సాక్షి, హైదరాబాద్ : మల్టీ నేషనల్ కంపెనీ(ఎంఎన్‌సీ)లో ఉద్యోగాలిప్పిస్తామంటూ నకిలీ వెబ్‌సైట్ ((httpr://careerryte.com/) ద్వారా నిరుద్యోగులను మోసం చేస్తున్న ఉత్తరప్రదేశ్‌కు చెందిన ముగ్గురు సభ్యుల ముఠాను సైబరాబాద్ సైబర్‌క్రైమ్ పోలీసులు అరెస్టు చేశారు. వీరి నుంచి 13 సెల్‌ఫోన్లు, రెండు ల్యాప్‌టాప్‌లు, ఎనిమిది డెబిట్‌కార్డులు, రెండు క్రెడిట్ కార్డులు, పాస్‌బుక్‌లు స్వాధీనం చేసుకున్నారు. శుక్రవారం గచ్చిబౌలిలోని సైబరాబాద్ పోలీసు కమినరేట్‌లో సీపీ సజ్జనార్ వివరాలు వెల్లడించారు.
నకిలీ సైట్‌తో..
బీసీఏ చదివిన యూపీకి చెందిన షానూ అన్సారీ, యుగంతర్ శ్రీవాత్సవ్ స్నేహితులు. సులభంగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో వీరు కెరీర్‌సైట్.కామ్ పేరుతో ముంబై చిరునామాతో నకిలీ వెబ్‌సైట్‌ను రిజిస్టర్ చేశారు. దీనికి సంబంధించిన లక్నోలోని ఇందిరానగర్‌లో కార్యాలయాన్ని ప్రారంభించారు. అబ్జల్యూట్ సొల్యూన్ పేరుతో బోర్డును ఏర్పాటు చేసి ఏడుగురు టెలీకాలర్లను నియమించుకున్నారు. వీరిలో తుషార్ శ్రీవాత్సవ టెలిఫోనిక్ ఇంటర్వ్యూలు చేసేవాడు. షానూ అన్సారీ టైమ్స్‌జాబ్.కామ్ ద్వారా నిరుద్యోగుల డాటాను సంపాదించేవాడు. అనంతరం టెలికాలర్లు ఆయా అభ్యర్థులకు ఫోన్‌కాల్స్ చేసి డెలాయిట్, అక్సెంచర్, విప్రో, టాటా కన్సల్టెన్సీ సర్వీస్‌లో ఉద్యోగాలిప్పిస్తామని నిరుద్యోగులకు పోన్లు చేసేవారు. బ్యాంక్ ఎండ్ పద్ధతిలో భారీ వేతనాలు ఇస్తామని నమ్మించేవారు. ఆసక్తి చూపిన అభ్యర్థులకు తుషార్ శ్రీవాత్సవ టెలిఫోనిక్ ఇంటర్వ్యూలు నిర్వహించి మీరు ఎంపికయ్యారంటూ నకిలీ ఆఫర్ లెటర్‌ను పంపేవారు. తొలుత రిజిస్ట్రేషన్ ఫీజు వసూలు చేసిన వీరు...ఆ తర్వాత ప్రాసెసింగ్, ఇన్సూరెన్స్ ఫీజుల పేరుతో రూ.లక్షలు వసూలు చేసేవారు.
బాధితులకు వల వేసింది ఇలా...
నానక్‌రామ్‌గూడకు చెందిన మౌనిక సిన్హా ఉద్యోగ ప్రయత్నాల్లో భాగంగా 2020 మార్చిలో నౌకరీ.కామ్‌లో రెస్యూమ్ ఆప్‌లోడ్ చేసింది. ఏప్రిల్‌లో కెరీర్ సైట్ నుంచి రిషబ్ మల్హోత్రా అనే పేరుతో ఫోన్ చేసిన వ్యక్తి డెలాయిట్, అక్సెంచర్‌లో ఉద్యోగం ఉందంటూ నమ్మించాడు. దీంతో రిజిస్ట్రేషన్‌కు గాను కొంత నగదును ఆన్‌లైన్ ద్వారా చెల్లించింది. మరో రెండు నెలల తర్వాత రిషబ్ మల్హోత్రా ఫోన్ చేసి డెలాయిట్ కంపెనీ నుంచి వైభవ్ మహజన్‌కు కాన్ఫరెన్స్ కలిపి ఇంటర్వ్యూ నిర్వహించాడు. ఆ తర్వాత ఉద్యోగానికి ఎంపికయ్యారంటూ నమ్మించాడు. ఆ తర్వాత దశల వారీగా రూ14,50,000లు వసూలు చేశారు. ఆ తర్వాత స్పందన లేకపోవడంతో సెప్టెంబర్ 2న సైబరాబాద్ సైబర్‌క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇదే తరహాలో మరో యువతి దశలవారీగా రూ.38,18,000 చెల్లించింది. చివరకు తాను మోసపోయినట్లు గుర్తించి సైబరాబాద్ సైబర్‌క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు టెక్నికల్ డాటా సహకారంతో ప్రత్యేక పోలీసులు నిందితులు యూపీలో ఉన్నట్టుగా గుర్తించి అక్కడికెళ్లి వారిని అదుపులోకి తీసుకుని ట్రాన్సిట్ వారంట్‌పై నగరానికి తీసుకొచ్చారు. కేసును చేధించిన సైబర్‌క్రైమ్ సిబ్బందిని సీపీ సజ్జనార్ రివార్డులతో సత్కరించారు.
ఎస్సై పేరుతో టోకరా
పంజగుట్ట పోలీస్‌స్టేషన్‌లో ఎస్సైగా విధులు నిర్వహిస్తున్న షఫీ తన్వీ పేరుతో నకిలీ ఫేస్‌బుక్ అకౌంట్ ఓపెన్ చేసి సైబర్ నేరగాళ్లు మోసాలకు పాల్పడుతున్నారు. ఎస్సై షఫీ పేరుతో ఫేస్‌బుక్ అకౌంట్ క్రియేట్ చేసి ఫ్రెండ్ రిక్వెస్ట్ లు పంపుతున్నట్లు తేలింది. డబ్బులు పంపాలంటూ ఆయన అకౌంట్ నుంచి మెసెజ్లు పెడుతున్నారు. దీంతో ఎస్సై షఫీ తన్వీ స్పందించారు. తన ఫేస్‌బుక్ అకౌంట్ హ్యాక్ అయిందని.. డబ్బులు పంపాలంటూ ఏదైనా మెసేజ్ వస్తే నమ్మవద్దంటూ తెలిపారు. ఇప్పటికే ఈ విషయమై సైబర్‌క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment