![Son Assassition His Mother In Visakha District - Sakshi](/styles/webp/s3/article_images/2020/07/25/Son-Assassition-His-Mother.jpg.webp?itok=4ipB6cS8)
నూకాలతల్లి (ఫైల్)
రోలుగుంట (చోడవరం): మద్యం మత్తులో కన్నతల్లినే హత్య చేశాడో కసాయి కొడుకు. విశాఖ జిల్లా రోలుగుంట మండలం గుండుబాడు పంచాయతీ శివారు బలిజపాలెంలో గురువారం రాత్రి జరిగిన ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామానికి చెందిన గేదెల నూకాలతల్లి (55) భర్త గతంలోనే మృతి చెందాడు. ఆమె తన ఒక్కగానొక్క కుమారుడు కృష్ణ (35)ను అల్లారు ముద్దుగా పెంచుకుంది. యుక్త వయస్సు రాగానే వివాహం చేసింది. అయినా కొడుకు బాగోగులు తల్లే చూసుకునేది.
గురువారం రాత్రి ఆ తల్లి కుమారుడి కోసం పండ్ల జ్యూస్ తయారు చేసి ఇచ్చేందుకు ఎదురుచూస్తుండగా.. కృష్ణ పూటుగా మద్యం తాగి ఇంటికి వచ్చాడు. మళ్లీ మద్యం తాగేందుకు తల్లిని డబ్బులు అడగడంతో ఆమె నిరాకరించింది. దీంతో మైకంలో ఉన్న అతను కోపోద్రిక్తుడై పక్కనే ఉన్న గిన్నెతో తల్లి తలపై అనేక సార్లు బలంగా కొట్టడంతో అధిక రక్తస్రావమై ఆమె అక్కడికక్కడే కుప్పకూలి ప్రాణం విడిచింది. వీఆర్వో నాగమణి ఇచ్చిన సమాచారం మేరకు రోలుగుంట ఎస్‌ఐ సంఘటన స్థలానికి వెళ్లి స్థానికులను విచారించారు. శుక్రవారం ఉదయం పంచనామా నిర్వహించి, నర్సీపట్నం ఏరియా ఆసుపత్రికి పోస్టుమార్టానికి మృతదేహాన్ని తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment