![Sister Theft Gold Form Her Younger In Hyderabad - Sakshi](/styles/webp/s3/article_images/2021/09/15/sister.jpg.webp?itok=knh6zIT7)
స్నేహితుడు రాజు
సాక్షి, బంజారాహిల్స్(హైదరాబాద్): ఇంటి తాళాలు పగలగొట్టి బంగారు ఆభరణాలు తస్కరించిన నిందితుడిని జూబ్లీహిల్స్ పోలీసులు మంగళవారం అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. పోలీసుల వివరాల ప్రకారం.. రహమత్‌నగర్‌లో నివసించే పంతం విజయ తన ఇంటికి తాళం వేసి తల్లితో కలిసి స్వగ్రామానికి వెళ్లింది. ఇంటిని కనిపెట్టాలని సమీపంలో నివసించే తన చెల్లెలు జ్యోతికి చెప్పింది.
రహమత్‌నగర్ సమీపంలోని కార్మికనగర్‌లో నివసిస్తున్న చింత రాజు, జ్యోతి ఇద్దరూ చిన్ననాటి స్నేహితులు. ఈ నెల 10వ తేదీన తనను నమ్మి అక్క ఇల్లు అప్పగించగా జ్యోతి తన స్నేహితుడు రాజుతో కలిసి అక్క ఇంటికి కన్నం వేసింది. విజయ ఇంటికి వెళ్లిన జ్యోతి తన స్నేహితుడు రాజుతో కలిసి తాళాలు పగలగొట్టి బీరువాలో ఉన్న 25 తులాల ఆభరణాలను తస్కరించారు. బాధితురాలు ఆ తెల్లవారే ఫిర్యాదు చేస్తూ చింత రాజుపై అనుమానం వ్యక్తం చేసింది. రంగంలోకి దిగిన క్రైం పోలీసులు రాజును అరెస్ట్ చేసి 25 తులాల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు.
విచారించగా ఈ దొంగతనానికి విజయ సోదరి జ్యోతి సహకారం కూడా ఉందని తేలింది. ఇద్దరూ కలిసే పథకం ప్రకారం ఈ దొంగతనానికి పాల్పడినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. ప్రస్తుతం ఆమె పరారీలో ఉన్నట్లు తెలిపారు. చోరీ చేసిన నగలను మణప్పురం, ముత్తూట్‌లో తనాఖాలో పెట్టి రూ.4 లక్షలు తీసుకున్నారు. ఈ డబ్బుతో రాజు బెట్టింగ్‌లకు పాల్పడి సర్వం పోగొట్టుకున్నట్లు తేలింది. జూబ్లీహిల్స్ క్రైం ఇన్‌స్పెక్టర్ రమేష్ ఆధ్వర్యంలో ఎస్‌ఐ హరీశ్వర్‌రెడ్డి కేసు దర్యాప్తు చేస్తున్నారు.
చదవండి: Chittoor: కీచకుడి వికృత చేష్టలు.. బాలికలను మిద్దె మీదకు తీసుకెళ్లి..
Comments
Please login to add a commentAdd a comment