పోలీసు స్టేషన్ వద్ద ధర్నా చేస్తున్న వైఎస్సార్‌సీపీ నాయకులు
యాదమరి (చిత్తూరు జిల్లా): చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం యాదమరి మండలంలో ఆదివారం టీడీపీ రచ్చకు దిగింది. ఆ పార్టీ ఎమ్మెల్సీ దొరబాబు కారులో హల్‌చల్ చేశారు. ఆయన కారు ఢీకొనడంతో ఇద్దరు వైఎస్సార్ సీపీ కార్యకర్తలు తీవ్రంగా గాయపడ్డారు. యాదమరి మండలంలో 26 పంచాయతీలకుగాను సర్పంచి పదవులకు 142 మంది నామినేషన్లు వేశారు. ఆదివారం ఎమ్మెల్సీ దొరబాబు టీడీపీ నాయకులను తన కారులో ఎక్కించుకుని నామినేషన్ కేంద్రాల వద్ద హల్‌చల్ చేశారు. జోడిచింతల వద్ద రహదారి పక్కగా వెళుతున్న ఇద్దరు వైఎస్సార్‌సీపీ కార్యకర్తల మీదకు దూసుకెళ్లారు. కారు ఢీకొని పడిపోయిన వారిద్దరూ తీవ్రంగా గాయపడ్డారు. ఎమ్మెల్సీ కారులో వేగంగా వెళ్లిపోయారు.
ఇరువర్గాల మధ్య గొడవలు మొదలవడంతో పోలీసులు చెదరగొట్టారు. తమ పార్టీ కార్యకర్తలను కారుతో ఢీకొట్టిన టీడీపీ ఎమ్మెల్సీపై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేస్తూ వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు స్థానిక పోలీస్‌స్టేషన్ వద్ద ధర్నాకు దిగారు. ప్రాథమిక విచారణ నిర్వహించిన ఎస్‌ఐ ప్రతాప్‌రెడ్డి ఎమ్మెల్సీతో పాటు మరో నలుగురిపై కేసులు నమోదు చేశారు. గాయపడిన వారిని చిత్తూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పార్టీలకతీతంగా ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరుగుతుంటే టీడీపీ నాయకులు కావాలనే రెచ్చగొట్టి గొడవలు సృష్టిస్తున్నారని స్థానిక ఎమ్మెల్యే ఎంఎస్ బాబు ఆవేదన వ్యక్తం చేశారు. వైఎస్సార్ సీపీ కార్యకర్తల్ని కారుతో ఢీకొట్టిన ఎమ్మెల్సీపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment