సాలూరులో పోలీసులు స్వాధీనం చేసుకున్న చీరలు, లుంగీలు, తువ్వాళ్లు
సాక్షి, అమరావతి/సాలూరు: పార్టీ రహితంగా జరగాల్సిన పంచాయతీ ఎన్నికలను తొలి నుంచి వివాదాస్పదం చేస్తున్న ప్రతిపక్ష నేత,తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు.. మొదటి విడత పోలింగ్ రోజైన మంగళవారం కూడా అందుకు తగ్గట్లే వ్యవహరించారు. చంద్రబాబు ఆదేశాలతో ఆ పార్టీ శ్రేణులు మరింత రెచ్చిపోయి ఓటర్లకు డబ్బులు పంపిణీ చేశారు. కానీ, కొన్నిచోట్ల వీరి ఆటలు సాగలేదు. పోలీసులకు అడ్డంగా దొరికిపోయారు. ఉదాహరణకు.. విజయనగరం జిల్లా సాలూరు మండలంలోని కూర్మరాజుపేట గ్రామానికి చెందిన టీడీపీ నాయకుడు ఆముదాల పరమేశు తనకు అనుకూలమైన వ్యక్తిని సర్పంచ్ ఎన్నికల బరిలో నిలిపాడు.
ఓటర్లను ప్రలోభపెట్టేందుకు చీరలు, పంచెలు, తువ్వాళ్లను కొని సాలూరు పట్టణం బంగారమ్మ కాలనీలో తన బంధువైన కరణం రామగిరి ఇంట్లో భద్రపరిచాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఆ ఇంట్లో ఉన్న 200 చీరలు, 50 తువ్వాళ్లు, 190 లుంగీలను గుర్తించారు. వాటి బిల్లులు చూపకపోవడంతో పాటు వాటిని పంచేందుకు సిద్ధం చేసినట్లు ఇంటి యజమాని చెప్పడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఇక ప్రకాశం జిల్లా ఇంకొల్లు, సూదివారిపాలెంలోను ఓటర్లకు డబ్బులు పంచుతున్న ఇద్దరు టీడీపీ కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి రూ.32,500 నగదును స్వాధీనం చేసుకున్నారు. అలాగే, పశ్చిమగోదావరి జిల్లా వీరవాసరం మండలం తోకలపూడి గ్రామంలో ఓటర్లకు డబ్బులు పంచుతున్న టీడీపీ కార్యకర్తలు పోలీసులకు దొరికిపోయారు.
జిల్లాల్లో ఘర్షణలు..
పంచాయతీ ఎన్నికలు పురస్కరించుకుని తూర్పు గోదావరి, చిత్తూరు, కర్నూలు, అనంతపురం జిల్లాల్లో స్వల్ప ఘర్షణలు చోటుచేసుకున్నాయి.
► తూర్పుగోదావరి జిల్లా ఉప్పలపాడులో ఇరువర్గాల మధ్య ఘర్షణ జరిగింది.
ఇదే జిల్లా గొల్లప్రోలు మండలం చినజగ్గంపేటలో ఇరువర్గాల మధ్య ఘర్షణకు దారితీయడంతో కత్తులతో దాడి చేసుకున్నారు. ఈ ఘటనలో ముగ్గురికి గాయాలయ్యాయి. పోలీసులు వారిని చెదరగొట్టారు.
► కృష్ణా జిల్లా నిడమానూరులో సర్పంచ్ అభ్యర్థి గుర్తుపై అధికారులు నోటా స్టిక్కర్ అతికించడంతో వివాదం రేగింది. అధికారులు దాన్ని గుర్తించి మార్పుచేయడంతో వివాదం సద్దుమణిగింది. ఇదే జిల్లా వీరులపాడు మండలం జూలూరుపాడులో స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఇరువర్గాల మధ్య మాటమాట పెరిగి తోపులాటకు దారితీసింది. స్థానికులు వివాదాన్ని సర్దుబాటు చేశారు.
► ఇక ప్రకాశం జిల్లా మార్టూరు మండలం నాగరాజుపల్లెలో చిన్నపాటి ఘర్షణ జరిగింది.
► చిత్తూరు జిల్లా కమ్మకండ్రికలో ఇరు వర్గాలు ఘర్షణకు దిగడంతో కొద్దిసేపు ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.
► అనంతపురం జిల్లా పుట్టపర్తి మండలం పోతుకుంట గ్రామంలో ఒకరి ఓటు మరొకరు వేశారంటూ ఇరువర్గాల
వారు ఘర్షణ పడ్డారు. కర్నూలు జిల్లా ముత్తలూరులోను ఘర్షణ జరిగింది.
► నెల్లూరు జిల్లా అల్లూరు మండలం ఇసుకపాలెం పంచాయతీ శంభునిపాలెంలో ఓటు వేసేందుకు నిరాకరించిన ప్రజలకు అధికారులు నచ్చజెప్పినా వారు మాట వినలేదు.
Comments
Please login to add a commentAdd a comment