తీగ లాగితే.. టీడీపీ కదిలింది | TDP MLA Eluri Sambasivarao Company irregularities with Black Money | Sakshi
Sakshi News home page

తీగ లాగితే.. టీడీపీ కదిలింది

Published Mon, Jan 29 2024 4:23 AM | Last Updated on Mon, Jan 29 2024 4:23 AM

TDP MLA Eluri Sambasivarao Company irregularities with Black Money - Sakshi

సాక్షి, అమరావతి: నల్లధనం తీగ లాగితే టీడీపీ డొంక కదిలింది! పర్చూరు టీడీపీ ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు చైర్మన్‌గా వ్యవహరిస్తున్న ‘నోవా అగ్రిటెక్‌’ జీఎస్టీ ఎగవేతపై తనిఖీలు నిర్వ­హిస్తే ఆ కంపెనీ కేంద్రంగా సాగిస్తున్న నల్లధనం బాగోతం బట్టబయలైంది. గుంటూరులోని నోవా అగ్రిటెక్‌ కంపెనీ భారీ ఆర్థిక అక్రమాలకు అడ్డాగా మారిందని రాష్ట్ర డైరెక్టరేట్‌ ఆఫ్‌ రెవెన్యూ ఇంటెలిజెన్స్‌ (డీఆర్‌ఐ) తనిఖీల్లో  వెల్లడైంది.

వ్యాపార కార్యకలాపాల ముసుగులో షెల్‌ కంపెనీల ద్వారా నల్లధనాన్ని చలామణిలోకి తెచ్చి ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడినట్లు ఆధారా­లతో నిగ్గు తేలింది. విచారణకు సహకరించకుండా మొండికేస్తున్న నోవా అగ్రిటెక్‌కు డీఆర్‌ఐ అధికారులు ఇప్పటికే నోటీసులు జారీ చేయగా కంపెనీ యాజమాన్యం, ప్రతినిధులపై ఎఫ్‌ఐఆర్‌ నమోదుకు బాపట్ల పోలీసులు సిద్ధమయ్యారు.

లెక్కా పత్రాలు లేవు..
జీఎస్టీ ఎగవేస్తున్న కంపెనీల జాబితాను సేకరించిన కేంద్ర ప్రభుత్వం దీన్ని ఆయా రాష్ట్రాలకు పంపింది. ప్రభుత్వ ఖజానాకు గండికొడుతున్న ఆ కంపెనీల్లో తనిఖీలు చేయాలని ఆదేశించింది. ఈమేరకు జాబితాలో ఉన్న నోవా అగ్రిటెక్‌ కంపెనీ కార్యాలయంలో సోదాలు నిర్వహించిన డీఆర్‌ఐ అధికారులు విస్తుపోయారు. జీఎస్టీ చెల్లింపులకు సంబంధించి నోవా  కార్యాలయంలో ఒక్క రికార్డు కూడా లేదు. వ్యాపార కార్యకలాపాలకు సంబంధించి ఎలాంటి పత్రాలు, రశీదులు, ఇన్వాయిస్‌లు, బ్యాంకు లావాదేవీలు, ఇతర వివరాలేవీ లేవు.

దీంతో అసలు ఆ కార్యాలయం నుంచి వ్యాపార కార్యకలాపాలు నిర్వహిస్తున్నారా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రికార్డుల్లో మాత్రం చాలా మంది పేర్లు ఉండగా వారిలో సగం మంది ఉద్యోగులు కూడా కార్యాలయంలో లేకపోవడం గమనార్హం. జీఎస్టీకి సంబంధించిన పత్రాలేవీ రికార్డుల్లో లభించ లేదు. దీంతో నోవా అగ్రిటెక్‌ కంపెనీకి నోటీసులు జారీ చేసి బాధ్యులు వ్యక్తిగతంగా హాజరై వివరణ ఇవ్వాలని పేర్కొంటూ డీఆర్‌ఐ అధికారులు నోటీసులు జారీ చేశారు.

నల్లధనం కేరాఫ్‌ ‘నోవా’
నోవా అగ్రిటెక్‌ కార్యాలయంలో తనిఖీల సందర్భంగా లభ్యమైన ఓ డైరీ ఎన్నికల్లో టీడీపీ నేతల నల్లధనం పంపిణీ గుట్టును రట్టు చేసింది. 2019 ఎన్నికల్లో పర్చూరు నియోజకవర్గంలో ఎలా అక్రమాలకు పాల్పడ్డారో అందులో సవివరంగా ఉంది. నల్లధనం వెదజల్లి ఇతర ప్రాంతాల నుంచి దొంగ ఓటర్లను రప్పించడం, డబ్బు పంపిణీ చేసి ఓటర్లను ప్రలోభపెట్టడం లాంటి వివరాలన్నీ అందులో ఉన్నాయి. వ్యవసాయ అనుబంధ కార్యకలాపాల కోసం నోవా కంపెనీని నెలకొల్పినట్లు టీడీపీ ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు బుకాయించారు. కంపెనీ పేరిట భారీగా నల్లధనాన్ని చలామణిలోకి తెచ్చారు.

ఆ కార్యాలయం నుంచి వ్యాపార కార్యకలాపాలు కాకుండా నల్లధనం చలామణి సాగిస్తున్నట్లు డైరీతో పాటు అక్కడ లభ్యమైన మరికొన్ని కీలక ఆధారాలు వెల్లడించాయి. అందుకోసమే కంపెనీ బ్యాంకు ఖాతాలను వినియోగిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. నోవాకు నగదు ఏ ఖాతాల నుంచి వస్తోంది? ఆదాయ వనరులు ఏమిటి? అనే వివరాలపై కంపెనీ ఉద్యోగులు మౌనం పాటిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ వ్యవహారంపై సమగ్రంగా విచారించాలని కోరుతూ కేంద్ర ఆదాయపన్ను శాఖ, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్, స్టాక్‌ ఎక్చేంజ్‌ బోర్డ్‌ ఆఫ్‌ ఇండియా(సెబీ)లకు డీఆర్‌ఐ అధికారులు నివేదించారు.

నోవా యాజమాన్యం, ప్రతినిధులపై ఎఫ్‌ఐఆర్‌ నమోదుకు అనుమతి కోరుతూ పోలీసుశాఖ బాపట్ల న్యాయస్థానంలో పిటిషన్‌ దాఖలు చేసింది. దీనిపై సోమవారం నిర్ణయాన్ని వెలువరించే అవకాశాలున్నాయని భావిస్తున్నారు. అనంతరం ఈ కేసులో విచారణను పోలీసులు వేగవంతం చేయనున్నారు. టీడీపీ ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు, ఇతరులకు నోటీసులు జారీ చేసి విచారణకు హాజరు కావాలని ఆదేశించనున్నారు.  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement