
తాడికొండ: గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం రాయపూడి గ్రామానికి చెందిన తెలుగుదేశం పార్టీ నాయకుడు, అమరావతి మైనార్టీ జేఏసీ నేత షేక్ జానీ తన గ్యాంగ్‌తో హల్‌చల్ చేశాడు. పెదపరిమికి చెందిన దళిత యువకుడిని నిర్బంధించి కారులో తీసుకెళ్లి చితకబాదడంతో పాటు, కాళ్లు పట్టి క్షమాపణ కోరాలని బెదిరించిన ఘటన సోమవారం అర్ధరాత్రి జరిగింది. పెదపరిమికి చెందిన పాటిబండ్ల శ్రీకాంత్ అనే యువకుడు తుళ్లూరుకు చెందిన తన స్నేహితులైన మరో ఇద్దరితో కలిసి మోతడక నుంచి బైక్‌పై వస్తుండగా, వాహనంపై ఉన్న ఓ యువకుడికి జానీ గ్యాంగ్ నుంచి ఫోన్ కాల్ వచ్చింది.
ఫోన్ మాట్లాడుతున్న సమయంలో మిగిలిన ఇద్దరు యువకులు మాట్లాడుకుంటున్న సంభాషణను అపార్థం చేసుకున్న జానీ గ్యాంగ్ సభ్యులు.. తమ బాస్‌ను దుర్భాషలాడారంటూ వాదనకు దిగారు. అంతటితో ఆగకుండా జానీకి చెందిన కారులో పెదపరిమి గ్రామానికి వచ్చి దళిత యువకుడు పాటిబండ్ల శ్రీకాంత్‌పై దాడిచేసి కారులో నిర్బంధించి అమానవీయంగా ప్రవర్తించారు. ఈ ఘటనలో బాధితుడు పోలీసులను ఆశ్రయించగా ఆరుగురిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టంతో పాటు కిడ్నాప్ కేసు నమోదు చేసిన పోలీసులు.. నిందితులను అదుపులోకి తీసుకొని కారు సీజ్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment