
సాక్షి, అమరావతి: కేసుల దర్యాప్తులో చట్టప్రకారమే వ్యవహరిస్తున్నామని సీఐడీ గురువారం ఒక ప్రకటనలో తెలిపింది. దర్యాప్తులో భాగంగా నిందితులను అరెస్టు చేసిన ప్రతిసారీ వారిని అధికారులు కొట్టారంటూ దుష్ప్రచారానికి పాల్పడటాన్ని ఖండించింది. ముఖ్యమంత్రి కార్యాలయం ప్రతిష్టకు భంగం కలిగించడంతోపాటు సమాజంలో విద్వేషాలు రెచ్చగొట్టేలా సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేసిన కేసులో టీడీపీ రాష్ట్ర కార్యాలయం మీడియా కోఆర్డినేటర్ దారపనేని నరేంద్రబాబును అరెస్టు చేసినట్టు వెల్లడించింది.
‘గన్నవరం విమానాశ్రయంలో భారీగా బంగారం పట్టివేత.. దుబాయి నుంచి అక్రమంగా బంగారం తీసుకువచ్చిన ముఖ్యమంత్రి కార్యాలయంలోని కీలక అధికారి భార్య.. అందుకు సహకరించిన ఇద్దరు కిందిస్థాయి ఉద్యోగులు.. ఆ మహిళతో పాటు ఎయిర్ ఇండియా సిబ్బందిని విచారిస్తున్న కస్టమ్స్ అధికారులు’ అంటూ సోషల్ మీడియాలో కొందరు దుష్ప్రచారం చేసిన కేసులో ఆయన్ని అరెస్టు చేసినట్టు తెలిపింది.
నరేంద్రబాబు తన ఫోన్ నుంచి వివిధ వాట్సాప్ గ్రూపుల్లో ఆ మెసేజ్‌లు పోస్టు చేయడం ద్వారా సమాజంలో విద్వేషాలు రెచ్చగొట్టి శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా వ్యవహరించినట్టు తమ దర్యాప్తులో వెల్లడైందని చెప్పింది. ఆయన్ని విచారించేందుకు ఇంటికి వెళ్లగా ఆయన తన ఫోన్‌లోని మెసేజ్‌లను డిలీట్ చేసేందుకు యత్నించారని తెలిపింది. దాంతో ఐపీసీ సెక్షన్ 201ను అదనంగా నమోదు చేసి అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించామని ఆ ప్రకటనలో సీఐడీ వెల్లడించింది.
Comments
Please login to add a commentAdd a comment