ప్రమాదంలో నుజ్జునుజ్జు అయిన టాటాఏస్ వాహనం
నిడమనూరు: మృత్యువు దారికాచి వెంటపడినట్టు పొగ మంచు ఓ కుటుంబాన్ని రోడ్డు ప్రమాదంలో బలితీసుకుంది. రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన యువకుడి వద్దకు వస్తున్న కుటుంబ సభ్యులు కూడా రోడ్డు ప్రమాదం బారినపడ్డారు. పొగ మంచుకు అతివేగం, నిర్లక్ష్యం తోడై ఆరు ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. నల్ల గొండ జిల్లా నిడమనూరు మండలంలో ఆదివారం రాత్రి, సోమవారం తెల్లవారు జామున ఈ ప్రమాదాలు జరిగాయి.
బైక్‌పై స్వగ్రామానికి వస్తూ..
ఉమ్మడి నల్లగొండ జిల్లా పెద్దవూర మండలం నిమ్మానాయక్ తండా ఆవాస గ్రామమైన మల్లెవానికుంట తండాకు చెందిన రమావత్ శివనాయక్ (19) ఏపీలోని గుంటూరులో వేడుకల్లో డీజే సిస్టమ్, పూల అలంకరణ పనిచేస్తూ జీవిస్తున్నాడు. ఆదివారం రాత్రి గుంటూరు నుంచి బైక్‌పై స్వగ్రామానికి బయలుదేరాడు. రాత్రి 10 గంటల సమయంలో నిడమనూరు మండలంలోని వేంపాడు స్టేజీ వద్ద రోడ్డు దాటుతున్న బల్గూరి సైదులు (55)ను ఢీకొట్టాడు. ఈ ఘటనలో వేంపాడుకు చెందిన బల్గూరి సైదులు తలకు తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతి చెందగా.. శివనాయక్ తలకు తీవ్ర గాయాలయ్యాయి. అతడిని మిర్యాలగూడ ఏరియా ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మృతిచెందాడు.
కుమారుడి వద్దకు వస్తూ..
శివనాయక్ రోడ్డు ప్రమాదానికి గురైన విషయం తెలిసి హైదరాబాద్‌లో ఉంటున్న తండ్రి రమావత్ ప్రభాకర్, బంధువులతో కలసి టాటా ఏస్ వాహనంలో మిర్యాలగూడకు బయలుదేరారు. వాహనంలో శివనాయక్ తండ్రి ప్రభాకర్, మేనమామ మూడావత్ పాలేఖ, రమావత్ వినోద్‌తోపాటు పెదనాన్న రమావత్ గనియా (43), బావ దుమావత్ నాగరాజు(25), మేనత్త రమావత్ బుజ్జి (44), డ్రైవర్ రమావత్ పాండు (42) ఉన్నారు.
సోమవారం తెల్లవారుజామున 3 గంటల సమయంలో వారి వాహనం నిడమనూరు మండలంలోని 3వ నంబర్ కెనాల్ సమీపంలో ప్రయాణిస్తోంది. అదే సమయంలో ఏపీలోని జగ్గయ్యపేట నుంచి కర్నాటకలోని మంగళూరుకు వెళ్తున్న డీజిల్ ట్యాంకర్ టాటా ఏస్ వాహనాన్ని ఎదురుగా ఢీకొట్టింది. శివనాయక్ బైక్ ప్రమాదం జరిగిన కిలోమీటరు దూరంలోనే ఈ ప్రమాదం జరగడం గమనార్హం.
నలుగురు అక్కడిక్కడే మృతి..
ట్యాంకర్, టాటా ఏస్ ఢీకొన్న ప్రమాదంలో రమావత్ బుజ్జి, రమావత్ పాండు, గనియాలతోపాటు ఏపీలోని దొర్నాలకు చెందిన దుమావత్ నాగరాజు అక్కడిక్కడే మృతి చెందారు. రమావత్ ప్రభాకర్, రమావత్ వినోద్, మూడావత్ పాలేఖకు తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాద విషయం తెలిసిన పోలీసులు వెంటనే ఘటనా స్థలికి చేరుకుని క్షతగాత్రులను మిర్యాలగూడ ఏరియా ఆస్పత్రికి, తర్వాత స్థానికంగా ఉన్న వేర్వేరు ప్రైవేట్ ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. నలుగురి మృతదేహాలను మిర్యాలగూడ ఏరియా ఆస్పత్రికి తరలించారు.
ట్యాంకర్‌ను నడుపుతున్న క్లీనర్..
ఈ రెండు ప్రమాదాలకు పొగ మంచు, అతి వేగంతోపాటు నిర్లక్ష్యంగా నడపడం కూడా కారణమని గుర్తించినట్టు పోలీసులు తెలిపారు. ప్రమాద సమయంలో డీజిల్ ట్యాంకర్‌ను డ్రైవర్ శ్రీను కాకుండా క్లీనర్ జయప్రకాశ్ నడుపుతున్నట్టు తేల్చారు. బైక్ ఘటనలో మృతిచెందిన బల్గూరి సైదులు కుమారుడు బల్గూరి వెంకన్న ఫిర్యాదు మేరకు ఒక కేసు.. ట్యాంకర్, టాటా ఏస్‌ను ఢీకొన్న ప్రమాదంలో మృతుడు గనియా భార్య లక్ష్మి ఫిర్యాదు మేరకు మరో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై గోపాల్‌రావు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment