
చెన్నై: ఆగి ఉన్న కారులో ఆడుకుంటున్న ముగ్గురు చిన్నారులు ప్రమాదవశాత్తు కారు డోర్ లాక్ కావడంతో ఊపిరాడక మృతి చెందారు. తిరునల్వేలి జిల్లా పనగుడి సమీపంలోని లెబ్బాయి కుడియిరుప్పులో ఈ విషాద ఘటన చోటుచేసుకుంది. పనంగుడి సమీపంలోని లెప్పాయి అపార్ట్‌మెంట్‌లో నివాసముంటున్న నాగరాజన్ కుమారుడు, కుమార్తె నితీష్(5), నితీష(7)లుగా పోలీసులు గుర్తించారు. చనిపోయిన మూడో బిడ్డను అదే ప్రాంతానికి చెందిన సుధాకర్ కుమారుడు కబీశాంత్ (4)గా గుర్తించారు. కారు నాగరాజన్ సోదరుడు మణికందన్‌కు చెందినదని, ఆయన ఇంటి సమీపంలో కారును పార్క్ చేసినట్లుగా పోలీసులు తెలిపారు.
వివరాల ప్రకారం.. ముగ్గురు చిన్నారులు ఆడుకునేందుకు బయటకు వెళ్లి పార్క్ చేసిన ఓ కారులోకి వెళ్లారు. వాళ్లు ఆడుకుంటుండగా ప్రమాదవశాత్తు కారు డోర్ లాక్ అయ్యింది. కారు తలుపులు మూసిఉండడంతో ఆ ముగ్గురు పిల్లలు ఊపిరాడక చనిపోయారు. ఎంతసేపైనా పిల్లలు కనిపించకపోవడంతో తల్లిదండ్రులు వెతికడం మొదలుపెట్టారు. కారులో పిల్లలు ఆడుకుంటుండగా గమనించిన ఓ వ్యక్తి వారి తల్లిదండ్రులకు సమాచారం అందించాడు. దీంతో తల్లిదండ్రులు ఘటనాస్థలికి చేరుకున్న తర్వాత కారులో అపస్మారక స్థితిలో ఉన్న చిన్నారులను గుర్తించారు. కారు అద్దాలు పగులగొట్టి వారిని బయటకు తీశారు. పిల్లలను పనగుడి ప్రభుత్వాసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. ఈ ఘటనపై పనగుడి పోలీసులు అసహజ మరణంగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment