వైఎస్సార్ జిల్లా : తాను ఈ లోకాన్ని వీడిపోతే నా బిడ్డలకు ఎవరు దిక్కు.? కట్టుకున్నోడికి పెళ్లాం, బిడ్డలు కనిపించడం లేదు. రోజూ పూటుగా తాగడం మత్తులో తూలడమే ఆయన ప్రపంచం. పర స్త్రీ వ్యామోహంలో వేధింపులకు గురి చేసేవాడు. వీటిని భరించలేకపోయింది. చివరికి తనువు చాలించాలని నిర్ణయించుకుంది.తనతో పాటు పిల్లలను కూడా తీసుకెళ్లాలనుకుంది ఆ తల్లి. ముక్కుపచ్చలారని కుమారై, కుమారుడితో సహా నాపరాయి గనిలోని నీటిలోకి దూకి ఆత్మహత్య చేసుకుంది. ఈ హృదయ విదారక సంఘటన ఎర్రగుంట్లలో సోమవారం చోటు చేసుకుంది. ఈ సంఘటనలో లక్ష్మీదేవి(36) అక్షయ(9), రేవంత్(7) మృతి చెందారు. పోలీసులు, స్థానికుల కథనం మేరకు వివరాలు..దువ్వూరు మండలం పుల్లారెడ్డిపేటకు చెందిన పిట్టల శ్రీనివాసులుకు , సి రాజుపాలెంకు చెందిన లక్ష్మీదేవికి పదేళ్ల కిందట వివాహమైంది.
వీరికి అక్షయ, రేవంత్ అనే పిల్లలు ఉన్నారు. ఐదేళ్ల కిందట బతుకుదెరువు కోసం ఎర్రగుంట్లకు వచ్చిన వీరు మహేశ్వర్‌నగర్ కాలనీలో స్థిరపడ్డారు. పిట్టల శ్రీనివాసులు ఆటో నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. లక్ష్మీదేవి రజక వృతిచేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటోంది. వీరి దాంపత్య జీవితం సాఫీగా సాగుతుండేది. పిట్టల శ్రీనివాసులు మద్యానికి బానిసయ్యాడు.తరచూ తాగి ఇంటికి వచ్చేవాడు. ఇలా చేస్తే కుటుంబం గడిచేది ఎలా.. పిల్లలను ఎలా పోషించుకుంటామని లక్ష్మీదేవి భర్తను అడుగుతుండేది. ఇటీవల కాలంలో శ్రీనివాసులు మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. దీనిపై భార్య ప్రశ్నించడంతో ఆమెను వేధింపులకు గురి చేస్తుండేవాడు. అదివారం రాత్రి కూడా ఇద్దరు ఈ విషయంపై గొడవ పడ్డారు. శ్రీనివాసులు సోమవారం ఉదయం ఆటో తీసుకుని ఇంటి నుంచి బయటకు వెళ్లాడు.
లక్ష్మీదేవి తన పిల్లలు అక్షయ, రేవంత్‌లను తీసుకుని ఇంటి నుంచి బయటకు వచ్చింది. వేంపల్లె రోడ్డులో ఉన్న నాపరాయి గని వద్దకు వెళ్లింది. ముందుగా అక్షయ, రేవంత్‌లను గనిలోని నీటిలో వేసి తర్వాత ఆమె దూకి ఆత్మహత్య చేసుకుంది. నీటిలో మునుగుతున్న సమయంలో పిల్లలు కేకలు వేశారు. రోడ్డుపై వెళుతున్న స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పట్టణ సీఐ మంజునాథ్‌రెడ్డి, తహసీల్దార్ ఎ నాగేశ్వరరావులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. గజఈతగాళ్లను రప్పించి గాలింపు చేపట్టారు. మొదట నీటి అడుగున పడి ఉన్న అక్షయ, రేవంత్‌ల మృతదేహాలను, కొంత సేపటికి లక్ష్మీదేవి మృతదేహాన్ని బయటకు తీశారు.తల్లీబిడ్దల మృతదేహాలను చూసి బంధువులు కన్నీరుమున్నీరుగా విలపించారు. గని వద్దకు స్థానికులు పెద్ద ఎత్తున చేరుకున్నారు. మృతురాలి అన్నయ్య ఆంజనేయులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు సీఐ మంజునాథ్‌రెడ్డి తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment