ఆందోళన చేస్తున్న చందులూరు యాత కులస్తులు
లక్కవరపుకోట (శృంగవరపుకోట): ఓటెయ్యలేమని చెప్పినవారిపై టీడీపీ నాయకులు దాడిచేసిన సంఘటన విజయనగరం జిల్లాలో చోటు చేసుకుంది. దీనికి సంబంధించి లక్కవరపుకోట ఎస్సై కె.లక్ష్మణరావు తెలిపిన మేరకు.. టీడీపీకి చెందిన మాజీ ఎంపీపీ కొల్లు రమణమూర్తి స్థానిక ఎన్నికల నేపథ్యంలో ఆదివారం రాత్రి చందులూరు గ్రామానికి చెందిన వాడబోని అప్పలరాజును ఓట్లకోసం అభ్యర్థించారు. తాను వైఎస్సార్ అభిమానులకు ఓటేస్తానని మాటిచ్చానని, వారికే ఓటు వేస్తానని అప్పలరాజు చెప్పారు. దీంతో రమణమూర్తి మరో ముగ్గురితో కలిసి అప్పలరాజుపై దాడిచేశారు.
అప్పలరాజు కేకలు వేయడంతో స్థానికులు వచ్చి రక్షించి శృంగవరపుకోట ఆస్పత్రికి తరలించారు. అక్కడినుంచి మెరుగైన వైద్యంకోసం విజయనగరం జిల్లా కేంద్రాస్పత్రికి తీసుకెళ్లారు. బాధితుడి తమ్ముడు అప్పలనాయుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. దానికి ప్రతిగా అప్పలరాజు మద్యం తాగి తనను తిట్టాడని, ఇదేమని ప్రశ్నించినందుకు ఆదివారం రాత్రి మరికొందరితో కలసి తనపై దాడిచేశారని రమణమూర్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు అప్పలరాజు మరో ఇద్దరిపై కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. రమణమూర్తి కుటుంబం నుంచి, టీడీపీ నాయకులనుంచి తమకు రక్షణ కల్పించాలని చందులూరు గ్రామానికి చెందిన యాత సామాజికవర్గీయులు సోమవారం పోలీసుస్టేషన్ ఎదుట ఆందోళన చేపట్టారు.
Comments
Please login to add a commentAdd a comment