మృతుడు సతీశ్ (ఫైల్)
మొయినాబాద్: ‘సార్.. వాడి తలపై బండరాయితో బాదిన.. కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్నడు’అని ఓ బాలుడు డయల్ 100కు ఫోన్ చేశాడు. స్పందించిన పోలీసులు బాధితుడిని ఆస్పత్రికి తరలిస్తుండగానే ప్రాణాలొదిలాడు. మద్యం మత్తులో జరిగిన గొడవే ఈ ఘటనకు కారణమని పోలీసులు తెలిపారు. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్‌లో సోమవారం సాయంత్రం ఈ ఘటన చోటుచేసుకుంది. మొయినాబాద్ గ్రామానికి చెందిన దుబ్బ సతీశ్ (26) పెయింటర్‌గా పనిచేస్తున్నాడు.
సోమవారం సాయంత్రం ఫుల్లుగా మద్యం సేవించి తూలుకుంటూ మండల కేంద్రంలోని పోచమ్మ గుడి వద్ద నుంచి వెళ్తున్నాడు. అదే సమయంలో పెద్దమంగళారం గ్రామానికి చెందిన ఓ బాలుడు అతని స్నేహితులు నలుగురు ఫొటోలు దిగేందుకు అటువైపు వచ్చారు. గుడి దగ్గర బాలుడి స్నేహితుడికి చెందిన బైక్ ఆపారు. దానిపై బాలుడు కూర్చొని ఉండగా మత్తులో ఉన్న సతీశ్ తన బైక్‌పై ఎందుకు కూర్చున్నావని బాలుడిని ప్రశ్నించాడు.
‘బైక్ నీదికాదు మా స్నేహితుడిది’అంటూ బాలుడు అతన్ని తోసేశాడు. కిందపడిన సతీశ్ లేచి కొట్టే ప్రయత్నం చేయడంతో, సదరు బాలుడు పక్కనే ఉన్న బండరాయిని తీసుకుని అతని తలపై మోదాడు. దీంతో సతీశ్ తల పగిలి తీవ్ర రక్తస్రావమైంది. వెంటనే బాలుడు తన స్నేహితులతో కలసి అక్కడి నుంచి వెళ్లిపోయాడు. కాగా, సాయంత్రం ఆరు గంటల సమయంలో ఘటన జరగడం, అప్పటికే చీకటి పడటంతో అటువైపు ఎవరూ వెళ్లి చూడలేదు.
రాత్రి 10 గంటల సమయంలో బాలుడు మళ్లీ ఘటనా స్థలానికి వచ్చాడు. అప్పటికీ సతీశ్ కొన ఊపిరితో ఉండటంతో 100కు డయల్ చేశాడు. తాను బండరాయితో ఒకరిని కొట్టానని, అతనింకా కొనఊపిరితో ఉన్నాడని సమాచారం ఇచ్చాడు. వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సతీశ్‌ను ఉస్మానియా ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. కేసు నమోదు చేసి నిందితుడు, అతని స్నేహితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది.
Comments
Please login to add a commentAdd a comment