కాకినాడ: వైద్య కళాశాల క్యాంపస్‌లో ఓ మెడికో అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం కలకలం రేపింది. పోలీసులు, తల్లిదండ్రుల కథనం ప్రకారం.. గుంటూరు జిల్లా తెనాలికి చెందిన కొండూరు శ్రీకృష్ణ కేదార్ (27) అలియాస్ శృంగేరి జీఎస్‌ఎల్ కళాశాలలో ఎంబీబీఎస్ పూర్తి చేసి, పీజీ (పీడియాట్రిక్స్) సెకండియర్ చదువుతున్నాడు. కళాశాల ప్రాంగణంలోని స్టాఫ్ క్వార్టర్స్‌లో నివాసం ఉంటున్నాడు.
ఏం జరిగిందో ఏమో కానీ మంగళవారం ఉదయం 6.55 గంటల సమయంలో స్టాఫ్ క్వార్టర్స్ సమీపంలోని కారిడార్ వద్ద అతడు విగతజీవిగా పడి ఉన్నాడు. అతడిని గమనించిన వారు వెంటనే సూపరింటెండెంట్ డాక్టర్ టీవీఎస్‌పీ మూర్తికి సమాచారం అందించారు. ఆయన వెంటనే అక్కడకు చేరుకున్నారు. కేదార్‌ను పరీక్షించగా అప్పటికే అతను మరణించినట్టు గుర్తించారు. దీంతో అక్కడి నుంచే అతడి తల్లిదండ్రులకు, స్థానిక పోలీసులకు డాక్టర్ మూర్తి ఫోన్ ద్వారా సమాచారం అందించారు. రాజమహేంద్రవరం తూర్పు మండలం డీఎస్పీ కె.వెంకటేశ్వరరావు, స్థానిక సీఐ కాశీ విశ్వనాథ్ తమ సిబ్బందితో సంఘటన స్థలానికి హుటాహుటిన చేరుకున్నారు. అంతలోనే మృతుని తల్లిదండ్రులు కూడా అక్కడకు చేరుకున్నారు.
కవుకు దెబ్బలు
మృతుని చెవుల నుంచి రక్తం కారడం, శరీరంపై నెత్తుటి గాయాలు, కవుకు దెబ్బలు ఉండటాన్ని పోలీసులు గుర్తించారు. తమ కుమారుడు ఆత్మహత్య చేసుకునేంతటి పిరికివాడు కాదని, ఇది ఏమాత్రం ఆత్మహత్య కాదని తండ్రి శివరామలింగేశ్వరరావు అన్నారు. కేదార్ మృతిపై తమకు అనుమానం ఉందని, దీనిపై పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసి, న్యాయం చేయాలని ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు మెడికో మరణంపై అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నామని డీఎస్పీ వెంకటేశ్వరరావు తెలిపారు. క్లూస్ టీమ్‌ను, డాగ్ స్క్వాడ్‌ను రప్పించారు. మృతుని ఫోన్ డేటా పరిశీలించగా.. సోమవారం రాత్రి నుంచి తెల్లవారుజామున 6.42 గంటల వరకూ తల్లిదండ్రులతో తరచూ మాట్లాడుతున్నట్టు ఉందని డీఎస్పీ చెప్పారు. అన్ని కోణాల్లోనూ ఈ కేసు దర్యాప్తు జరుగుతుందని తెలిపారు.
ముగ్గురు అన్నదమ్ములకు ఒక్కడే వారసుడు
మృతుడు కేదార్ తండ్రి శివరామలింగేశ్వరరావుకు ఇద్దరు సోదరులున్నారు. ఈ ముగ్గురికీ కేదార్ ఒక్కడే వారసుడు. ‘ముగ్గురు అన్నదమ్ములైన మాకు ఒక్కడే వారసుడు కావడంతో అందరం అల్లారుముద్దుగా పెంచుకున్నాం. మెడిసిన్ చేస్తానంటే చదివించాం. ఎంబీబీఎస్ తరువాత పీజీ చేస్తానంటే ఒకే అన్నాం. ఇలా వాడు అడిగింది ఏదీ కాదనకుండా వచ్చిన మాకు ఇలా కడుపు శోకం మిగులుస్తాడనుకోలేదు’ అంటూ కేదార్ తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment