ఘటనా స్థలాన్ని పరిశీలిస్తున్న పోలీసులు, యాదగిరి
కొండపాక (గజ్వేల్): కారు అదుపు తప్పి పాడుబడిన వ్యవసాయ బావిలో పడిన దుర్ఘటనలో ఒకరు మృతి చెందగా, ఇద్దరు ప్రాణాలతో బయటపడ్డారు. సిద్దిపేట జిల్లా కొండపాక మండలం జప్తినాచారం గ్రామ శివారులో ఈ ఘటన జరిగింది. స్థానికుల కథనం ప్రకారం.. దౌల్తాబాద్ మండలం సూరంపల్లికి చెందిన కెమ్మసారం యాదగిరి (40), సిద్దిపేట పట్టణానికి చెందిన కెమ్మసారం కనకయ్య (55) తోడల్లుళ్లు. వారిద్దరూ ఆదివారం కొండపాక మండలం సిర్సనగండ్ల గ్రామంలోని అత్తగారింటికి కారులో వచ్చారు.
వారి అత్తమ్మ దేవరాయ పోశవ్వ అనారోగ్యంతో బాధపడుతుండగా ఆమెను పరామర్శించారు. అనంతరం అక్కడినుంచి బావమరిది దేవరాయ వెంకటస్వామి (38)తో కలసి కారులో దుద్దెడకు బయల్దేరారు. మార్గమధ్యలో జప్తినాచారం గ్రామ శివారులో కారు అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న పాడుబడిన వ్యవసాయ బావిలో పడింది. ఒక్కసారిగా పెద్ద శబ్దం రావడంతో సమీపంలోని రాజంపల్లి గ్రామస్తులు సంఘటనా స్థలానికి చేరుకొని విషయాన్ని కుకునూరుపల్లి పోలీసులకు, రెవెన్యూ అధికారులకు తెలియజేశారు.
వెంటనే తహసీల్దార్ రామేశ్వర్, కుకునూరుపల్లి ఎస్‌ఐ పుష్పరాజ్ ఘటనా స్థలానికి చేరుకున్నారు.స్థానికుల సహాయంతో బావిలోకి తాడును పంపి కనకయ్య, వెంకటస్వామిని బయటకు తీశారు. కాగా డ్రైవింగ్ సీట్లో ఉన్న యాదగిరి కారులోనే ఇరుక్కుపోయి బావిలోని నీటిలో మునిగి మృతి చెందారు. బయటకు తీసిన ఇద్దరిని 108 అంబులెన్సులో సిద్దిపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
మృతుడిని బయటకు తీయడానికి అధికారులు బావిలోని నీరును తోడేందుకు చర్యలు చేపట్టారు. అయితే రాత్రి 8 గంటల వరకు బావిలో నీరు తగ్గకపోవడంతో యాదగిరి మృతదేహాన్ని బయటకు తీయలేకపోయారు. కాగా యాదగిరి (40) ఎద్దుమైలారంలోని ఓడీఎఫ్ ఫ్యాక్టరీలో పని చేస్తున్నారు. ఆయనకు భార్య, ఇద్దరు కూతుర్లు ఉన్నారు. ఈ విషయం తెలిసి వచ్చిన మృతుని కుటుంబీకులు, బంధువులు సంఘటనా స్థలంలో కన్నీరుమున్నీరుగా విలపించారు. డీసీసీబీ చైర్మన్ చిట్టి దేవేందర్‌రెడ్డి, సిర్సనగండ్ల సర్పంచ్ గూడెపు లక్ష్మారెడ్డి పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment