న్యూఢిల్లీ: పబ్‌జీ కోసం ఓ బాలుడు తన తాత పెన్షన్ ఖాతా నుంచి 2.35 లక్షల రూపాయలను బదిలీ చేసినట్లు ఢిల్లీ పోలీసులు సోమవారం తెలిపారు. నిందితుడు తన తాత పెన్షన్ ఖాతా నుంచి డబ్బును బదిలీ చేశాడని.. ఆ మొత్తాన్ని నెలల తరబడి పబ్‌జీ కోసం వినియోగించాడని ఢిల్లీ సైబర్ పోలీస్ సెల్ విభాగం వెల్లడించింది. కొద్ది రోజుల క్రితం బాధితుడికి తన బ్యాంక్ అకౌంట్ నుంచి 2,500 డ్రా చేసినట్లు మెసేజ్ రావడమే కాక అవైలబుల్ బ్యాలెన్స్ 275 రూపాయలుగా చూపించింది. ఈ మెసేజ్ చూసి బాధితుడు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యాడు. వెంటనే బ్యాంకుకు వెళ్లి తనకు వచ్చిన మెసేజ్ గురించి విచారించగా.. అతని పెన్షన్ ఖాతా నుంచి 2,34, 000 రూపాయలు బదిలీ అయినట్లు తెలిసింది. బాధితుడు వెంటనే పోలీసులను సంప్రదించి, తాను ఎటువంటి లావాదేవీలు చేయలేదని.. తన నంబర్‌కు వన్-టైమ్ పాస్వర్డ్ (ఓటీపీ) కూడా రాలేదని ఆరోపించాడు. (చదవండి: ఇకపై పోచింకిని సందర్శించలేరు..)
గత రెండు నెలల వ్యవధిలో బాధితుడి ఖాతా నుంచి 2,34,497 రూపాయలు బదిలీ అయినట్లు సైబర్ సెల్ గుర్తించింది. పంకజ్ కుమార్ (23) పేరిట ఉన్న పేటీఎం ఖాతాకు చెల్లింపులు జరుగుతున్నట్లు పోలీసులు కనుగొన్నారు. సైబర్ సెల్ పంకజ్ కుమార్‌ను అదుపులోకి తీసుకుంది. విచారణలో తన స్నేహితులలో ఒకరు అతని ఐడీ, పేటిఎమ్ ఖాతా పాస్‌వర్డ్ అడిగినట్లు తెలిపాడు. సదరు వ్యక్తి పబ్‌జీ కోసం గూగుల్ పే చెల్లింపులు చేయడానికి పంకజ్ ఖాతాను ఉపయోగించినట్లు పోలీసులు కనుగొన్నారు. విచారణలో భాగంగా సదరు వ్యక్తిని ఫిర్యాదుదారుడి మనవడిగా గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. తన తాత ఖాతా నుంచి పబ్‌జీ ఆడటానికి నగదు బదిలీ చేసినట్లు నిందితిడు పోలీసుల విచారణలో ఒప్పుకున్నాడు. బ్యాంక్ ఖాతా హ్యాకింగ్ అవుతుందని చెప్పితన తాత మొబైల్ ఫోన్ నుంచి ఓటీపీ మెసేజ్‌లను తొలగించేవాడనని టీనేజర్ పోలీసులకు తెలిపాడు.
Comments
Please login to add a commentAdd a comment