్ ప్రొటోకాల్ అడ్రస్? అనే వివరాలను టిప్‌లైన్‌లో నిక్షిప్తమవుతున్నాయి.
దీనికి సంబంధించిన పూర్తి సాంకేతిక సాక్ష్యాలు కేంద్రం నుంచి రాష్ట్ర పోలీస్‌కు అందుతున్నాయి. పోలీస్ శాఖ దీన్ని జిల్లాల వారీగా విభజించి ఓ ఫైల్‌ను సిద్ధం చేస్తోంది. ఇందులో ప్రతి మూడు నెలలకోసారి ఈ అశ్లీల వీడియోలు షేర్ చేసే వారి వివరాలుంటాయి. గత నెల వరకు రాష్ట్రంలో 1,787 మంది ఈ నేరానికి పాల్పడ్డట్టు నివేదిక అందింది.
అత్యధికంగా గుంటూరులో 330, విశాఖ 270, ఎన్టీఆర్ విజయవాడ 238, కడప 126, నెల్లూరు 102, ప్రకాశం 94, అనంతపురం 90, తిరుపతి 77, శ్రీకాకుళం 70, చిత్తూరు 59, కాకినాడ 56, ప.గో 50, కర్నూలు 49, బాపట్ల 44, కృష్ణా 30, విజయనగరం 25, నంద్యాల 14, ఏలూరు 14, పల్నాడు 12, కోనసీమ 11, అన్నమయ్య 10, సత్యసాయి 6, అనకాపల్లి 4, పార్వతీపురం 2, రాజమండ్రి 2, అల్లూరి సీతారామరాజు 2 మంది ఈ నేరాలకు పాల్పడ్డారు. కాగా, ఇప్పటివరకు 680 మందిపై కేసులు నమోదయ్యాయి.
శిక్షలు కఠినతరం
ఈ కేసుల్లో కఠిన శిక్షలు విధించేలా చట్టాల్లో మార్పులు చేశారు. సాక్ష్యాధారాలు న్యాయస్థానంలో రుజువైతే మొదటిసారి ఐదేళ్ల వరకు కఠిన కారాగార శిక్ష, రెండోసారి ఇదే తప్పు చేస్తే గరిష్టంగా ఏడేళ్ల కఠిన కారాగార శిక్షతో పాటు రూ.10 లక్షల వరకు జరిమానా విధించవచ్చని చట్టం చెబుతోంది.
Comments
Please login to add a commentAdd a comment