సాక్షి, పశ్చిమగోదావరి: పశ్చిమగోదావరి జిల్లాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. జంగారెడ్డిగూడెం మండలం జల్లేరు వాగులో ఆర్టీసీ బస్సు అదుపుతప్పి బోల్తా పడింది. ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించబోయి బ్రిడ్జి రెయిలింగ్‌ను ఢీకొని జల్లేరు వాగులో బోల్తా పడింది. ప్రమాదంలో డ్రైవర్‌తో సహా 10 మంది ప్రయాణికులు మృతి చెందారు. ప్రమాద సమయంలో బస్సులో 47మంది ఉన్నట్లు తెలుస్తోంది. ఎస్పీ రాహుల్ దేవ్‌శర్మ, ఎమ్మెల్యే ఎలీజా సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలను వేగవంతం చేశారు.
అశ్వరావుపేట నుంచి జంగారెడ్డిగూడెం వైపు ప్రయాణిస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. గాయపడినవారిని జంగారెడ్డిగూడెం ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు. వాగు నుంచి బస్సును వెలికి తీసేందుకు అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. బస్సు బయటకు వస్తేగాని మొత్తం మృతుల సంఖ్య ప్రకటించలేమని అధికారులు తెలిపారు.
ప్రధాని మోదీ దిగ్భ్రాంతి
జంగారెడ్డి గూడెం బస్సు ప్రమాద ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, పశ్చిమగోదావరి జిల్లాలో జరిగిన బస్సు ప్రమాదంలో ప్రాణ నష్టం జరగడం బాధాకరంగా ఉంది. ఈ దుఃఖ సమయంలో బాధిత కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నాను' అని ప్రధాని మోదీ ట్వీట్ చేశారు.
ఉపరాష్ట్రపతి దిగ్భ్రాంతి
పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డి గూడెం బస్సు ప్రమాద ఘటనపై ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. 'ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమగోదావరి జిల్లాలో జరిగిన బస్సు ప్రమాద దుర్ఘటన అత్యంత విచారకరం. ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ప్రార్ధిస్తున్నాను' అంటూ ట్వీట్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment