మత్తుమందుగా అనుమానిస్తున్న చాక్లెట్
కొత్తూరు: స్కూలు సమీపంలోని పాన్ డబ్బాల్లో విక్రయిస్తున్న చాక్లెట్లు తిని విద్యార్థులు మత్తులోకి జారుకోవడం, వింత వింతగా ప్రవర్తిస్తున్న దృష్టాంతాలు రంగారెడ్డి జిల్లా కొత్తూరు మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో వెలుగుచూశాయి. ఉపాధ్యాయులు తెలిపిన వివరాల ప్రకారం.. స్కూలు సమీపంలోని పాన్ డబ్బాల్లో లభించే చాక్లెట్లను తరచూ కొని తింటున్న పలువురు విద్యార్థులు తరగతి గదుల్లో మత్తులోకి జారుకుంటున్నారు.
కొద్ది రోజులుగా విద్యార్థులు వింతగా ప్రవర్తించడాన్ని గమనించిన ఉపాధ్యాయులు ఆరా తీయగా చాక్లెట్ల వల్లనే అని తేలింది. వీటిని మొదట పాన్ డబ్బాల వ్యాపారులు ఉచితంగా విద్యార్థులకు అందించారని, క్రమంగా వాటికి బానిసలైన విద్యార్థులకు ఒక్కో చాక్లెట్ 20 రూపాయలకు విక్రయిస్తున్నట్లు గుర్తించారు. ఉపాధ్యాయుల సమాచారం మేరకు ఎస్‌వోటీ పోలీసులు మంగళవారం సదరు పాన్ డబ్బాలపై దాడిచేయగా స్వల్ప మొత్తంలో చాక్లెట్లు లభించాయి. అయితే ఈ చాక్లెట్లలో ఏముందనేది తెలియరాలేదని చెబుతున్నారు. హెచ్‌ఎం అంగోర్ నాయక్‌ను వివరణ కోరగా విద్యార్థులు వింతగా ప్రవర్తిస్తున్న విషయం వాస్తవమేనని, దీనిపై స్థానిక మున్సిపల్ అధికారులు, పోలీసులకు సమాచారం అందించామని చెప్పుకొచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment