సాక్షి, హైదరాబాద్: తెలుగు అకాడమీకి చెందిన రూ.64 కోట్ల నిధుల స్వాహా కేసులో హైదరాబాద్ సెంట్రల్ క్రైమ్‌స్టేషన్ (సీసీఎస్) పోలీసులు శుక్రవారం నలుగురిని అరెస్టు చేశారు. ప్రధాన సూత్రధారికి సహకరించిన ఆరోపణలపై యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (యూబీఐ) చీఫ్ మేనేజర్ మస్తాన్‌వలి, ఏపీ మర్కంటైల్ కో–ఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ లిమిటెడ్ ఆపరేషన్స్ మేనేజర్ వేదుల పద్మావతి, రిలేషన్‌షిప్ మేనేజర్ సయ్యద్ మొహియుద్దీన్‌లను హైదరాబాద్‌లో, చైర్మన్/ఎండీ బీవీవీఎన్ సత్యనారాయణరావును విజయవాడలో అదుపులోకి తీసుకున్నారు.
పక్కా పథకంతో డిపాజిట్లు మాయం
తెలుగు అకాడమీ తన నిధులను వివిధ బ్యాంకుల్లో ఫిక్స్‌డ్ డిపాజిట్ (ఎఫ్‌డీ) చేసింది. ఈ లావా దేవీలను దళారులుగా వ్యవహరించిన ముగ్గురు వ్యక్తులు నడిపారు. ప్రస్తుతం పరారీలో ఉన్న వీరి పేర్లు, వివరాలను అధికారులు గోప్యంగా ఉంచుతున్నారు. పథకం ప్రకారం ఈ త్రయం ఎఫ్‌డీ చేసిన సమయంలోనే ఆ పత్రాలను కలర్ జిరాక్స్ తీసుకున్నారు. సంతోశ్‌నగర్, కార్వాన్‌ల్లోని యూబీఐ, చందానగర్ కెనరా బ్యాంక్ శాఖల్లోని 12 ఎఫ్‌డీలుగా ఉన్న రూ.64 కోట్లు కాజేయడానికి కుట్రపన్నారు.
సిద్ధి అంబర్‌బజార్‌లోని ఏపీ మర్కంటైల్ కో-ఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ లిమిటెడ్‌లో తెలుగు అకాడమీ పేరుతో ఖాతా తెరిచారు. ఆ సమయంలో నకిలీ గుర్తింపుకార్డులు, ఫోర్జరీ పత్రా లు సమర్పించారు. వాటి ఆధారంగా యూబీఐ కార్వాన్ బ్రాంచ్‌లోని రూ.43 కోట్లు, సంతోష్‌నగర్ బ్రాంచ్‌లో రూ.10 కోట్లు, చందానగర్ కెనరా బ్యాంక్ బ్రాంచ్‌లో రూ.11 కోట్లు లిక్విడేట్ చేశారు. తర్వాత తెలుగు అకాడమీ పేరుతో సొసైటీలో తెరిచిన ఖాతాల్లోకి మళ్లించి డ్రా చేసేశారు. సొసైటీకి 10 శాతం వరకు కమీషన్ ఇచ్చారు.
సుప్రీంకోర్టు ఆదేశాలతో వెలుగులోకి..
అకాడమీ ఆస్తులు, నిధులను నిర్దేశిత నిష్పత్తి ప్రకారం ఏపీ, తెలంగాణ పంచుకోవాలని గత నెల 14వ తేదీన సుప్రీంకోర్టు ఆదేశించింది. దీంతో వాటి లెక్కలు చూడాలని అకాడమీ డైరెక్టర్ సోమిరెడ్డి ఆదేశాలు జారీచేశారు. అధికారులు ఈ నెల 18వ తేదీన బ్యాంకర్ల సమావేశం ఏర్పాటు చేసి గడువు తీరిన, తీరని ఎఫ్‌డీలు రద్దు చేయాలని సూచించారు. ఈ నేపథ్యంలోనే కుంభకోణం వెలుగుచూసింది. అయితే అప్పటికే ముగ్గురు సూత్రధారులూ తమ ఫోన్లు స్విచ్ఛాఫ్ చేసి అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. వీరి కోసం గాలిస్తున్నామని సంయుక్త పోలీసు కమిషనర్ అవినాష్ మహంతి తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment