మొగల్తూరు: తెల్లారితే చెల్లి పెళ్లి. అందరూ పెళ్లి పనుల్లో బిజీగా ఉన్నారు. స్నేహితులతో సరదాగా బీచ్‌కు వచ్చిన యువకుడు, అతని స్నేహితుడు నీటిలో మునిగి మృత్యువాత పడిన ఘటన పశ్చిమ గోదావరి జిల్లా పేరుపాలెం బీచ్‌లో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం... పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లుకు చెందిన వజ్జిపోతు సత్యనారాయణ కుటుంబం హైదరాబాద్‌లోని దిండిగల్‌లో స్థిరపడింది. వారి కుమార్తె వజ్జిపోతు ఆశాజ్యోతికి ఇటీవల వివాహం నిశ్చయించగా, తమ సొంత ఊరైన పాలకొల్లులోనే పెళ్లి చేయాలని నిర్ణయించుకున్నారు.
కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులంతా కలిసి పాలకొల్లు వచ్చారు. బుధవారం పెళ్లి జరగాల్సి ఉంది. అయితే పెళ్లి కుమార్తె అన్న వజ్జిపోతు రాజేష్ (22), నిజాంపేటకు చెందిన అతని స్నేహితుడు బండారు వినయ్ (16) మరో తొమ్మిది మంది స్నేహితులతో కలిసి మంగళవారం సాయంత్రం నాలుగు గంటల సమయంలో పేరుపాలెం బీచ్‌కి వచ్చారు. స్నానానికి దిగిన రాజేష్, వినయ్ నీటిలో గల్లంతవడంతో అతని స్నేహితులు ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యారు.
స్థానికుల సహాయంతో వారి కోసం గాలింపు చేపట్టగా, రాజేష్ మృతదేహం లభించింది. కొన ఊపిరితో ఉన్న వినయ్‌ని ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే మృతి చెందాడు. కుమార్తె పెళ్లి వేళ కుమారుడు శాశ్వతంగా దూరమవడంతో అతని తల్లిదండ్రులు సత్యనారాయణ, నాగవేణి కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment