జైపూర్ : రాజస్ధాన్‌లోని కరౌలి జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. భూ వివాదంలో ఆలయ పూజారిని కొందరు సజీవ దహనం చేసిన ఘటన వెలుగుచూసింది. కరౌలి జిల్లాలోని గ్రామంలో రాధాకృష్ణ ఆలయంలో పూజాధికాలు నిర్వహించేందుకు పూజారికి 5.2 ఎకరాలు అప్పగించారు. అయితే ఈ భూమి కరౌలీలో వివాదానికి దారితీసింది. గ్రామ పూజారి బాబాలాల్ వైష్ణవ్ తన భూమిని ఆనుకుని ఉన్న ఈ ప్లాట్‌లో ఇంటి నిర్మాణం చేపట్టేందుకు స్థలం చదును చేసే పనులు చేపట్టారు. ఈ భూమి తమదని ఇందులో నిర్మాణాలు చేపట్టరాదని అంటూ మీనా వర్గీయులు అడ్డుకున్నారు. వివాదం గ్రామ పెద్దల వద్దకు చేరడంతో వారు పూజారికి అనుకూలంగా నిర్ణయం తీసుకున్నారు.
దీంతో ఆ భూమి తనదే అంటూ పూజారి ఆ స్థలంలో తన పంట దిగుబడిని ఉంచాడు. పూజారి చదును చేసిన స్ధలంలో గుడిసె నిర్మించేందుకు నిందితులు ప్రయత్నించారు. ఈ క్రమంలో ఘర్షణ చెలరేగడంతో స్ధలంలో ఉన్న తన పంటను ఆరుగురు వ్యక్తులు తగులబెట్టడంతో పాటు తనపై కూడా పెట్రోల్ పోసి నిప్పంటించారని స్టేట్‌మెంట్‌లో పూజారి పేర్కొన్నారని పోలీసులు చెప్పారు. పూజారి కాలిన గాయాలతో జైపూర్ ఎస్‌ఎంఎస్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గురువారం రాత్రి మరణించారు. నిందితులపై హత్యాయత్నం కేసు నమోదు చేశామని, ప్రధాన నిందితుడు కైలాష్ మీనాను అరెస్ట్ చేశామని సీనియర్ పోలీస్ అధికారి హజ్రి లాల్ యాదవ్ తెలిపారు. చదవండి : ముగ్గురు విద్యార్ధినుల సజీవ దహనం
Comments
Please login to add a commentAdd a comment