అచ్చంపేట (పెదకూరపాడు)/సాక్షి, అమరావతి/నరసరావుపేట (ఈస్ట్)/గుంటూరు రూరల్: గుంటూరు జిల్లాలో శుక్రవారం సాయంత్రం తీవ్ర విషాదం చోటు చేసుకుంది. అచ్చంపేట మండలం మాదిపాడు వేద పాఠశాలకు చెందిన ఐదుగురు విద్యార్థులు, ఒక గురువు కృష్ణా నదిలో మునిగి మృతి చెందారు. వేదాలు, ఉపనిషత్తులు అభ్యసించేందుకు వివిధ రాష్ట్రాల విద్యార్థులు మాదిపాడులోని శ్వేత శృంగచల వేద, వేదాంత గురుకుల పాఠశాలలో ఉంటున్నారు. ఎనిమిది మంది విద్యార్థులు, వారి గురువు సంధ్యావందనం చేసేందుకు కృష్ణానదిలోకి వెళ్లారు.
ముందుగా ఐదుగురు విద్యార్థులు, వారి గురువు నదిలో దిగారు. నది లోతును గమనించక ఒక విద్యార్థి నీటిలో మునిగిపోయాడు. అతడిని రక్షించే క్రమంలో మరొకరు.. వారిని రక్షించే క్రమంలో మిగతా వారు... ఇలా ఐదుగురు విద్యార్థులు, గురువు మొత్తం ఆరుగురు నీటిలో మునిగి మరణించారు. మృతి చెందిన విద్యార్థుల్లో మధ్యప్రదేశ్‌కు చెందిన శివ శర్మ (14), ఉత్తరప్రదేశ్‌కు చెందిన నితీష్‌కుమార్ దీక్షిత్ (15), హిర్షత్ శుక్లా (15), శుభం త్రివేది (15), అనూష్‌మాన్ శుక్లా (14) ఉన్నారు. వీరితోపాటు గుంటూరు జిల్లా నరసరావుపేటకు చెందిన గురువు కేతేపల్లి వెంకట సుబ్రహ్మణ్యం (26) కూడా మృతి చెందారు. దీంతో ఒడ్డున ఉన్న ముగ్గురు విద్యార్థులు భయంతో అక్కడ నుంచి పరారయ్యారు. వారిని పోలీసులు వెతికి పట్టుకుని పాఠశాల యాజమాన్యానికి అప్పగించారు.
రక్షించే ప్రయత్నంలో..
కృష్ణా నదిలో స్నానం ఆచరిస్తుండగా గుంతలో పడిన విద్యార్థిని రక్షించే ప్రయత్నంలో ఐదుగురు విద్యార్థులు, గురువు అశువులు బాశారు. ఒకరికొకరు చేతులు పట్టుకుని బయటపడేందుకు తీవ్ర ప్రయత్నాలు చేశారు. ఇంతలో ఒక్కసారిగా గుంతలో పడి మృతి చెందారు. ఒకరికొకరు సాయంగా చేతులు పట్టుకోగా లోతు తెలియని గుంత అందరినీ మృత్యు ఒడికి లాగేసింది. అచ్చంపేట, సత్తెనపల్లి సీఐలు భాస్కరరెడ్డి, నరసింహారావు, ఎస్‌ఐ మణికృష్ణ చేరుకుని మృతదేహాలను వెలికితీశారు.
ఆరు నెలల్లో వివాహం.. ఇంతలోనే దుర్ఘటన
కృష్ణానదిలో మునిగి మృతి చెందిన గురువు కేతేపల్లి వెంకట సుబ్రహ్మణ్యం స్వగ్రామం.. నరసరావుపేటలోని బరంపేట. ఆయన మృతి విషయం తెలుసుకున్న కుటుంబసభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. మృతుడు జిల్లెళ్లమూడిలోని మాతృశ్రీ విద్యాలయంలో డిగ్రీ పూర్తి చేశాడు. గత మూడేళ్లుగా మాదిపాడులోని సంస్కృత పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాడు. తండ్రి శివనాగేశ్వర బాపయ్య శాస్త్రి ఆర్నెళ్ల క్రితమే అనారోగ్యంతో మృతి చెందారు. సుబ్రహ్మణ్యం సోదరుడు భీమలింగేశ్వరశాస్త్రి నరసరావుపేటలో పురోహితుడిగా విధులు నిర్వహిస్తున్నాడు. మరో 6 నెలల్లో సోదరుడికి వివాహం చేద్దామని అనుకుంటున్నామని..ఇంతలోనే ఈ విషాదం చోటు చేసుకుందని ఆయన బావురుమన్నారు. మృతుడికి తల్లితోపాటు నలుగురు సోదరీమణులు, ఓ తమ్ముడు, ఓ అన్న ఉన్నారు. తల్లికి ఈ విషయం తెలియకుండా ఉంచారు. మృతదేహాన్ని పోస్టుమార్టం అనంతరం శనివారం మధ్యాహ్నం నరసరావుపేటకు తీసుకురానున్నట్లు సమాచారం.
గవర్నర్, హోం శాఖ మంత్రి తీవ్ర సంతాపం
ఆరుగురు కృష్ణా నదిలో మృతి చెందడం పట్ల గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. చిన్నారుల భద్రత విషయంలో వివిధ సంస్థల యాజమాన్యాలు మరింత శ్రద్ధ తీసుకోవాలన్నారు. కాగా, ఈ ఘటనపై రాష్ట్ర హోం శాఖ మంత్రి మేకతోటి సుచరిత, మంత్రి ఆదిమూలపు సురేష్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఘటనపై సుచరిత పోలీసు ఉన్నతాధికారులతో మాట్లాడి వివరాలు తీసుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment