51 కేసులు, నేరాలు చేయడంలో దిట్ట.. ఏడేళ్లుగా అజ్ఞాతంలో.. చివరికి.. | Police Caught Most Wanted Criminal Hyderabad | Sakshi
Sakshi News home page

51 కేసులు, నేరాలు చేయడంలో దిట్ట.. ఏడేళ్లుగా అజ్ఞాతంలో.. చివరికి..

Published Mon, Dec 20 2021 8:56 AM | Last Updated on Mon, Dec 20 2021 9:10 AM

Police Caught Most Wanted Criminal Hyderabad - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాజధానిలోని మూడు కమిషనరేట్ల పోలీసులకు మోస్ట్‌ వాంటెడ్‌గా ఉన్న ఘరానా రౌడీషీటర్‌ మహ్మద్‌ అష్వఖ్‌ను దక్షిణ మండల టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు పట్టుకున్నారు. ఇతడిపై 51 కేసులు ఉండటంతో విచారణ తప్పించుకోవడానికి 2014 నుంచి అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడని అదనపు డీసీపీ చక్రవర్తి గుమ్మి ఆదివారం తెలిపారు. కాలాపత్తర్‌ ప్రాంతానికి చెందిన అష్వఖ్‌ 2000 సంవత్సరం నుంచి నేరాలు చేస్తున్నాడు. గ్యాంగ్‌స్టర్‌ అయూబ్‌ ఖాన్‌ను అనుచరుడిగా వ్యవహరించాడు. కాలాపత్తర్, ఫలక్‌నుమ, రెయిన్‌బజార్, శాలిబండ, సంతోష్‌నగర్, అంబర్‌పేట్, రాజేంద్రనగర్, పహాడీషరీఫ్‌ల్లో ఇతడిపై కేసులు ఉన్నాయి.

దీంతో 2005లో ఇతడిపై కాలాపత్తర్‌ పోలీసులు రౌడీషీట్‌ తెరిచారు. దాడి, హత్యాయత్నం, దొంగతనం, దోపిడీలతో పాటు తుపాకులతో బెదిరించిన ఆరోపణలపై 51 కేసులు నమోదయ్యాయి. పహాడీషరీఫ్‌ ప్రాంతంలో తన అనుచరులతో కలిసి 2014లో ఓ వ్యక్తిని తుపాకీతో బెదిరించి డబ్బు వసూలు చేయడానికి ప్రయత్నించాడు. ఈ కేసులో అనుచరులు అంతా అరెస్టు కాగా... అష్వఖ్‌ మాత్రం గుజరాత్‌ పారిపోయాడు. అక్కడి ఉండీ కాలాపత్తర్‌లో ఇద్దరిని బెదిరించడంతో రెండు కేసులు రిజిస్టర్‌ అయ్యాయి. ఇతడిపై ఉన్న కేసుల విచారణను తప్పించుకోవడానికి కోర్టుకు గైర్హాజరయ్యాడు. దీంతో వివిధ కేసులకు సంబంధించిన 16 నాన్‌ బెయిలబుల్‌ వారెంట్లు జారీ అయ్యాయి.

ఇలా మోస్ట్‌ వాంటెడ్‌గా మారిన అష్వఖ్‌ను పట్టుకోవడానికి సౌత్‌జోన్‌ టాస్క్‌ఫోర్స్‌ రంగంలోకి దిగింది. ఇన్‌స్పెక్టర్‌ ఎస్‌.రాఘవేంద్ర నేతృత్వంలో ఎస్సైలు వి.నరేందర్, ఎన్‌.శ్రీశైలం, మహ్మద్‌ థకియుద్దీన్, కె.చంద్రమోహన్‌ తమ బృందాలతో నిఘా ఉంచారు. గుజరాత్‌ నుంచి రాజస్థాన్‌కు మకాం మార్చిన ఇతగాడు రహస్యంగా నగరానికి వచ్చిపోతున్నాడనే సమాచారం అందడంతో నెల రోజులుగా కాపుకాశారు. ఆదివారం సిటీకి వచ్చిన అష్వఖ్‌ను పట్టుకున్నారు. తదుపరి చర్యల నిమిత్తం కాలాపత్తర్‌ పోలీసులకు అప్పగించామని చక్రవర్తి తెలిపారు.

చదవండి: కట్నం డబ్బుతో వరుడు పరార్‌.. ఇంకెవరూ తనలా మోసపోకూడదని ఏం చేసిందంటే!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement