ఆరో పెళ్లికి సిద్ధమైన దొంగ బాబా అనూజ్ (ఫోటో కర్టెసీ: ఆజ్‌తక్.ఇన్)
లక్నో: రహస్యంగా ఒకరి తర్వాత ఒకరు చొప్పున ఐదుగురిని వివాహం చేసుకోవమే కాక వారికి విడాకులు ఇవ్వకుండానే ప్రస్తుతం ఆరో వివాహానికి సిద్ధపడ్డ దొంగ బాబాను కాన్పూర్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ వివరాలు.. ఉత్తరప్రదేశ్ షహనాజ్‌పూర్‌కు చెందిన అనూజ్ చేతన్ కథేరియా అనే వ్యక్తికి 2005లో మొదటి సారి వివాహం అయ్యింది. పెళ్లి తర్వాత భార్యను చిత్రహింసలకు గురి చేస్తుండటంతో ఆమె అతడి నుంచి విడిపోయి వేరుగా ఉంటుంది. ప్రస్తుతం వీరి విడాకులు కేసు ఇంకా కోర్టులోనే ఉంది.
ఇదిలా ఉండగానే 2010లో అనూజ్ రెండో వివాహం చేసుకున్నాడు. కొద్ది కాలం తర్వాత ఆమె అనూజ్ వేధింపులు తట్టుకోలేక అతడి నుంచి విడిపోయింది. నాలుగేళ్ల తర్వాత అనూజ్ మూడో వివాహం చేసుకున్నాడు. ఆ తర్వాత కొద్ది రోజులకు మూడో భార్యకు తెలియకుండా ఆమె బంధువును నాలుగో వివాహం చేసుకున్నాడు. పెళ్లి తర్వాత అనూజ్ నిజ స్వరూపం తెలియడంతో అతడు నాలుగో వివాహం చేసుకున్న మహిళ ఆత్మహత్య చేసుకుని మరణించింది.
ఈ క్రమంలో 2019లో అనూజ్ ఐదో సారి వివాహం చేసుకున్నాడు. కొద్ది రోజులు బాగానే ఉన్నప్పటికి ఆ తర్వాత ఐదో భార్యను వేధింపులకు గురి చేయడం ప్రారంభించాడు. దాంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ క్రమంలో అతడికి గతంలోనే నాలుగు సార్లు వివాహం అయినట్లు తెలిసింది. అప్పటి నుంచి ఐదో భార్య అనూజ్ నుంచి వేరుగా ఉండసాగింది. కొద్ది రోజుల క్రితం అనూజ్ 6వ సారి పెళ్లికి సిద్ధమయ్యాడు. ఈ విషయం కాస్త అతడి ఐదో భార్యకు తెలిసింది. వెంటనే కాన్పూర్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు అనూజ్‌ని అరెస్ట్ చేశారు.
దర్యాప్తులో అనూజ్ మ్యాట్రిమోనియల్ సైట్ల ద్వారా తాను వీరందరిని మోసం చేశానని తెలిపాడు. లక్కీ పాండేగా పేరు మార్చుకుని.. తప్పుడు అడ్రెస్‌లు ఇస్తూ.. మహిళలను మోసం చేసేవాడనని వెల్లడించాడు. తనను తాను ప్రభుత్వ ఉద్యోగి, క్లర్క్, టీచర్, తంత్రగాడిగా పరిచయం చేసుకుని బాధితులను ఏమార్చి వారిని వివాహం చేసుకునే వాడినని తెలిపాడు. అలానే సమస్యలతో తన ఆశ్రమానికి వచ్చే మహిళలను ట్రాప్ చేసి లొంగదీసుకునేవాడినని పోలీసుల దర్యాప్తులో వెల్లడించాడు అనూజ్ .
Comments
Please login to add a commentAdd a comment