![TDP leader Anita to court in check bounce case - Sakshi](/styles/webp/s3/article_images/2022/05/3/anitha.jpg.webp?itok=oPFFd7IY)
విశాఖ లీగల్: బ్యాంక్ ఖాతాలో తగినన్ని నిధుల్లేకుండా చెక్కులు జారీ చేసిన (చెక్ బౌన్స్) కేసులో తెలుగుదేశం పార్టీ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత సోమవారం నగరంలోని 7వ ప్రత్యేక మేజిస్ట్రేట్ కోర్టుకు హాజరయ్యారు. వంగలపూడి అనిత ఎన్నికలు, వ్యక్తిగత ఖర్చుల కోసం అనకాపల్లి జిల్లా కోటవురట్ల మండలం రాజుపేటకు చెందిన వేగి శ్రీనివాసరావు వద్ద 2015 అక్టోబర్ 1న రూ.70 లక్షలు అప్పుగా తీసుకున్నారు. ప్రామిసరీ నోటు రాసిచ్చారు. 18 శాతం వడ్డీ చెల్లించడానికి కూడా అంగీకరించారు. మూడేళ్లు గడిచినా ఒక్క రూపాయి తిరిగివ్వలేదు. శ్రీనివాసరావు తన బాకీ తీర్చాలని డిమాండ్ చేశారు. దీంతో ఆమె 2018 జూలై 30న రూ.70 లక్షలకు హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ చెక్కు ఇచ్చారు. దానిని శ్రీనివాసరావు 2018 ఆగస్టు 13న ఐసీఐసీఐ బ్యాంక్‌లోని తన ఖాతాలో జమ చేశారు.
అది నిరాదరణకు గురైంది. చెక్‌ను ఇతర కారణాల వల్ల నిలిపివేసినట్లు బ్యాంక్ అధికారులు మెమో జారీ చేశారు. ఎంతకీ సొమ్ము ఇవ్వకపోవడంతో 2019లో శ్రీనివాసరావు నగరంలోని 1వ అదనపు ప్రధాన మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టులో కేసు దాఖలు చేశారు. ఆయన న్యాయవాది పంపిన లీగల్ నోటీస్‌ను అనిత తిరస్కరించారు. అనంతరం కేసు 7వ ప్రత్యేక మేజిస్ట్రేట్ కోర్టుకు బదిలీ అయింది. ఇటీవల బ్యాంక్ అధికారులు తమ సాక్ష్యాలను కోర్టుకు సమర్పించారు. అందులో బ్యాంక్ ఖాతాలో తగినన్ని నిధులు లేని కారణంగా చెక్ నిరాదరణకు గురైనట్లు నిర్ధారించారు. ఈ నేపథ్యంలో అనిత సోమవారం కోర్టుకు హాజరయ్యారు. తనకు అనారోగ్యంగా ఉన్నందున ఒక రోజు సమయం ఇవ్వాలని కోరారు. మధ్యలోనే కోర్టు నుంచి వెళ్లిపోయారు. దీంతో కేసును మేజిస్ట్రేట్ ఈనెల 4వ తేదీకి వాయిదా వేశారు.
Comments
Please login to add a commentAdd a comment