లక్నో: పోలీసుల అదుపులో ఉన్న దళిత యువకుడు మృతి చెందడం రాయ్ బరేలీలో నిరసనలకు దారితీసింది. పోలీస్ స్టేషన్‌లో చిత్రహింసలకు గురి చేయడం వల్లే బాధితుడు చనిపోయాడని అతడి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. మృతుడి పట్ల అమానుషంగా ప్రవర్తించి ప్రాణాలు బలిగొన్న ఇద్దరు పోలీసులపై చర్యలు తీసుకోవాల్సిందిగా ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో ఘటనపై లోతుగా దర్యాప్తు జరుపుతున్నామన్న రాయ్ బరేలీ పోలీస్ చీఫ్ స్వప్నిల్ మాంగేన్.. దొంగతనం కేసులో అదుపులోకి తీసుకున్న బాధితుడిని అక్రమంగా స్టేషన్‌లో బంధించినట్లు ప్రాథమికంగా నిర్ధారణ అయ్యిందన్నారు. ఈ నేపథ్యంలో సంబంధిత స్టేషన్ ఇన్‌చార్జిని సస్పెండ్ చేసినట్లు తెలిపారు. (చదవండి: నా మనుమరాలు వేధిస్తోంది: ఎమ్మెల్యే బామ్మ)
వివరాలు.. ఉత్తరప్రదేశ్‌లోని రాయ్ బరేలీ జిల్లాకు చెందిన మోను అలియాస్ మోహిత్ అనే పందొమిదేళ్ల కుర్రాడిని పోలీసులు శుక్రవారం అదుపులోకి తీసుకున్నారు. లాల్‌గంజ్ ఏరియాలో బైకు దొంగతనం చేసిన గ్యాంగ్‌తో అతడికి సంబంధం ఉందన్న ఆరోపణలతో పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఈ విషయం గురించి మోను సోదరుడు సోను మాట్లాడుతూ.. ‘‘మోనుతో పాటు మరో ఐదుగురిని 24 గంటల పాటు పోలీస్ స్టేషనులో ఉంచారు. నన్ను కూడా లాక్కెళ్లారు. తాళం చెవులు ఎక్కడ పెట్టాలో చెప్పాలంటూ చిత్రహింసలకు గురిచేశారు. మోనును విపరీతంగా కొట్టారు. దీంతో వాడు మా ముందే ప్రాణాలు విడిచాడు’అని ఆవేదన వ్యక్తం చేశాడు.(చదవండి: రాముడు, పరుశురాముడు వేరు కాదు: సీఎం)
ఇక ఈ విషయంపై స్పందించిన స్థానిక పోలీసు అధికారులు.. మోనులో న్యుమోనియా లక్షణాలు ఉన్నాయని, శ్వాస పీల్చుకోవడంలో ఇబ్బంది పడుతుంటే ఆస్పత్రికి తరలించినట్లు వెల్లడించారు. తాము అతడిని హింసించలేదని, కోవిడ్ లక్షణాలతో ఆదివారం అతడు మృతి చెందాడని చెప్పుకొచ్చారు. ఈ నేపథ్యంలో పోలీసులు అబద్ధాలు చెబుతున్నారని, వారి టార్చర్ వల్లే తమ కుమారుడు చనిపోయాడని మోను కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన ఎస్పీ స్వప్నిల్ మోంగేన్.. ‘‘శనివారం సాయంత్రం తనకు కడుపు నొప్పి వస్తోందని మోను చెప్పాడు. దీంతో సమీపంలో ఉన్న వైద్యుడితో పరీక్ష చేయించి, అతడికి మందులు ఇప్పించారు. అయితే ఆదివారం ఉదయం అతడి ఆరోగ్యం అకస్మాత్తుగా క్షీణించింది.
వెంటనే రాయ్ బరేలీ జిల్లా ఆస్పత్రికి తరలించాం. ఆక్సీజన్ లెవల్స్ పడిపోయానని వైద్యులు చెప్పారు. అయితే అతడి శరీరంపై ఎలాంటి గాయాలు లేవని తెలిపారు. ఈ క్రమంలో దాదాపు 11 గంటల సమయంలో అతడు మరణించాడు. నిందితుడి కుటుంబం ఫిర్యాదు మేరకు.. ఈ కేసును లోతుగా విచారిస్తున్నాం. పోస్ట్‌మార్టం వీడియో రికార్డింగ్ చేస్తాం. 24 గంటల పాటు మృతుడిని పోలీస్ స్టేషన్‌లో అక్రమంగా నిర్బంధించిన కారణంగా స్టేషన్ ఇంచార్జిని సస్పెండ్ చేశాం’’అని వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment