ఒంగోలు: ఆమె సాఫ్ట్‌వేర్ ఇంజినీరు. మరో సాఫ్ట్‌వేర్ ఇంజినీరును పెళ్లి చేసుకుని కోటి ఆశలతో అత్తింట్లో అడుగుపెట్టిన ఆమెకు నిత్యం నరకం కనిపించింది. భర్తతోపాటు మామ కూడా చేయి చేసుకుంటున్నాడంటూ తండ్రికి ఫోన్‌లో మొరపెట్టుకుంది. చివరకు ఇంట్లోకి సైతం రానివ్వడం లేదంటూ విలపించింది. ఇంతలోనే ఆమె ఆత్మహత్య చేసుకుందంటూ తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు.
తన కుమార్తెను చంపేశారంటూ ఆమె తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ విషాద సంఘటన ఆదివారం ప్రకాశం జిల్లా కేంద్రం ఒంగోలులో జరిగింది. జిల్లాలోని రాచర్ల మండలం సోమిదేవిపల్లికి చెందిన రిటైర్డ్ మిలిటరీ ఉద్యోగి అయినాబత్తుల వెంకటేశ్వర్లు కుమార్తె స్వాతికి, ఒంగోలు భాగ్యనగర్‌లో ఉంటున్న సంగా శ్రీహరి కుమారుడు వెంకటశ్రీకాంత్‌కు గత ఏడాది మేనెల 13న వివాహం జరిగింది. వెంకటేశ్వర్లు 25 తులాల బంగారం, రూ.50 లక్షలు కట్నంగా ఇచ్చారు. స్వాతి హైదరాబాద్ విప్రో కంపెనీలోను, వెంకటశ్రీకాంత్ ఇన్ఫోసిస్‌లోను సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లుగా చేస్తున్నారు.
(చదవండి: వర్షాల కోసం నగ్నంగా బాలికల ఊరేగింపు)
ఒంగోలు ప్రభుత్వాస్పత్రిలో అంబులెన్స్ డ్రైవర్‌గా పనిచేస్తున్న శ్రీహరికి గత ఏడాది జూలైలో యాక్సిడెంట్ కావడంతో ఉద్యోగం చేయలేని పరిస్థితి ఏర్పడింది. మరోవైపు కరోనా కారణంగా వర్క్ ఫ్రం హోం చేస్తూ స్వాతి దంపతులు ఒంగోలులోనే శ్రీకాంత్ కుటుంబసభ్యులతో కలిసి ఉంటున్నారు. శ్రీహరి ఉద్యోగం చేయలేని నేపథ్యంలో కుమారుడు వెంకటశ్రీకాంత్‌కు ప్రభుత్వ ఉద్యోగం ఇప్పించాలని నిర్ణయించారు. ప్రభుత్వ ఉద్యోగం వస్తుందని భావించి స్వాతిని వదిలించుకోవాలని పథకం పన్నారు. నల్లగా ఉన్నావంటూ కించపరుస్తూ విడాకులివ్వాలంటూ వేధించారు.
ఈ ఏడాది మార్చిలో స్వాతిని పుట్టింటికి పంపారు. మళ్లీ పెద్దల సమక్షంలో ఈ ఏడాది జూలైలో స్వాతి ఒంగోలులోని అత్తగారింటికి చేరింది. అప్పటినుంచి భర్త, మామ శారీరకంగా, మానసికంగా హింసించసాగారు. శనివారం రాత్రి ఆమెను కొట్టి ఇంట్లోంచి గెంటేశారు. ఆదివారం సాయంత్రం 5 గంటలకు స్వాతి తన తండ్రికి ఫోన్‌చేసి తనను ఇంట్లోకి రానిచ్చారని చెప్పింది. 5.07 నిమిషాలకు ఆయనకు వాచ్‌మెన్ ఫోన్‌చేసి స్వాతి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుందని చెప్పారు. వెంటనే ఒంగోలు చేరుకున్న వెంకటేశ్వర్లు దంపతులు కన్నీరుమున్నీరుగా విలపిస్తూ.. తమ కుమార్తెను చంపేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారని పోలీసులకు ఫిర్యాదు చేశారు. దిశ పోలీసులు.. స్వాతి భర్త, అత్తమామలతో పాటు మరికొందరిపై వరకట్నం వేధింపుల కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. స్వాతి మృతదేహాన్ని ప్రభుత్వాస్పత్రికి తరలించారు.
(చదవండి: తాలిబన్ల చెరలో నాలుగు విమానాలు!)
Comments
Please login to add a commentAdd a comment