కాంతమ్మ మృతదేహం వద్ద రోదిస్తున్న బంధువులు
తుంగతుర్తి: భర్తను పోగొట్టుకుని భారంగా బతుకీడుతున్న ఓ అభాగ్యురాలిని కామాంధులు పొట్టనబెట్టుకున్నారు. నాలుగు రోజుల క్రితం లైంగికదాడి చేయడంతో తీవ్ర అస్వస్థతకు గురైన బాధితురాలు చికిత్స పొందుతూ కన్నుమూసింది. సూర్యాపేట జిల్లాలో ఈ దారుణ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసుల కథనం ప్రకారం.. తుంగతుర్తి మండలం రామన్నగూడెం తండాకు చెందిన గుగులోతు కాంతమ్మ (35)కు కుమారుడు, కుమార్తె ఉన్నారు. కాంతమ్మ భర్త వీరన్న పదేళ్లక్రితం మృతిచెందాడు. అప్పటి నుంచి కాంతమ్మ కూలి పనులు చేసుకుని జీవనం సాగిస్తోంది.
పని ఉందని తీసుకెళ్లి..
రామన్నగూడెం తండాకే చెందిన గుగులోతు సోమ్లా ఈ నెల 17న రాత్రి 9 గంటల సమయంలో కాంతమ్మను పని ఉందని చెప్పి ఇంటి నుంచి తీసుకెళ్లాడు. అదే సమయంలో మాలిపురం గ్రామానికి చెందిన శివ, లక్ష్మణ్‌లు సోమ్లా ఇంటికి వచ్చారు. అనంతరం శివ, లక్ష్మణ్‌లు కాంతమ్మను తండా పక్కన ఉన్న తోటలోకి తీసుకెళ్లి లైంగికదాడి చేశారు. తిరిగి ఆమెను రాత్రి 12 గంటల సమయంలో ఇంటికి పంపించారు.
తీవ్ర అస్వస్థతకు గురై..
కాగా, కాంతమ్మ ఈనెల 20న తీవ్ర అస్వస్థతకు గురైంది. దీంతో కుటుంబ సభ్యులు ఆమెను తుంగతుర్తి ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ వైద్యుల సలహా మేరకు సూర్యాపేటలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. శనివారం రాత్రి అక్కడి నుంచి మెరుగైన చికిత్స నిమిత్తం తొర్రూరులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్తుండగా మార్గమధ్యలో మృతిచెందింది.
దీంతో బంధువులు కాంతమ్మ మృతికి కారణమైన సోమ్లా ఇంటి ముందు మృతదేహాన్ని ఉంచి, ఆందోళన చేపట్టారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని సోమ్లాను అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ రవి తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment