
శ్రీకాళహస్తి రూరల్: నాలుగు నెలల కిందట అదృశ్యమైన ఓ మహిళ అస్థిపంజరంగా కనిపించిన సంఘటన మండలంలోని విశాలాక్షినగర్‌లో ఆది వారం వెలుగు చూసింది. శ్రీకాళహస్తి రూరల్ సీఐ కృష్ణమోహన్ కథనం మేరకు.. విశాలాక్షినగర్‌లో అమ్ములు అనే మహిళ నివాసముంటుంది. ఆమె కుమార్తె ఉష ఖమ్మం పట్టణానికి చెందిన నాగ రాజు అలియాస్ నిరంజన్‌ను ప్రేమించడంతో తొమ్మిదేళ్ల కిందట వారికి వివాహం జరిపించింది. రూ.5 లక్షలు అప్పు చేసి, ఇంటిని నిర్మించుకుని అందరూ కలసి అదే ఇంట్లో ఉంటున్నారు. ఉష శ్రీసిటీలోని ఓ మొబైల్ కంపెనీలో పనిచేస్తుండగా నాగరాజు ఖాళీగా ఉంటున్నాడు. ఖాళీగా ఉంటే అప్పు ఎలా తీర్చాలంటూ అమ్ములు తరచూ అల్లుడిని మందలించేది.
ఈ క్రమంలో గత ఏడాది డిసెంబర్ నుంచి అమ్ములు కనిపించకుండా పోయింది. దీంతో ఉష గత జనవరి 9న శ్రీకాళహస్తి రూరల్ పోలీస్ స్టేషన్‌లో ఈ విషయమై ఫిర్యాదు చేసింది. ఆ తర్వాత నాగరాజు తమ ఊర్లో పని ఉందంటూ ఖమ్మం వెళ్లి, తిరిగిరాలేదు. ఇంటి ప క్కనే ఉన్న దిబ్బలో చెత్త తమ ఇంటి ఆవరణలోకి వస్తోందని, దాన్ని తొలగించాలని పక్క ఇంటి వారు అడుగుతుండడంతో ఉష ఆదివారం కూలీలతో పేడ దిబ్బను తొలగించింది. దిబ్బలో పుర్రె, ఎముకలు బయటపడడంతో వెంటనే ఆమె ఈ విషయాన్ని పోలీసుల దృష్టికి తీసుకెళ్లింది.
సీఐ కృష్ణమోహన్, ఎస్‌ఐ వెంకటేష్, తహసీల్దార్ ఉదయ్‌సంతోష్ సిబ్బందితో కలసి ఘటనా స్థలా నికి చేరుకున్నారు. అస్థిపంజరాన్ని వెలుపలకి తీశారు. ప్రభుత్వాస్పత్రి వైద్యులు ఆర్‌సీఎం రెడ్డి, విజయలక్ష్మి శవపంచనామా నిర్వహించారు. దిబ్బలో అమ్ములు చీర, నాగరాజు లుంగీ లభ్యం కావడంతో అల్లుడు నాగరాజుపైన అనుమానం వ్యక్తమవుతున్నట్లు సీఐ తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు సీఐ కృష్ణమోహన్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment