Dalit youth
-
నాగోలు పీఎస్ ఎస్ఐ, ఏఎస్ఐ సస్పెన్షన్
నాగోలు: నాగోలు పోలీస్ స్టేషన్ పరిధిలో దళిత యువకుడిపై దాడి ఘటనలో కేసు నమోదు చేయడంలో నిర్లక్ష్యం వహించిన ఇన్స్పెక్టర్ పరశురాంపై రాచకొండ పోలీస్ కమిషనర్ బదిలీ వేటు వేశారు. దీనిలో భాగంగానే ఈ కేసులో నిర్లక్ష్యంగా వ్యవహరించిన నాగోలు ఎస్ఐ మధు, ఏఎస్ఐ అంజయ్యలను కూడా సస్పెండ్ చేస్తూ ఆదివారం రాత్రి రాచకొండ కమిషనర్ తరుణ్ జోషి చర్యలు తీసుకున్నారు. ఎల్బీనగర్లోని భరత్‌నగర్ కాలనీ చెందిన దాసరి గౌతమ్ అలియాస్ బద్దు ప్రైవేట్ ఉద్యోగి. ఇతనికి నాగోలు సాయినగర్ కాలనీలో నివాసం ఉండే వేముల మల్లేష్, అతని కుమారుడు (16) మైనర్ మధ్య గొడవ చోటుచేసుకుంది. ఈ సంఘటనలో తీవ్రంగా గాయపడిన గౌతమ్ పోలీసులను ఆశ్రయించగా వారు స్పందించలేదు. దీంతో తనపై జరిగిన దాడి ఘటన గురించి పోలీస్ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. పోలీసు అధికారులు దర్యాప్తు చేపట్టి ముగ్గురిపై చర్యలు తీసుకున్నారు. -
యువకుడిపై దాడి కేసులో నిర్లక్ష్యం..
సాక్షి, హైదరాబాద్: దళిత యువకుడిపై దాడి కేసులో పోలీసులు స్పందించలేదు. బాధితుడు తీవ్ర గాయాలపాలై హాస్పిటల్లో చికిత్స పొందిన అనంతరం ఠాణాను ఆశ్రయించినా నిర్లక్ష్యం వహించిన నాగోలు ఇన్స్పెక్టర్ పరశురాంపై రాచకొండ పోలీస్ కమిషనర్ తరుణ్ జోసి బదిలీ వేటు వేశారు. ఇదే కేసులో నాగోలు ఎస్ఐ మధు, ఏఎస్ఐ అంజయ్యపై అధికారులు చర్య తీసుకునే అవకాశం ఉందని సమాచారం. కాగా.. నాగోలు ఇన్చార్జి ఇన్స్పెక్టర్గా ఎల్బీనగర్ డీఐ సుధాకర్‌ను నియమించారు. వివరాలు ఇలా ఉన్నాయి.. ఎల్బీనగర్లోని భరత్‌నగర్ కాలనీకి చెందిన దాసరి గౌతమ్ అలియాస్ బద్దు (20) ప్రైవేట్ ఉద్యోగి. నాగోలు సాయినగర్ కాలనీలో నివాసం ఉండే వేముల మల్లేశ్, అతని కుమారుడు (16), గౌతమ్‌ల మధ్య గతంలో గొడవ జరిగింది. ఈ నేపథ్యంలో గౌతమ్‌ను అంతం చేయాలని నిర్ణయించుకున్నారు. ఈ నెల 6న నాగోలు సాయినగర్ కాలనీలో స్నేహితుడి ఇంట్లో నిద్రస్తున్న గౌతమ్‌పై మల్లే‹Ù, నరే‹Ù, అనిల్, జ్యోతి, నాగరాజు, పవన్‌కుమార్, మరో ఇద్దరు మైనర్లు దాడి చేశారు. భవనం పైఅంతస్తు నుంచి కిందకు లాక్కు వచ్చి రాయి, కర్రలతో దాడి చేశారు. ఈ ఘటనలో గౌతమ్‌కు తీవ్ర గాయాలయ్యాయి. అనంతరం టెలిఫోన్ స్తంభానికి కట్టేసి కర్రలతో విచక్షణారహితంగా దాడి చేశారు. గౌతమ్ మృతి చెందినట్లు భావించి నిందితులు అక్కడి నుంచి వెళ్లి పోయారు.అనంతరం గాయపడిన గౌతమ్‌ను కుటుంబ సభ్యులు అంబులెన్స్‌లో ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్ వద్దకు తీసుకెళ్లారు. చికిత్స నిమిత్తం ప్రైవేట్ హాస్పిటల్లో చేరి్పంచారు. బాధితుడు గౌతమ్ తనపై జరిగిన దాడిపై ఈ నెల 21న నాగోలు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. కానీ.. ఇన్స్పెక్టర్ పరశురాం స్పందించలేదు. దీంతో బాధితుడు తగిన ఆధారాలతో ఉన్నతాధికారులను ఆశ్రయించాడు. దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఈ నెల 22న ఏడుగురు నిందితులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఇద్దరు జువైనల్ అఫెండర్లను హోంకు తరలించారు. ఉప్పల్ ఎస్ఐపై కూడా.. ఉప్పల్: విధుల్లో నిర్లక్ష్యం వహిస్తూ, పోకరీలతో అంటకాగుతున్నాడనే ఆరోపణలను ఎదుర్కొంటున్న ఉప్పల్ ఎస్ఐ సీహెచ్ శంకర్‌పై రాచకొండ సీపీ సస్పెన్షన్ వేటు వేశారు. ఉప్పల్ ఇన్స్పెక్టర్ ఎలక్షన్ రెడ్డిని సీపీ కార్యాలయానికి అటాచ్ చేస్తూ ఆదివారం నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. వివరాలు ఇలా ఉన్నాయి. ఉప్పల్ భగాయత్ లే అవుట్లో ప్రేమ జంట ఇచ్చి న ఫిర్యాదుపై ఉప్పల్ ఎస్ఐ కేసు నమోదు చేయకుండా నిర్లక్ష్యం వహించాడని, ఇందుకోసం భారీగా ముడుపులు తీసుకున్నట్లు పోలీసు ఉన్నతాధికారులకు సమాచారం అందింది. ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకున్న పోలీస్ ఉన్నతాధికారులు శనివారం ఉప్పల్ ఎస్ఐ శంకర్‌పై విచారణకు ఆదేశించి, ఆదివారం శంకర్‌ను సస్పెండ్ చేస్తూ రాచకొండ సీపీ ఆదేశాలు జారీ చేశారు. ఎస్ఐతో పాటు ఈ కేసు విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఉప్పల్ ఇన్స్పెక్టర్ ఎలక్షన్ రెడ్డిని రాచకొండ సీపీ కార్యాలయానికి అటాచ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. ఇన్చార్జి ఇన్స్పెక్టర్గా డీఐ మన్మథరావును నియమించారు. -
కర్రలతో కొట్టి.. గాయాలపై కారం చల్లి
కొత్తగూడ: చోరీకి పాల్పడ్డాడనే అనుమానంతో ఓ దళిత యువకుడిని కర్రలతో చావకొట్టి.. రక్తం కారుతున్న గాయాలపై కారం చల్లి చిత్ర హింసలు పెట్టిన అమానవీయఘటనకు సంబంధించిన వీడియో శనివారం కలకలం రేపింది. బాధితుడి కథనం మేరకు.. మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలం జంగవానిగూడెం(రాంపూర్) గ్రామానికి చెందిన యువకుడు వంకాయల కార్తీక్‌ను అదే మండలం పొగుళ్లపల్లి గ్రామానికి చెందిన టెంట్‌హౌస్ యజమాని గద్ద అశోక్ పనికి పెట్టుకున్నాడు. ఈ క్రమంలో డీజే(సౌండ్ బాక్స్)లో ఉపయోగించే యాంప్లిఫైయర్ చోరీకి గురైందని, దాన్ని ఖానాపూర్‌లో విక్రయించారని యజమాని అశోక్ గుర్తించాడు. దీంతో అశోక్ కొందరు వ్యక్తులను తీసుకుని ఈ నెల 19వ తేదీన జంగవానిగూడెం వెళ్లి కార్తీక్‌తో పని ఉందని చెప్పి కారులో ఎక్కించుకుని పొగుళ్లపల్లి సమీప అటవీప్రాంతానికి తీసుకెళ్లి కర్రలతో చితకబాదారు. తప్పించుకుని పారిపోయే క్రమంలో మళ్లీ పట్టుకుని పొగుళ్లపల్లి గ్రామపంచాయతీ కార్యాలయం వద్దకు తీసుకువచ్చారు. ఒంటిపై షర్ట్ విప్పి కార్యాలయ కిటికీకి కట్టి కర్రలతో బాదారు. రక్తం కారుతుండగా గాయాలపై కారం చల్లుతూ చిత్రహింసలకు గురిచేశారు. ఈ ఘటనను మొత్తం వీడియో తీశారు. స్పృహ కోల్పోయిన కార్తీక్‌ను ఇంటి వద్ద వదిలేశారు. గాయాలతో మూలుగుతున్న యువకుడిని బంధువులు నర్సంపేట పట్టణంలోని ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించారు. కార్తీక్‌పై దాడికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని ఈ నెల 20వ తేదీన పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇరువర్గాలపై కేసులు టెంట్‌హౌస్ యజమాని ఫిర్యాదు మేరకు కార్తీక్‌పై చోరీ కేసు, కార్తీక్‌పై దాడి చేసిన ఘటనలో అశోక్‌తోపాటు మరికొంత మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. కానీ విషయాన్ని గోప్యంగా ఉంచారు. సమాచారం తెలుసుకున్న దళిత సంఘాలు మహబూబాబాద్ డీఎస్పీకి ఫిర్యాదు చేయడంతో శుక్రవారం రాత్రి దాడి ఘటన వివరాలు బయటికి వచ్చాయి. -
దళిత యువకుల అరెస్టులో.. పోలీసుల తీరుపై జగ్గిరెడ్డి ఆగ్రహం
కొత్తపేట/రావులపాలెం: కోనసీమ జిల్లా రావులపాలెం మండలం గోపాలపురం వివాదంలో అమాయకులైన దళిత యువకుల అరెస్టులో పోలీసుల తీరుపై స్థానిక వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ చిర్ల జగ్గిరెడ్డి ఆగ్రహం వ్యక్తంచేశారు. గోపాలపురం వద్ద ఒక ఫాస్ట్‌పుడ్ సెంటర్లో ఈనెల 5న డిస్పోజబుల్ ప్లేట్లపై అంబేడ్కర్ చిత్రం ఉండటంపై తలెత్తిన వివాదం కేసులో ఒక వర్గానికి చెందిన ఇద్దరిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయగా, మరో వర్గానికి చెందిన 18 మంది దళిత యువకులపై కేసులు నమోదుచేసి రిమాండ్‌కు పంపిన విషయం తెలిసిందే. నాలుగు రోజులుగా వైఎస్సార్సీపీ ప్లీనరీలో నిమగ్నమైన ప్రభుత్వ విప్ ఆదివారం రావులపాలెం చేరుకున్నారు. దళిత యువకుల అరెస్టుపై ఆరా తీశారు. ఈ విషయంలో పోలీసులు అత్యుత్సాహంతో అమాయకులపై అక్రమ కేసులు నమోదు చేశారంటూ దళిత నాయకులు, పార్టీ కార్యకర్తలతో రావులపాలెం సెంటర్లోని వైఎస్సార్సీపీ కార్యాలయం వద్ద సమావేశమయ్యారు. తానులేని సమయంలో ప్రతిపక్ష పార్టీల నాయకులు ఈ వివాదాన్ని రాజకీయం చేస్తూ వైఎస్సార్సీపీకి, తనకు ఆపాదించేందుకు ప్రయత్నించారని ఆయన మండిపడ్డారు. తమ కుటుంబం ఆది నుంచీ దళిత పక్షపాతిగా సాగుతోందన్నారు. తానులేని సమయంలో జరిగిన ఘటనను కుట్రపూరితంగా గోరంతను కొండంత చేసి రాజకీయంగా బురదజల్లేందుకు ప్రయత్నించడం తగదని జగ్గిరెడ్డి ఖండించారు. అరెస్టయిన 18 మంది దళిత యువకుల్లో తమ గ్రామానికి చెందిన వారు 10 మంది ఉన్నారని.. అలాగే, పార్టీకి చెందిన వారు మొత్తం 14 మంది ఉన్నారన్నారు. కేసు విషయంలో పోలీసులు అత్యుత్సాహంగా చూపి కేసులు నమోదు చేయడాన్ని నిరసించారు. దళిత యువకుల అరెస్టులో తన ప్రమేయం ఉన్నట్లు ప్రతిపక్షాలు రుజువు చేయాలని ఆయన సవాల్ విసిరారు. అనంతరం.. రావులపాలెం పోలీస్‌స్టేషన్ వద్ద కొద్దిసేపు నిరసన వ్యక్తంచేసి ఎస్సై చాంబర్ వద్ద బైఠాయించారు. అమలాపురం డీఎస్పీ వై. మాధవరెడ్డి, సీఐ వెంకటనారాయణ స్టేషన్‌కు చేరుకుని జగ్గిరెడ్డితో చర్చలు జరిపారు. దళిత యువకులకు న్యాయం చేస్తా : విక్టర్‌ప్రసాద్ ఇక ఈ ఘటనలో అరెస్టయిన దళిత యువకులకు న్యాయం చేసేందుకు తగు చర్యలు తీసుకుంటామని రాష్ట్ర ఎస్సీ కమిషన్ చైర్మన్ ఎం. విక్టర్‌ప్రసాద్ హామీ ఇచ్చారు. ఆదివారం సాయంత్రం రాజమహేంద్రవరం నుంచి గోపాలపురం చేరుకున్న ఆయన బాధితులతో సమావేశమై వివాదంపై ఆరా తీశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అక్రమ కేసుల్లో అరెస్టయిన దళిత యువకులను వారం రోజుల్లో బయటకు తీసుకువచ్చేందుకు ఎస్సీ కమిషన్ ద్వారా చర్యలు తీసుకుంటామన్నారు. ఈయన వెంట రామచంద్రపురం ఆర్డీఓ సింధు సుబ్రహ్మణ్యం, అమలాపురం డీఎస్పీ వై. మాధవరెడ్డి, సీఐ వెంకటనారాయణ తదితరులు రాగా వారిని స్థానిక దళితులు వ్యతిరేకిస్తూ గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. దీంతో విక్టర్ ప్రసాద్ ఒక్కరే దళితులతో సంప్రదింపులు జరిపారు. -
రాయపూడిలో టీడీపీ నాయకుడి రౌడీయిజం
తాడికొండ: గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం రాయపూడి గ్రామానికి చెందిన తెలుగుదేశం పార్టీ నాయకుడు, అమరావతి మైనార్టీ జేఏసీ నేత షేక్ జానీ తన గ్యాంగ్‌తో హల్చల్ చేశాడు. పెదపరిమికి చెందిన దళిత యువకుడిని నిర్బంధించి కారులో తీసుకెళ్లి చితకబాదడంతో పాటు, కాళ్లు పట్టి క్షమాపణ కోరాలని బెదిరించిన ఘటన సోమవారం అర్ధరాత్రి జరిగింది. పెదపరిమికి చెందిన పాటిబండ్ల శ్రీకాంత్ అనే యువకుడు తుళ్లూరుకు చెందిన తన స్నేహితులైన మరో ఇద్దరితో కలిసి మోతడక నుంచి బైక్‌పై వస్తుండగా, వాహనంపై ఉన్న ఓ యువకుడికి జానీ గ్యాంగ్ నుంచి ఫోన్ కాల్ వచ్చింది. ఫోన్ మాట్లాడుతున్న సమయంలో మిగిలిన ఇద్దరు యువకులు మాట్లాడుకుంటున్న సంభాషణను అపార్థం చేసుకున్న జానీ గ్యాంగ్ సభ్యులు.. తమ బాస్‌ను దుర్భాషలాడారంటూ వాదనకు దిగారు. అంతటితో ఆగకుండా జానీకి చెందిన కారులో పెదపరిమి గ్రామానికి వచ్చి దళిత యువకుడు పాటిబండ్ల శ్రీకాంత్‌పై దాడిచేసి కారులో నిర్బంధించి అమానవీయంగా ప్రవర్తించారు. ఈ ఘటనలో బాధితుడు పోలీసులను ఆశ్రయించగా ఆరుగురిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టంతో పాటు కిడ్నాప్ కేసు నమోదు చేసిన పోలీసులు.. నిందితులను అదుపులోకి తీసుకొని కారు సీజ్ చేశారు. -
దళిత యువకులపై టీడీపీ నేతల దాష్టీకం
అనకాపల్లి టౌన్: విశాఖ జిల్లాలో దళిత యువకులపై టీడీపీ నేతలు దాష్టీకానికి పాల్పడ్డారు. స్తంభాలకు కట్టేసి నోటి వెంట రక్తం పడేలా కొట్టారు. అనకాపల్లి మండలంలోని జీవీఎంసీ విలీన గ్రామం కేఎన్ఆర్ పేటలో ఈ దారుణం చోటు చేసుకుంది. ఈ నెల 10వ తేదీ రాత్రి మారేడుపూడి ప్రాంతానికి చెందిన అన్నదమ్ములు రాకేష్, లోకనాథ్‌లు బైక్‌పై వేగంగా వెళుతున్నారు. అదే సమయంలో టీడీపీకి చెందిన ఆ ప్రాంత మాజీ సర్పంచ్ కె.సత్యనారాయణ యువకులపై ఆగ్రహించారు. యువకులు ఎదురు తిరగడంతో ఆగ్రహించిన సర్పంచ్ అనుచరులు సమీపంలోని రెండు స్తంభాలకు వారిని కట్టేసి నోటి నుంచి రక్తం పడేలా తీవ్రంగా కొట్టారు. వారి తల్లి రాజ్యలక్ష్మి శనివారం ఇచ్చిన ఫిర్యాదు మేరకు నిందితులపై ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేశారు. డీఎస్పీ సునీల్ ఆధ్వర్యంలో మాజీ సర్పంచ్ కశిరెడ్డి సత్యనారాయణ, కరిత్తుల లక్ష్మణకుమార్, కశిరెడ్డి అప్పారావు, కశిరెడ్డి విరోదికుమార్, బెల్లాన మధు, కశిరెడ్డి ముఖేష్, గొంతిన లక్ష్మిలను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. -
వైరల్ వీడియో: చెట్టుకు కట్టేసి, కర్రలతో మర్మాంగాలపై దాడి
-
చెట్టుకు కట్టేసి, కర్రలతో మర్మాంగాలపై దాడి.. వీడియో వైరల్
లక్నో: ఉత్తర ప్రదేశ్, కాన్పూర్ దేహాట్ జిల్లాలో ఒక దళిత యువకుడి(20)పై దారుణంగా దాడి చేసిన ఘటన కలవరం రేపింది. ప్రేమ వ్యవహారం కారణంగా యవకుడిని కులం అడిగి మరీ దారుణంగా దాడి చేసిన వైనం కలకలం సృష్టించింది. రెండు రోజుల క్రితం కాన్పూర్ దేహాట్ లోని అక్బర్పూర్ ప్రాంతంలో చోటు చేసుకున్న ఈ అమానుషానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. తమ గ్రామంలోని అమ్మాయిని ప్రేమిస్తున్న కారణంగా కొంతమంది అతనిపై దృష్టిపెట్టారు. అమ్మాయిని కలిసేందుకు గ్రామంలోకి వచ్చిన సదరు యువకుడిని జుట్టు పట్టి లాక్కొచ్చారు. అతని కులం అడిగారు. ఆ తరువాత మరింత రెచ్చిపోయారు. కర్రలతో తీవ్రంగా కొట్టారు. మోకాళ్లతో తన్ని, కర్రలతో విపరీతంగా కొట్టారు. అంతటి వారి ఆగడం ఆగలేదు. బలవంతంగా అతణ్ణి చెట్టుకు కట్టేసి ఇష్టం వచ్చినట్టుగా చితకబాదారు. అతణ్ని పట్టుకుని మరీ మర్మాంగాలపై దాడి చేసిన వైనం వీడియోలో రికార్డైంది. బాధితుడి బంధువులు తీవ్రంగా గాయపడిన అతడిని ఆసుపత్రిలో చేర్చి చికిత్స అందిస్తున్నారు. ఫిర్యాదును స్వీకరించడానికి పోలీసులు మొదట్లో నిరాకరించారని బాధితుని కుటుంబ సభ్యులు ఆరోపించారు. మరోవైపు ఈ వీడియో సంచలనం రేపడంతో పోలీసులు స్పందించారు. వీడియో ఆధారంగా కేసు నమోదు చేసిన పోలీసులు ఒక వ్యక్తిని అరెస్టు చేశారు. ఇతర నిందితులను పట్టుకునేందుకు పోలీసు బృందాలను ఏర్పాటు చేసినట్లు పోలీసు ఉన్నత అధికారి తెలిపారు. -
ఘోరం: యువకుడి జననాంగాలపై రాడ్డుతో..
ఉత్తరప్రదేశ్: తమ అమ్మాయితో సంబంధం కొనసాగిస్తున్నాడనే ఆగ్రహంతో ఓ దళిత యువకుడిపై ఆ అమ్మాయి కుటుంబసభ్యులు తీవ్రంగా దాడి చేశారు. నలుగురు కలిసి ఆ యువకుడిని చితకబాదారు. అంతటితో ఆగకుండా జననాంగాలపై తీవ్రంగా దాడి చేశారు. మలద్వారంలో రాడ్ దించి దారుణంగా వ్యవహరించారు. దీంతో ఆ యువకుడు అపస్మారక స్థితిలో ఉన్నాడు. ప్రస్తుతం ప్రాణాపాయ స్థితిలో ఆస్పత్రిలో కొట్టుమిట్టాడుతున్నాడు. ఉత్తరప్రదేశ్‌లోని లక్క్క్ష్మీపూర్ ఖేరీ ప్రాంతంలో 22 ఏళ్ల దళిత యువకుడిపై ఓ అమ్మాయిని ప్రేమిస్తున్నాడు. ఈ విషయం తెలుసుకున్న అమ్మాయి తండ్రి బ్రహ్మాదీన్, ఆమె సోదరులు భరత్, గజరాజ్, రాజు ఆ యువకుడిపై దాడి చేయాలని ప్లాన్ వేశారు. ఈ క్రమంలో బుధవారం రాత్రి ఆ దళిత యువకుడిని వెంబడించారు. అనంతరం వెంటనే చితక్కొట్టారు. తీవ్రంగా దాడి చేసి వదిలేయకుండా అమానుషంగా ప్రవర్తించారు. మలద్వారంలో పెద్ద ఇనుప రాడ్ చొప్పించారు. తీవ్ర గాయాలపాలైన ఆ యువకుడు అపస్మారక స్థితికి చేరుకున్నాడు. ఈ సమాచారం తెలుసుకున్న బాధిత యువకుడి సోదరుడు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న టికోనియా పోలీసులు వెంటనే దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలో ఆ యువకుడిపై దాడికి పాల్పడిన తండ్రి బ్రహ్మాదీన్, అతడి ముగ్గురు కుమారులు భరత్, గజరాత్, రాజులను అదుపులోకి తీసుకున్నారు. విచారణ అనంతరం వారిని రిమాండ్‌కు తరలించారు. బాధిత యువకుడు జిల్లా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటనపై స్థానికంగా తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. పైగా దళితుడిపై దాడి జరగడంతో రాజకీయంగా వివాదాస్పదమవుతోంది. -
రెస్టారెంట్లో గొడవ.. దుస్తులిప్పి చితకబాదారు
అహ్మదాబాద్: గుజరాత్‌లోని అహ్మదాబాద్ నగరంలో ఆదివారం రాత్రి దారుణం జరిగింది. అహ్మదాబాద్ సబర్మతీ టోల్‌నాకా ప్రాంతంలోని ఓ రెస్టారెంట్ వద్ద దళిత యువకుడిని బట్టలిప్పి చితకబాదారు. ఈ దాడిని అడ్డుకోవడానికి ప్రయత్నించిన మరో యువకుడిపై దాడిచేశారు. 2016లో ఉనాలో దళితులపై జరిగిన దాడి తరహాలో ఈ ఘటన ఉండటం.. ఈ ఘటనకు సంబంధించిన వీడియో వెలుగుచూడటం గుజరాత్ రాజకీయాల్లో కలకలం రేపుతోంది. దళిత యువకులైన ప్రగ్నేష్ పర్మార్, జేయేశ్ ఇక్కడి రెస్టారెంట్‌కు వచ్చారు. ఆ తర్వాత కాసేపటికి రెస్టారెంట్ ఓనర్‌తో వారికి తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. దీంతో కొందరు అక్కడ గుమిగూడి ఆ ఇద్దరు యువకుల్ని కర్రలతో చితకబాదినట్టు పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఈ ఘటనలో ప్రగ్నేష్ చొక్కా విప్పి మరీ కర్రలతో చితకబాదినట్టు వెలుగులోకి వచ్చిన వీడియోను బట్టి తెలుస్తోంది. ఈ దాడిని అడ్డుకునేందుకు ప్రయత్నించిన జయేశ్‌పైనా దాడి చేశారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన ప్రగ్నేశ్ ప్రస్తుతం అహ్మదాబాద్ ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. అతని పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఇక, దళిత యువకులపై దాడి చేసిన రెస్టారెంట్ ఓనర్ మహేశ్ థాకూర్‌తోపాటు శంకర్ థాక్రేపై సెక్షన్ 370 (హత్యాయత్నం) అభియోగం కింద అభియోగాలు నమోదుచేసిన పోలీసులు నిందితులను తర్వలోనే అరెస్టు చేస్తామని ప్రకటించారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోను ట్విటర్లో షేర్ చేసిన దళిత ఎమ్మెల్యే జిగ్నేశ్ మేవానీ 24 గంటల్లోగా నిందితులను అరెస్టు చేయకపోతే.. గుజరాత్ బంద్‌కు పిలుపునిస్తానని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. -
పరారీలో చింతమనేని ప్రభాకర్
సాక్షి, పశ్చిమగోదావరి : దళితులను అసభ్య పదజాలంతో దూషించిన టీడీపీ నేత, దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ అరెస్ట్‌కు రంగం సిద్ధం అయింది. అతని కోసం పోలీసులు గాలిస్తున్నారు. ప్రస్తుతం చింతమనేని పరారీలో ఉన్నట్లు సమాచారం. గురువారం పినకడిమిలో దళిత యువకులపై దాడి చేసిన ఘటనలో మాజీ ఎమ్మెల్యే చింతమనేనిపై ఎస్సీ, ఎస్టీ కేసు నమోదైంది. అతన్ని తక్షణమే అరెస్ట్ చేయాలని దళిత సంఘాలు ఆందోళనకు దిగాయి. ఈ నేపథ్యంలో చింతమనేని కోసం పోలీసులు గాలిస్తున్నారు. పరారీలో ఉన్న చింతమనేని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయని పోలీసు అధికారులు పేర్కొన్నారు. (చదవండి : దళిత యువకులపై దాడికి యత్నం) -
తన ఇంటి ముందు బైక్‌పై వెళుతున్నాడని..
సాక్షి, భోపాల్ : మధ్యప్రదేశ్‌లో దారుణం చోటుచేసుకుంది. దళిత యువకుడు తమ ఇంటి ముందు బైక్‌పై వెళుతుండటాన్ని తట్టుకోలేని గ్రామ సర్పంచ్ మరో నలుగురు కలిసి అతడిని తీవ్రంగా గాయపరిచారు. తికంఘర్ జిల్లాలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈనెల 21న తాను బైక్‌పై వెళుతుండగా గ్రామ సర్పంచ్ హేమంత్ కుర్మీ, అతని సోదరులు, ఇతరులు తనను అడ్డుకుని బైక్‌పై నుంచి తోసివేశారని, తనను దారుణంగా కొట్టారని దయారాం అహిర్వార్ (30) పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితుడి ఫిర్యాదు మేరకు నిందితులు హేమంత్ కుర్మీ, ఆయన సోదరులు వినోద్ కుర్మీ, మున్ను కుర్మీ, అనిరుధ్ కుర్మీ, మరో నిందితుడు దినేష్ యాదవ్‌లను అరెస్ట్ చేశామని స్థానిక ఏఎస్ఐ రామ్‌సేవక్ ఝా తెలిపారు. తమ ఇంటి ముందున్న రోడ్డుపై బైక్‌పై వెళ్లవద్దని నిందితుడు తనను హెచ్చరించాడని అహిర్వార్ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. తన ఇంటి ముందు బైక్‌పై వెళ్లకుండా తోసుకుంటూ వెళ్లాలని సలహా ఇచ్చాడని చెప్పారు. నిందితులపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. -
బాధ్యులను అరెస్టు చేయాలి
ఆర్మూర్ : దళిత యువకులు తలారిసత్యం, చేపూర్ రవిల మృతికి కారణమైన వారిని అరెస్టు చేయాలని రాజ కీయ, ప్రజా సంఘాల, దళిత సంఘాల జేఏసీ జిల్లా అధ్యక్షుడు సావె ల్ గంగాధర్ డిమాండ్ చేశారు. రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు అనుమానాస్పదంగా మృతి చెందారన్నారు. తన కొడుకు తలారి సత్యంను ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి హత్య చే యించారని ఆరోపిస్తూ మృతుని తండ్రి తలారి గంగాధర్ అలియాస్ బక్కన్న పట్టణంలోని తహసీల్ కార్యాలయం ఎదుట సోమవారం ప్రారంభించిన నిరసన దీక్షను మంగళవారం జేఏసీ నాయకుడు గంగాధర్ విరమింపజేశారు. అంతకు ముందు రాజకీయ, ప్రజా, దళిత సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో పట్టణంలోని తహసీల్ కార్యాలయం నుంచి కొత్త బస్టాండ్, మామిడిపల్లి చౌరస్తా మీదుగా అంబేద్కర్ చౌరస్తా వరకు భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. అంబేద్కర్ చౌరస్తాలో మానవ హారంగా ఏర్పడి ధర్నా చేశారు. అనంతరం రాష్ట్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. ధర్నాలో సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసి జిల్లా నాయకుడు ప్రభాకర్, టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాజారాం యాదవ్, మున్సిపల్ మాజీ చైర్మన్ కంచెట్టి గంగాధర్, సీపీఐ జిల్లా కార్యదర్శి కంజర భూమయ్య, సీపీఎం జిల్లా కార్యదర్శి గంగాధరప్ప, అంబేద్కర్ సంఘం జిల్లా అధ్యక్షుడు కోటేశ్వర్‌రావులు మాట్లాడుతూ తలారి సత్యం, రవిల మృతిపై సీబీఐ విచారణ జరిపించాలని, మృతుల కుటుంబాలకు రూ.50 లక్షల ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని డిమాండ్ చేశారు. నిరసన కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ ఎస్సీ సెల్ కన్వీనర్ పీసీ భోజన్న, పార్టీ పట్టణ అధ్యక్ష, కార్యదర్శులు గంగామోహన్ చక్రు, నర్మె నవీన్, సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ నాయకులు దాసు, ముత్తెన్న, టీడీపీ నాయకులు దేగాం యాదగౌడ్, నర్సింహారెడ్డి, సీపీఐ నాయకులు ఆరేపల్లి సాయిలు, నిఖిల్, సీపీఎం నాయకులు వెంకటేశ్, ఎల్లయ్య, అంబేద్కర్ సంఘం నాయకులు సదాశివ్, అరుణోదయ కళాకారులు సూరిబాబు, సురేందర్, సుమన్ తదితరులు పాల్గొన్నారు. -
నర్సింగాపురంలో ఉద్రిక్తత
దళిత యువకుడి మరణం పరిస్థితికి కారణం పోలీసుల బందోబస్తు కొత్తకోట : కొత్తకోట మండలం నర్సింగాపురం గ్రామంలో ఓ దళిత యువకుడి మరణం ఉద్రిక్తతకు దారి తీసింది. దీంతో పోలీసులు ముందు జాగ్రత్త చర్యగా గ్రామంలో పోలీసు బలగాలను మోహరించారు. గత ఏడాది ఆగస్టు 15న గ్రామానికి చెందిన బాలకృష(్ణ32) అనే దళిత యువకుడు ఓ ప్రేమజంటకు సహకరించాడన్న ఆరోపణలతో ఆతనిపై అమ్మాయి సంబంధీకులు గ్రామంలో స్తంభానికి కట్టేసి దాడి చేశారు. ఈ విషయంలో పోలీసులు జోక్యం చేసుకుని అతన్ని విడిపించారు. దాడి చేసిన వారిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి జైలుకు పంపారు. అయితే మూడు నెలల పాటు వైద్యం పొందిన బాలకృష్ణ హైదరాబాద్‌లోనే ఉంటున్నాడు. గురువారం తెల్లవారుజామున గుండెపోటుతో మరణించాడని శవాన్ని గ్రామానికి తీసుకువచ్చారు. అయితే తన అన్న మరణంపై అనుమానాలున్నాయని, గతంలో జరిగిన దాడి వల్లే ఊపిరితిత్తులు దెబ్బతిని మరణించాడని తమ్ముడు తిరుపతయ్య పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో శవాన్ని సాయంత్రం పోస్టుమార్టం కోసం వనపర్తికి తరలించారు. అనంతరం రాత్రి గ్రామంలో అంత్యక్రియలు నిర్వహించారు. ఈనేపథ్యంలోనే పలు దళిత సంఘాల నాయకులు బాలకృష్ణ మరణంపై అనుమానాలు వ్యక్తం చేశాయి. గతంలో దాడి చేసిన వారిపై నమోదు చేసిన హత్యాయత్నం చేసును హత్య కేసుగా నమోదు చేయాలని డిమాండ్ చేశారు. నిజానిజాలు వెలికి తీసి బాధ్యులను శిక్షించాలని కొత్తకోట అంబేద్కర్ సంఘం అధ్యక్షుడు ఇజ్రయిల్, నాయకులు కె.భరత్‌భూషన్, మిషేక్, పి.ప్రశాంత్, మన్నెం, జె.ఆర్.కుమార్, దావీద్, నారాయణ డిమాండ్ చేశారు.