గుంటూరు లీగల్: సీఎం వైఎస్ జగన్ పరువుకు భంగం కలిగించేలా, కించపరిచేలా సోషల్ మీడియాలో పోస్టింగ్‌లు పెట్టిన టీడీపీ గుంటూరు పార్లమెంట్ తెలుగు మహిళ కార్యదర్శి పిడికిటి శివ పార్వతిని బుధవారం పట్టాభిపురం పోలీసులు అరెస్టు చేసి కోర్టులో హాజరుపర్చారు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు..గుంటూరు జిల్లా పెదనందిపాడుకు చెందిన శివ పార్వతి నగరంలోని జేకేసీ రోడ్డులోని విజయపురి కాలనీలో ఉంటుంది. ఆమె టీడీపీ గుంటూరు పార్లమెంట్ తెలుగు మహిళా కార్యదర్శిగా పనిచేస్తూ ఫేస్‌బుక్‌లో ‘లక్ష్మీగణేష్ ఐడీతో పోస్టింగ్‌లు పెడుతుంది.
ఈ నెల 25న సీఎం పరువుకు భంగం కలిగించేలా, కించపరిచేలా అసభ్యకర వ్యాఖ్యలతో వీడియో పోస్టు చేసింది. దీనిపై స్తంబాలగరువుకు చెందిన వైఎస్సార్ సీపీ 42వ డివిజన్ ఇన్‌చార్జ్ చల్లా శేషిరెడ్డి, ఏటి అగ్రహారానికి చెందిన వైఎస్సార్ సీపీ గుంటూరు వెస్ట్ సోషల్ మీడియా కోఆర్డినేటర్ రాజవరపు జగదీష్ పట్టాభిపురం పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీఎం పరువుకు భంగం కలిగించేలా, కించపరిచేలా ఉండటమే కాకుండా అల్లర్లు జరిగేలా రెచ్చగొట్టడం, శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా వీడియో ఉందని ఫిర్యాదులో పేర్కొన్నారు. విచారణ చేపట్టిన పోలీసులు నిందితురాలిని అరెస్టు చేశారు.
నిందితురాలు ఇదే తేదీన పోస్టు చేసిన మరో వీడియోపై మారుతీనగర్‌కు చెందిన షేక్ ఉస్మాన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ కేసులో కూడా పోలీసులు ఆమెను అరెస్టు చేశారు. నిందితురాలు సోషల్ మీడియాలో తరచూ ఇలాంటి పోస్టింగ్స్ పెడుతుందనీ, గతంలో సీసీ నం.1247/2021 లో కూడా ముద్దాయి అని పేర్కొంటూ , ఆమెకు 14 రోజులు జ్యుడీషియల్ రిమాండ్ విధించాలని కోరుతూ పట్టాభిపురం పోలీసులు రిమాండ్ రిపోర్టును కోర్టులో దాఖలు చేశారు. వాదనలు విన్న ఎక్సైజ్ కోర్టు న్యాయమూర్తి జి.స్పందన రిమాండ్‌ను తిరస్కరిస్తూ రూ.10 వేల వ్యక్తిగత పూచీకత్తుపై విడుదల చేశారు.
Comments
Please login to add a commentAdd a comment