సాక్షి, అమరావతి: ఒడిశా నుంచి అక్రమంగా తరలిస్తున్న గంజాయితోపాటు డ్రగ్స్ విక్రయాలు, అక్రమ మద్యం విక్రయాలు, సారా తయారీపై స్పెషల్ ఎన్‌ఫోర్స్‌మెంట్ బ్యూరో (సెబ్) విస్తృతంగా దాడులు నిర్వహిస్తోంది. మే నెలలోనే 169 గంజాయి కేసులు నమోదు చేసి 710 మందిని అరెస్టు చేసింది. 7,222.16 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకోవడంతోపాటు 92 వాహనాలను జప్తుచేసింది. మూడు మాదకద్రవ్యాల కేసులు నమోదు చేసి ఐదుగురిని అరెస్టు చేసింది. 3,100 పెంటజోయిస్ ఇంజక్షన్ సీసాలు, 4.23 గ్రాముల ఎండీఎంఏను స్వాధీనం చేసుకుంది.
2,115 సారా కేసుల్లో 13,828 లీటర్ల సారా, 1,198.5 కిలోల ఊట బెల్లాన్ని స్వాధీనం చేసుకోవడంతోపాటు 1,274 మందిని అరెస్టు చేసింది. 896 అక్రమ మద్యం కేసులు నమోదు చేసి 588 మందిని అరెస్టు చేయడంతోపాటు 1,664.94 లీటర్ల అక్రమ మద్యం, 144.6 లీటర్ల బీరును స్వాధీనం చేసుకుని, 21 వాహనాలను జప్తుచేసింది. 40 లీటర్ల అక్రమ కల్లును కూడా స్వాధీనం చేసుకుంది. 30 ఎర్రచందనం దుంగల అక్రమ రవాణా కేసుల్లో 161 మందిని అరెస్టు చేయడంతోపాటు 264 ఎర్రచందనం దుంగలను, 25 వాహనాలను జప్తుచేసింది. మే నెలలో గంజాయి కేసుల్లో 30 మందిపై, సారా కేసుల్లో ఎనిమిది మందిపై పీడీ యాక్ట్ కింద కేసులు నమోదు చేసినట్టు సెబ్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment