లింగాల: పులివెందుల–పార్నపల్లె ప్రధాన రహదారిలోని కడప–అనంతపురం జిల్లాల సరిహద్దు గ్రామమైన అనంతపురం జిల్లా యల్లనూరు మండలం కొట్టాల గ్రామ సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో అనంతపురం జిల్లా సింగవరం గ్రామానికి చెందిన జొళ్లోల్ల నాగరాజు(30) కర్ణాటక రాష్ట్రం హుబ్లీకి చెందిన సౌజన్యశ్రీ(7)అనే చిన్నారి మృతిచెందారు. పోలీసుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి.
సింగవరం గ్రామానికి చెందిన నాగరాజు, నారాయణ ఆదివారం మధ్యాహ్నం ద్విచక్ర వాహనంలో పార్నపల్లె గ్రామానికి బయలు దేరారు. అదే సమయంలో అనంతపురం జిల్లా యల్లనూరు మండలం నాయనపల్లె గ్రామానికి చెందిన ఆదినారాయణ ఆయన అల్లుడు ఆంజనేయులు, మనవరాలు సౌజన్యశ్రీ కలసి కారులో లింగాలకు వస్తుండగా బైక్, కారు ఢీ కొన్నాయి. ఈ ఘటనలో నాగరాజు, ఆదినారాయణ తీవ్రంగా గాయపడ్డారు.
వీరిని పులివెందుల ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలిస్తుండగా నాగరాజు మార్గమధ్యలో మృతిచెందాడు. కారులోని సౌజన్యశ్రీ తలకు కారు డ్యాస్‌బోర్డు తగలడంతో అపస్మారక స్థితిలోకి చేరుకుంది. బాలికను వెంటనే కడప రిమ్స్‌కు తరలించగా చికిత్స పొందుతూ మృతిచెందినట్లు ఎస్‌ఐ రుషికేశ్వరరెడ్డి తెలిపారు.
ఆదినారాయణ మనువడు లింగాల బీసీ హాస్టల్‌లో చదువుతున్నాడు. ఆ బాలున్ని చూసేందుకు ఆదినారాయణతోపాటు అల్లుడు, కూతురు, మనువరాలు సౌజన్యశ్రీ వస్తుండగా ప్రమాదం జరిగిందని ఎస్‌ఐ తెలిపారు. నాగరాజుకు భార్య హరిత, కుమార్తె సత్యశ్రీ ఉన్నారు. యల్లనూరు పోలీసులు కేసు నమోదుచేసినట్లు చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment