కళ్యాణదుర్గానికి చెందిన ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడు నాలుగు నెలల క్రితం ‘సంకల్ప సిద్ధి మార్ట్’ గురించి తెలుసుకుని రూ.5 లక్షలకు పైగా డిపాజిట్ చేశాడు. ఆకర్షణీయమైన కమీషన్‌తో ఆదాయం పొందవచ్చని.. తన తరఫున మరో పది మందిని సభ్యులుగా చేర్చి వారితోనే రూ.లక్షల్లో డిపాజిట్ చేయించారు. ఇటీవల మార్ట్ లావాదేవీలు స్తంభించిపోవడంతో కంగుతిన్నాడు. తనకు రావాల్సిన డబ్బు కోసం ఎదురు చూస్తున్నాడు.
కళ్యాణదుర్గం పట్ణంలో ఆటు నడుపుకుంటూ జీవనం సాగించే యువకుడు చుట్టుపక్కల వారు, స్నేహితులతో సంకల్ప సిద్ది మార్ట్‌లో రూ.20 వేల దాకా డిపాజిట్ చేయించాడు. ఆదాయం వస్తుందని ఆశపడితే తీవ్ర నిరాశ ఎదురైంది. మార్ట్ లావాదేవీలు నిలిపేశారని తెలుసుకుని లబోదిబోమంటున్నాడు. ఇలా వీరిద్దరే కాదు. విజయవాడ కేంద్రంగా నడిచిన ‘సంకల్ప సిద్ధి మార్ట్’ గొలుసుకట్టు వ్యాపారంలో కళ్యాణదుర్గం నియోజకవర్గ వ్యాప్తంగా వందలాదిమంది డిపాజిట్లు పెట్టి నిలువునా మోసపోయారు.
కళ్యాణదుర్గం(అనంతపురం జిల్లా): గొలుసుకట్టు (చైన్‌లింక్) వ్యాపారంలో మరో సంస్థ బోర్డు తిప్పేసింది. మీ సొమ్ముకు రెట్టింపు మొత్తం పొందవచ్చని, ఆన్‌లైన్ షాపింగ్ ఉచితంగా చేసుకోవచ్చని దాదాపు ఐదు రకరకాల స్కీంలతో ‘సంకల్ప సిద్ధి మార్ట్’ సంస్థ మొబైల్ యాప్ రూపొందించింది. ఇంకేముంది ఎంతోమంది తమ ఆదాయం పెంచుకోవడం కోసం మార్ట్ వైపు ఆకర్షితులయ్యారు. డిపాజిట్‌గా వెయ్యి రూపాయలు కడితే.. రోజుకు పది రూపాయల కమీషన్, తన తరఫున మరొకరితో డిపాజిట్ చేయిస్తే మరో ఐదు రూపాయలు ఇస్తామని తెలిపింది. అందరికీ అందుబాటులోనే డిపాజిట్ మొత్తం ఉందని భావించి కళ్యాణదుర్గం నియోజకవర్గంలో కూలీనాలి చేసుకునే వారి నుంచి ఆటో డ్రైవర్లు, వ్యాపారులు, ఉద్యోగులు నమ్మి డిపాజిట్ చేశారు. ప్రారంభంలో ఆ సంస్థ చెప్పినట్టుగానే రోజువారీ కమీషన్ ఖాతాలకు జమ చేస్తుండటంతో డిపాజిట్‌దారులకు నమ్మకం కలిగింది. అలా సాగిపోతున్న క్రమంలో ఉన్నపలంగా యాప్ పనిచేయలేదు. ఈ రోజు పనిచేస్తుంది.. రేపు పని చేస్తుందని ఎదురుచూస్తుండగా విజయవాడలో ‘సంకల్ప సిద్ధి మార్ట్’ నిర్వాహకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అప్పుడు డిపాజిట్‌దారులు తాము మోసపోయామని బోధపడింది. కష్టపడి సంపాదించి మార్ట్‌లో పెట్టిన సొమ్ము తిరిగి వస్తుందో రాదో అని ఆందోళన చెందుతున్నారు.
డిపాజిట్లు రూ.50 కోట్లు!..
కళ్యాణదుర్గం నియోజకవర్గంలో దాదాపు 600 మంది ‘సంకల్ప సిద్ధి మార్ట్’లో డిపాజిట్ చేశారు. రూ.1000 మొదలుకొని లక్షలాది రూపాయల వరకు పెట్టుబడులు పెట్టారు. ఇందులో అత్యధికంగా ప్రభుత్వ ఉపాధ్యాయులు రూ.లక్ష నుంచి రూ.5 లక్షల వరకు పెట్టుబడి పెట్టినట్లు సమాచారం. ఇలా మొత్తంగా ఈ ప్రాంతంలోనే రూ.50 కోట్ల మేర పెట్టుబడులు పెట్టినట్లు ప్రాథమిక సమాచారం.
మాయ చేశారిలా..
స్కీమ్ –1 : సంకల్పసిద్ధి మార్ట్‌లో రూ.1000 డిపాజిట్ చేస్తే రోజుకు రూ.10 కమీషన్ తో పాటు నెలలోపు రూ.300 విలువ చేసే కిరాణా సరుకులు ఆన్‌లైన్ ద్వారా పొందవచ్చు.
స్కీమ్ –2 : రూ.లక్ష డిపాజిట్ చేస్తే రోజుకు రూ.1000 చొప్పున 300 రోజుల్లో రూ.3 లక్షలు ఇస్తాం. దీంతో పాటు అదనంగా తన ఖాతా ద్వారా చేర్పించిన సభ్యుల తరపున కమీషన్ కూడా జమ అవుతుంది.
స్కీమ్ –3 : రూ.లక్ష నగదు చెల్లిస్తే రూ.లక్ష విలువైన బంగారం ఇవ్వడంతో పాటు రోజుకు రూ.100 చొప్పున 300 రోజుల్లో రూ.30 వేలు ఇస్తామని మొబైల్‌కు మెసేజ్‌లు.
స్కీమ్ –4 : రూ.2.5 లక్షలు ఇస్తే 25 ఎర్ర చందనం మొక్కలతో కూడిన స్థలం ఇవ్వడంతో పాటు 15 ఏళ్లకు రూ.1.75 కోట్లు వస్తాయంటూ నమ్మబలికింది.
స్కీమ్ –5 : రూ.5 లక్షలు చెల్లిస్తే సెంటు భూమి ఇవ్వడంతో పాటు 300 రోజుల్లో తిరిగి రూ.2.5 లక్షలు చెల్లిస్తామని మరో రకంగా కస్టమర్లకు ఆశచూపింది.
ఫిర్యాదు వస్తే పరిశీలిస్తాం
సంకల్ప సిద్ధి మార్ట్‌పై బాధితుల నుంచి ఇప్పటివరకు ఎలాంటి ఫిర్యాదూ అందలేదు. ఆన్‌లైన్ ద్వారా డిపాజిట్ చేసిన వారు ఎవరైనా ఫిర్యాదు చేస్తే దానిపై ఉన్నతాధికారులకు నివేదిస్తాం. ఫిర్యాదుపై విచారణ చేస్తాం.
– బి.శ్రీనివాసులు, డీఎస్పీ, కళ్యాణదుర్గం
Comments
Please login to add a commentAdd a comment