పర్‌ఫెక్ట్ కంపెనీ శానిటైజర్ బాటిళ్లు
సాక్షి ప్రతినిధి, ఒంగోలు :మద్యానికి బానిసైన వారు మద్యం దొరక్క శానిటైజర్ తాగి 16 మంది మృత్యువాత పడ్డారు. కురిచేడులో జరిగిన ఈ ఘటనకు సంబంధించి పోలీసు దర్యాప్తు ‘‘పర్‌ఫెక్ట్’’గా సాగుతోంది. ఘటన జరిగి ఐదు రోజులు గడవక ముందే అందుకు కారణమైన పర్‌ఫెక్ట్ కంపెనీ మూలాలను పోలీసులు గుర్తించారు. తీగ లాగితే డొంక కదిలిన చందంగా మెడికల్ షాపుల్లో తనిఖీలు చేస్తూ వెళ్లిన సిట్ బృందం ఎటువంటి అనుమతులు లేకుండా అక్రమంగా తయారు చేస్తున్న నకిలీ శానిటైజర్ గుట్టును రట్టు చేసింది. కనీసం ఈ శానిటైజర్ తయారీ కేంద్రంలో సాంకేతిక నిపుణులు గానీ కనీసం చదువుకున్న వారు గాని లేని పరిస్థితి. గ్రామాల్లో కూలీ పనులు చేసుకునే వారిని ఓ గోడౌన్‌లో ఉంచి వారి చేత శానిటైజర్ పేరుతో నకిలీవి తయారు చేసి సొమ్ము చేసుకుంటున్న వైనం పోలీసు దర్యాప్తులో బయటపడింది. దీనికి సంబంధించి కొందరు నిందితులను అదుపులోకి తీసుకున్న సిట్ బృందం అసలైన సూత్రధారులను పట్టేపనిలో పడింది. దీనికి సంబంధించిన వివరాల్లోకి వెళ్తే.. కురిచేడు మండల కేంద్రంలో జూలై 30వ తేదీ గురువారం రాత్రి శానిటైజర్ తాగి ఇద్దరు మరణించారనే వార్త బయటికొచ్చింది. అంతా అప్రమత్తమయ్యే లోపే శుక్రవారం 11 మంది, శనివారం ఇద్దరు, ఆదివారం మరొకరు చొప్పున ఏకంగా 16 మంది మృత్యువాత పడ్డారు. చనిపోయిన వారి
ఇళ్ల వద్ద పర్‌ఫెక్ట్ కంపెనీ శానిటైజర్ బాటిళ్లు గుర్తించిన పోలీసులు అవి ఎవరు అమ్మారనే దానిపై విచారణ జరిపినప్పటికీ కురిచేడులో వాటిని అమ్మిన మెడికల్ షాపులు నిర్వాహకులు అప్పటికే వాటిని దాచేసి తమ తప్పును కప్పి పుచ్చుకునేందుకు ప్రయత్నించారు. అయితే ఘటనను సీరియస్‌గా తీసుకున్న రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాలతో జిల్లా ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్ దర్యాప్తు కోసం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్) ఏర్పాటు చేశారు. బృందం ఐదు రోజుల పాటు గుంటూరు, కృష్ణా జిల్లాలతో పాటు కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల్లోని పలు శానిటైజర్ ఫ్యాక్టరీలకెళ్లి తనిఖీలు నిర్వహించింది. అయితే పర్‌ఫెక్ట్ కంపెనీ ఆనవాళ్లు ఎక్కడా కనిపించకపోవడంతో దర్యాప్తును వేగవంతం చేశారు. హైదరాబాద్ నగరంలో శానిటైజర్లు అమ్మే మెడికల్ షాపులను క్షుణ్ణంగా తనిఖీలు చేసే క్రమంలో పర్‌ఫెక్ట్ కంపెనీ శానిటైజర్లను అమ్ముతున్న డిస్ట్రిబ్యూటర్ పాయింట్‌ను కనిపెట్టారు. వీరిని విచారించడంతో పాటు టెక్నాలజీని ఉపయోగించి హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఓ గోడౌన్‌లో అక్రమంగా తయారవుతున్న పర్‌ఫెక్ట్ కంపెనీ కేంద్రాన్ని పట్టుకున్నారు.
అంతా అక్రమమే..
పర్‌ఫెక్ట్ కంపెనీ తయారీ కేంద్రాన్ని పరిశీలించిన సిట్ బృందానికి అక్కడ జరుగుతున్న వ్యవహారాన్ని చూసి ఒళ్లు జలదరించింది. కనీసం ఒక్క టెక్నికల్ పర్సన్ కూడా లేకుండా చదువులేని గ్రామీణ ప్రాంతాల కూలీలను తీసుకొచ్చి శానిటైజర్ పేరుతో ఏదో ద్రవాన్ని తయారు చేస్తున్నట్లుగా గుర్తించారు. శానిటైజర్‌లో ఐసోప్రొఫైల్ ఆల్కహాల్, ప్రొఫనాల్ కాకుండా మిథైలిన్ క్లోరైడ్ (డీసీఎం) ను ఉపయోగించి శానిటైజర్ తయారు చేస్తున్నట్లు తేలింది. ఈ మిథైలిన్ క్లోరైడ్ ప్రమాదకరమైనదని దానిని శానిటైజర్‌లో వాడకూడదని నిపుణుల ద్వారా తెలుసుకున్న పోలీసులు నిర్ఘాంతపోయారు. అక్కడ కొంతమందిని అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు. ఫ్యాక్టరీ పేరుతో చూపుతున్న అడ్రస్, జీఎస్టీ, ఐఎస్‌ఓ సర్టిఫికెట్ వంటివి అన్ని తప్పుడు వాటిని సృష్టించి శానిటైజర్ తయారు చేస్తున్నట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. వీరి వద్ద నుంచి కురిచేడులో మెడికల్ షాపు నిర్వాహకులు ఎంతమంది కొనుగోలు చేసి వీటిని అమ్మారనే విషయంపై పూర్తిస్థాయి దర్యాప్తు చేపడుతున్నారు. మెడికల్ షాపు నిర్వాహకులకు విషయం తెలిసినా బయటపడటం లేదని పోలీసులు అనుమానిస్తున్నారు. ఇది తాగడం వల్లే కురిచేడులో అధిక శాతం మరణాలు సంభవించాయని పోలీసులు నిర్ధారణకు వచ్చినట్లు తెలుస్తోంది.
ఎవరినీ వదలం.. – ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్
కురిచేడులో శానిటైజర్ తాగి 16 మంది మృతి చెందిన ఘటనకు సంబంధించి దర్యాప్తు వేగవంతం చేశాం. ఇప్పటికే సిట్ అధికారులు పర్‌ఫెక్ట్ కంపెనీకి సంబంధించిన ఫ్యాక్టరీని సీజ్ చేసి అందులో నిషేధిత మిథైలిన్ క్లోరైడ్‌ను కలుపుతున్నట్లుగా గుర్తించాం. ఇది ప్రమాదకరమైన కెమికల్. కొందరిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నాం. ఇందులో కురిచేడులోని మెడికల్ షాపు నిర్వాహకులకు ఎంతమందికి సంబంధాలున్నాయనే దానిపై ఆరా తీస్తున్నాం. అది నిజమని తేలితే వారిపై కూడా కేసులు నమోదు చేసేందుకు వెనుకాడం.
Comments
Please login to add a commentAdd a comment