ముంబై: బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మృతితో వెలుగులోకి వచ్చిన డ్రగ్స్ వ్యవహారంలో నార్కొటిక్స్ కంట్రోల్ బ్యూరో విచారణ వేగవంతం చేసింది. ఈ కేసులో ఇప్పటికే పలువురిని అరెస్టు చేసిన ఎన్‌సీబీ నటి రియా చక్రవర్తికి ఆదివారం ఉదయం సమన్లు జారీ చేసింది. ఈ క్రమంలో ముంబైలోని ఆమె ఇంటికి చేరుకున్న అధికారులు విచారణలో భాగంగా పలు ప్రశ్నలు సంధించారు. తదుపరి విచారణకై ఎన్‌సీబీ ప్రధాన కార్యాలయానికి రావాల్సిందిగా చెప్పడంతో.. ముంబై పోలీసుల రక్షణ నడుమ రియా అక్కడకు బయల్దేరారు. మరికాసేపట్లో ఆమె అక్కడికి చేరుకోనున్నారు. ఏ క్షణమైనా రియా అరెస్టయ్యే అవకాశాలు ఉన్నాయి.(చదవండి: కంగ్రాట్స్ ఇండియా: రియా చక్రవర్తి తండ్రి)
ఈ సందర్భంగా.. రియా చక్రవర్తి న్యాయవాది సతీశ్ మనేషిండే మాట్లాడుతూ.. ‘‘ఈ పరిస్థితుల్లో రియా ఏ క్షణమైనా అరెస్టు కావడానికి సిద్ధంగా ఉన్నారు’’అని తెలిపారు. ఆమె పేరిట మరో ప్రకటన కూడా విడుదల చేశారు. ‘‘ఒకరిని ప్రేమించడం నేరం కానేకాదు. ఆ ప్రేమ కోసం ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కోవడానికి నేను సిద్ధంగా ఉన్నాను. నాకు వీటన్నింటితో ఎలాంటి సంబంధం లేదు. అయినప్పటికీ బిహార్ పోలీసులు, సీబీఐ, ఈడీ, ఎన్‌సీబీ నమోదు చేసిన కేసుల్లో ముందస్తు బెయిలు కోసం కోర్టును ఆశ్రయించలేదు’’ అని ఉద్వేగానికి గురయ్యారు.
కాగా ఈ కేసులో ఇప్పటికే ఆమె సోదరుడు షోవిక్ చక్రవర్తిని ఎన్‌సీబీ అధికారులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. రియానే తనను డ్రగ్స్ తీసుకురమ్మన్నట్లుగా అతడు చెప్పడంతో పాటుగా మరిన్ని సంచలన నిజాలు బయటపెట్టాడు. దీంతో ఆమె చుట్టూ ఉచ్చు మరింతగా బిగుసుకుంది. ప్రస్తుతం ఎన్‌సీబీ అధికారులు సమీర్ వాంఖడే, కేపీఎస్ మల్హోత్రా ఆధ్వర్యంలో రియా విచారణ కొనసాగుతోంది.
Comments
Please login to add a commentAdd a comment