చంద్రగిరిలో గంజాయి మత్తులో టీడీపీ కార్యకర్తల దారుణం
వైఎస్సార్‌సీపీ మైనార్టీ సెల్ ప్రధాన కార్యదర్శిపై కత్తితో దాడి
అడ్డొచ్చిన కుటుంబ సభ్యులు, బంధువు పైనా దాడి
మరో చోట ధాబా ధ్వంసం, వార్డు సభ్యుడిపై దాడి
చంద్రగిరి (తిరుపతి జిల్లా)/తిరుపతి క్రైమ్: రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన మత్తులో టీడీపీ కార్యకర్తలు రాష్ట్రంలో విధ్వంసాన్ని కొనసాగిస్తున్నారు. మంగళవారం రాష్ట్రవ్యాప్తంగా మొదలైన ఈ దాడులు బుధవారమూ కొనసాగాయి.
తిరుపతి జిల్లా చంద్రగిరిలో టీడీపీ కార్యకర్తలు కొందరు గంజాయి మత్తులో వైఎస్సార్‌సీపీ రాష్ట్ర మైనార్టీ సెల్ ప్రధాన కార్యదర్శిపై హత్యాయత్నానికి పాల్పడ్డారు. అడ్డొచ్చిన మరో వ్యక్తిని కూడా గాయపరిచారు. మరో చోట వార్డు సభ్యుడిపై దాడి చేసి, గాయపరిచారు. తిరుపతి నగరంలో వైఎస్సార్‌సీపీ కార్యాలయాన్ని ధ్వంసం చేశారు.
కత్తులు, రాడ్లతో దాడి
బుధవారం రాత్రి వైఎస్సార్‌సీపీ రాష్ట్ర మైనార్టీ సెల్ ప్రధాన కార్యదర్శి, పార్టీ మండల కనీ్వనర్ మస్తాన్‌పై టీడీపీ కార్యకర్తలు చంద్రగిరిలో హత్యాయత్నానికి పాల్పడ్డారు. గంజాయి మత్తులో ఉన్న టీడీపీ కార్యకర్తలు కొందరు బుధవారం రాత్రి మస్తాన్ ఇంటి వద్దకు వచ్చారు. అదే సమయంలో ద్విచక్ర వాహనంతో ఇంటి నుంచి బయటకు వస్తున్న ఆయనపై కత్తులు, రాడ్లతో దాడికి పాల్పడ్డారు.
ఓ వ్యక్తి కత్తితో మస్తాన్‌పై హత్యాయత్నానికి పాల్పడ్డాడు. కుటుంబ సభ్యులు, బంధువులు అడ్డుకొన్నప్పటికీ వారు ఆగలేదు. టీడీపీ వారిని అడ్డుకోబోయిన మస్తాన్ బంధువైన సాదిక్‌ను కూడా గాయపరిచారు. సమాచారం అందుకున్న వైఎస్సార్‌సీపీ నాయకులు పలువురు అక్కడికి చేరుకోవడంతో టీడీపీ వారు జారుకున్నారు. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.
మద్యం మత్తులో ధాబా ధ్వంసం
అదే విధంగా చంద్రగిరి మండలం పరిధిలోని ఐతేపల్లి వద్ద ఉన్న ధాబాను టీడీపీ కార్య కర్తలు కొందరు ధ్వంసం చేశా రు. బుధవారం మద్యం సేవించిన కొందరు టీడీపీ కార్యకర్తలు ధాబా వద్దకు వెళ్లి గొడవకు దిగారు. సమాచారం అందుకున్న వార్డు సభ్యుడు సక్కూరు వంశీ అక్కడి వెళ్లారు. అదే సమయంలో పోలీసులు కూడా అక్కడికి చేరుకున్నారు.
మాపైనే పోలీసులకు చెప్తావా అంటూ వార్డు సభ్యుడు వంశీపై టీడీపీ వారు దాడి చేసి, తీవ్రంగా గాయపరిచారు. అనంతరం ధాబాలోని కురీ్చలు, టేబుళ్లు ధ్వంసం చేశారు. తీవ్రంగా గాయపడిన వంశీని స్థానికులు ఆసుపత్రికి తరలించారు.
తిరుపతిలో వైఎస్సార్‌సీపీ కార్యాలయం ధ్వంసం
తిరుపతి నగరం 8వ డివిజన్‌లో ఉన్న వైఎస్సార్‌సీపీ కార్యాలయాన్ని కూటమి కార్యకర్తలు ధ్వంసం చేశారు. సంజయ్ కాలనీలో ఉన్న ఈ కార్యాలయాన్ని మురళి నిర్వహిస్తున్నారు. షట్టర్ ఓపెన్ చేసి గ్లాస్ డోర్‌కు తాళం వేసుకుని వెళ్లిన సమయంలో కూటమి మూకలు రాళ్లతో దాడిచేసి లోపలికి ప్రవేశించి ఫర్నిచర్ మొత్తం ధ్వంసం చేశారు. టీవీలు, కంప్యూటర్లు, బల్లలు అన్నింటినీ విరగ్గొట్టారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని కార్యాలయం నిర్వాహకుల నుంచి ఫిర్యాదు తీసుకొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment