
పోలీసుల అదుపులో నిందితులు
లక్నో : శ్మశానాలనుంచి చనిపోయినవారి దుస్తులు దొంగిలించి, వాటిని కొత్తవాటిలా మార్కెట్‌లో అమ్ముతున్న ఓ ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆదివారం ఏడుగురు ముఠా సభ్యులను అదుపులోకి తీసుకున్నారు. ఈ సంఘటన ఉత్తర ప్రదేశ్‌లోని భగపత్ జిల్లాలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. భగపత్ జిల్లా బరౌత్ పోలీస్ స్టేషన్ పరిధికి చెందిన దుస్తుల వ్యాపారస్తుడు పవన్ జైన్ అతడి అనుచరులు దాదాపు 10 సంవత్సరాలుగా శ్మశానాల్లో చనిపోయిన వారి దుస్తులను దొంగిలిస్తున్నారు. వాటిని శుభ్రం చేసి, కంపెనీల ట్రేడ్ మార్క్ ట్యాగ్‌లు అతికించి మార్కెట్‌లో అమ్ముతున్నారు.
సదరు దుస్తుల వ్యాపారస్తుడు తన అనుచరులకు రోజుకు 300 రూపాయలు చెల్లించేవాడు. పక్కా సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు పవన్ జైన్, అతడి కుమారుడు ఆశిష్ జైన్, మేనల్లుడు రిషబ్ జైన్, అనుచరులు రాజు శర్మ, శ్రవణ్ శర్మ, బబ్లూ కష్యప్, షారుఖ్‌ఖాన్‌లను అరెస్ట్ చేశారు. వారి వద్దనుంచి 520 బెడ్ షీట్లు, 127 కుర్తాలు, 140 చొక్కాలు, 34 దోతీలు, 112 ట్రేడ్ మార్క్ స్టిక్కర్లను స్వాధీనం చేసుకున్నారు.
చదవండి : లక్ష ఏళ్ల నాటి ఆదిమానవుల అవశేషాలు.. వాళ్లను చంపింది..
Comments
Please login to add a commentAdd a comment