
అనంతపురం(ఉరవకొండ): పెళ్లి పేరుతో నమ్మించి అవసరాలు తీర్చుకున్న అనంతరం గుట్టుచప్పుడు కాకుండా పెద్దలు కుదిర్చిన అమ్మాయితో పెళ్లికి సిద్ధమైన వంచకుడిపై ఉరవకొండ పోలీసులు కేసు నమోదు చేశారు. బాధితురాలు తెలిపిన మేరకు.. ఉరవకొండకు చెందిన ఓ యువతిని స్థానిక రెడీమేడ్ దుస్తుల దుకాణం నిర్వాహకుడు షర్పీద్దున్ ప్రేమించాడు. దాదాపు 14 ఏళ్లుగా వీరి మధ్య ప్రేమాయణం కొనసాగింది. పెళ్లి చేసుకుంటానని ఆమెను నమ్మించి తన అవసరాలు తీర్చుకుంటూ వచ్చాడు.
ఈ క్రమంలోనే గుత్తికి చెందిన యువతితో షర్పీద్దున్‌కు ఈ నెల 9న వివాహాన్ని కుటుంబ పెద్దలు నిశ్చయించారు. విషయం తెలుసుకున్న బాధితురాలు తాను మోసపోయినట్లు గుర్తించి ఈ నెల 8న ఉరవకొండ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఘటనపై విచారణ చేపట్టిన పోలీసులు వెంటనే గుత్తిలోని వధువు తరఫు పెద్దలకు సమాచారం అందించారు. దీంతో బుధవారం గుత్తిలోని కల్యాణ మంటపంలో నిఖా తంతు ఒక్కసారిగా ఆగిపోయింది. పోలీసులు షర్పీద్దున్‌పై కేసు నమోదు చేసి, విచారణ చేపట్టారు. కాగా, వరుడు షర్పీద్దున్ తీరును ఏవగించుకుని వధువు తరఫు కుటుంబసభ్యులు, బంధువులు పెళ్లిని రద్దు చేసుకున్నట్లు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment