చెన్నై: అక్రమాలను ప్రశ్నించినందుకు ఓ యువ జర్నలిస్టును కొందరు దుండగులు దారుణంగా హతమార్చారు. తమిళనాడులోని కాంచీపురం జిల్లాలోని కుండ్రత్తూరులో ఈ ఘటన చోటుచేసుకుంది. ప్రభుత్వ పోరంబోకు భూమిని అక్రమంగా అమ్ముతున్న కొందరికి వ్యతిరేకంగా మోజెస్ (26) కొంతకాలంగా వార్తలు రాస్తుండటమే ఈ హత్యకు కారణంగా తెలిసింది. ప్రభుత్వ భూమిని అమ్మి సొమ్ము చేసుకుంటున్న అక్రమార్కులు గతంలో పలుమార్లు మోజెస్‌ను బెదిరించారు. తమ దారికి అడ్డు రావొద్దన్ని హెచ్చరించారు. ఈక్రమంలోనే ఆదివారం రాత్రి 11 గంటల ప్రాంతంలో మోజెస్‌ను ఇంటి నుంచి రప్పించిన దుండగులు అతన్ని కత్తులతో నరికి చంపేశారు. అతని శరీరంపై 18 కత్తి పోట్లు ఉన్నాయని వైద్యులు తెలిపారు. జర్నలిస్టు హత్య కేసులో ఇప్పటివరకు నలుగురిని అదుపులోకి తీసుకున్నామని పోలీసులు వెల్లడించారు. మోజెస్ స్థానికంగా ఓ తమిళ టీవీలో రిపోర్టర్‌గా పనిచేస్తున్నాడు. అతని తండ్రి కూడా జర్నలిస్టు కావడం విశేషం.
Comments
Please login to add a commentAdd a comment