రైతు ప్రభాకర్ ఆత్మహత్య చేసుకున్నాడా.. ఎవరైనా ప్రేరేపించారా ?
అసలేం జరిగిందంటూ సీఎం రేవంత్‌రెడ్డి ఆరా
ఘటనపై సమగ్ర దర్యాప్తు చేయాలని అధికారులకు ఆదేశం
రెవెన్యూ, పోలీస్ అధికారుల నుంచి సమాచార సేకరణ
సాక్షి ప్రతినిధి, ఖమ్మం/చింతకాని/హైదరాబాద్: : ఖమ్మం జిల్లా చింతకాని మండలం ప్రొద్దుటూరు గ్రామానికి చెందిన రైతు బోజెడ్ల ప్రభాకర్(45) సోమవారం భూవివాదంలో పురుగులమందు తాగి ఆత్మహత్య చేసుకోగా, ఈ ఘటనపై పలు అనుమానాలు వెల్లువెత్తుతున్నాయి. ఆయన స్వతహాగా నిర్ణయం తీసుకున్నారా.. ఎవరైనా ఆత్మహత్యకు ప్రేరేపించిరా అనే దానిపై స్పష్టత రావడం లేదు. ఆయన చెబుతున్న మాటలను గుర్తు తెలియని వ్యక్తులు వీడియో తీయడంతో పురుగుల మందు తాగిన సమయాన వారు అక్కడే ఉన్నారని భావిస్తున్నారు.
ప్రభాకర్ ఆత్మహత్య ఘటనపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తీవ్రంగా స్పందించారు. ఘటనపై తక్షణమే సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన అధికారులను ఆదేశించారు. మరోవైపు మంత్రి తుమ్మల కూడా తీవ్రంగా స్పందించారు. ఆత్మహత్య ఘటనపై విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని రెవెన్యూ, పోలీస్ అధికారులకు ఆదేశాలు ఇచ్చారు.
విచారణ జరిపి తక్షణమే ప్రభుత్వానికి నివేదిక అందజేయాలన్నారు. దీంతో అదికారులు నివేదిక సమర్పించినట్టు తెలిసింది. మాజీ ఎమ్మెల్యే, ధరణి పునర్నిర్మాణ కమిటీ సభ్యుడు ముదిరెడ్డి కోదండరెడ్డి కూడా చింతకాని తహసీల్దార్‌తో ఫోన్‌లో మాట్లాడారు. వివరాలు ఆరా తీయడమే కాక ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లే వరకు స్థానిక అధికారులు ఏం చేశారని ప్రశ్నించినట్టు సమాచారం.
వీడియో తీసి... వాట్సాప్ గ్రూపులో పెట్టి
కలెక్టరేట్ వద్ద ప్రభాకర్ తన తండ్రిని వెళ్లిపోవాలని సూచించారు. ఆ తర్వాత గ్రామానికి చెందిన ఇద్దరు ప్రభాకర్‌ను బయటకు తీసుకెళ్లి పురుగుల మందు డబ్బా పట్టుకొని ఎలా మాట్లాడాలో రిహార్సల్ చేయించాక, ఆయన వివరిస్తుండగా వీడియో తీసినట్టు తెలిసింది. సోమవారం మధ్యాహ్నం సుమారు 3.39 గంటలకు తీసిన వీడియోను సాయంత్రం 5.40 గంటలకు వాట్సాప్ గ్రూప్‌లో పెట్టారు. దీంతో మధ్య రెండు గంటల సమయంలో ఏం జరిగిందో తేలాల్సి ఉంది.
అయితే, రైతు ప్రభాకర్ ఆత్మహత్యలో రాజకీయకుట్ర దాగుందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రభాకర్ తొలుత సమస్యను బీఆర్‌ఎస్, కాంగ్రెస్ నాయకులకు విన్నవించాడు. కాంగ్రెస్ నాయకులు అనుకూలంగా మాట్లాడకపోవటంతో బీఆర్‌ఎస్ నాయకుల ద్వారా అధికారులకు ఫిర్యాదు చేశాడు.
ఈ నేపథ్యంలో కాంగ్రెస్ నాయకులను అవమాన పరచాలనే ఉద్దేశంతోనే ప్రభాకర్ ఆత్మహత్య చేసుకునేలా కొందరు ప్రేరేపించారని ప్రచారం జరుగుతోంది. ఈ మేరకు వీడియో తీసినట్టు భావిస్తున్న గ్రామానికి చెందిన ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు తెలిసింది.
విచారణ చేయిస్తున్నాం..
ఖమ్మం పోలీసు కమిషనర్ సునీల్‌దత్‌ను ఈ విషయమై ఆరా తీయగా రైతు బోజడ్ల ప్రభాకర్ ఆత్మహత్యపై పూర్తిస్థాయిలో విచారణ చేయిస్తున్నామని తెలిపారు. ఆయన తండ్రి ఫిర్యా దుతో ఇప్పటికే పది మందిపై కేసు నమోదు చేసినట్టు చెప్పా రు. అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టి ఎవరు బాధ్యులుగా ఉన్నా కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.
సీఎం, డిప్యూటీ సీఎం న్యాయం చేయాలనడంతో..
బోజడ్ల ప్రభాకర్ తన తండ్రి పెదవీరయ్యతో కలిసి సోమవారం ప్రజావాణిలో ఫిర్యాదు చేసేందుకు కలెక్టరేట్‌కు వచ్చాడు. కలెక్టర్ లేకపోవడం, అంతకు ముందే సమయం అయిపోవడంతో అధికారులు వెళ్లిపోగా సిబ్బందికి ఫిర్యాదు ఇచ్చారు. ఆ తర్వాత ప్రభాకర్ ఓ మామిడితోటలో వీడియోలో పురుగుల మందు డబ్బా చూపిస్తూ మాట్లాడాక మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు.
అయితే ఈ వీడియోలో తనకు న్యాయం చేయాలంటూ సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పేర్లు పేర్కొనడం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. అంతేకాకుండా వీడియోలో ప్రభాకర్ కన్నీటిపర్యంతమవుతూ తనకు అన్యాయం జరిగిందని చెప్పడంతో ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. ప్రభాకర్ కలెక్టరేట్‌కు ఎప్పుడు వచ్చాడు, ఆయనతో ఎవరెవరు ఉన్నారు, మండల స్థాయిలో అధికారులను కలిసినా ఎందుకు పరిష్కారం చూపలేదనే అంశంపై ప్రభుత్వం ఆరా తీస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment