కాల్పులు జరిపింది ఆ ముగ్గురే!  | Three Police Were Shooted The Victims In Disha Encounter Case | Sakshi
Sakshi News home page

కాల్పులు జరిపింది ఆ ముగ్గురే! 

Published Thu, Oct 28 2021 2:04 AM | Last Updated on Thu, Oct 28 2021 2:29 AM

Three Police Were Shooted The Victims In Disha Encounter Case - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ‘దిశ’నిందితులపై లాల్‌మదార్, రవి, సిరాజుద్దీన్‌ అనే ముగ్గురు పోలీసులు ఎదురు కాల్పులు జరిపారని అప్పటి ఆమన్‌గల్‌ స్టేషన్‌ హౌస్‌ ఆఫీసర్‌ (ఎస్‌హెచ్‌ఓ) కొండా నరసింహారెడ్డి (ప్రస్తుతం బాచుపల్లి పీఎస్‌ ఇన్‌స్పెక్టర్‌గా ఉన్నారు) జస్టిస్‌ వీఎస్‌ సిర్పుర్కర్‌ త్రిసభ్య కమిటీ ఎదుట వాంగ్మూలం ఇచ్చారు. ‘దిశ’సీన్‌ రీ–కన్‌స్ట్రక్షన్, ఎన్‌కౌంటర్‌ సమయంలో ఎప్పుడు ఏం జరిగిందనే అంశంపై కమిషన్‌ బుధవారం ఆయన్ను విచారించింది.

‘పారిపోకండి, కాల్చకండి, లొంగిపోండి.. అంటూ షాద్‌నగర్‌ ఏసీపీ వాసం సురేందర్‌ రెండు మూడుసార్లు అరిచి నా నిందితులు కాల్పులు ఆపలేదు. దీంతో తొలుత లాల్‌మదార్‌ను గాలిలోకి కాల్పులు జరపాలని ఏసీపీ ఆదేశించారు. అయినా ముద్దాయిలు ఫైరింగ్‌ ఆపకపోయే సరికి లాల్‌మదార్, రవి, సిరాజుద్దీన్‌ ముగ్గురినీ ఎదురు కాల్పులు జరపాల్సిందిగా ఆదేశించారు..’అని నరసింహారెడ్డి తెలిపారు. నిందితులలో ఆరిఫ్, చెన్నకేశవులు కాల్పులు జరపడం తాను చూశానని పేర్కొన్నారు.

ముగ్గురు పోలీసులు ఏ పొజిషన్‌లో ఉండి కాల్పులు జరిపారో తాను గమనించలేదన్నారు. కాల్పులు పూర్తయ్యాక నిందితుల మృతదేహాలను మీరు చూశారా? అని ప్రశ్నించగా.. లేదని సమాధానం ఇచ్చారు. కాల్పుల్లో పోలీసులు అరవింద్, వెంకటేశ్వర్లుకు గాయాలయ్యాయని, వాళ్లు స్పృహ కోల్పోయి పడిపోయారని తెలిపారు. 108 అంబులెన్స్‌ స్ట్రెచర్‌లో క్షతగాత్రులను షాద్‌నగర్‌ ఎస్‌ఐ, వాళ్ల సిబ్బంది పోలీసు వాహనంలో తీసుకెళ్లారని వివరించారు. అంబులెన్స్‌లో తీసుకెళ్లాలని సూచించలేదా అని ప్రశ్నించగా.. లేదని చెప్పారు.  

‘దిశ’వస్తువులు బయటకు తీసినప్పుడే ఎన్‌కౌంటర్‌ 
‘షాద్‌నగర్‌ ఏసీపీ సురేందర్‌ నిందితులను చటాన్‌పల్లిలోని రవి గెస్ట్‌ హౌస్‌కు తీసుకురమ్మని ఆదేశించడంతో.. 2019 డిసెంబర్‌ 5వ తేదీన అర్ధరాత్రి ఒంటి గంటకు నలుగురు నిందితులతో చర్లపల్లి జైలు నుంచి బయలు దేరాం. ఉదయం 3 గంటల సమయంలో ఏసీపీ నలుగురు నిందితులకు ఒక్కొక్కరికి ఒక్కో కానిస్టేబుల్‌ చొప్పున హ్యాండ్లర్‌ (నిందితుల చేతికి బేడీలు వేసి పట్టుకోవడం) విధులను వేశారు. ఏ1 మహ్మద్‌ ఆరిఫ్‌కు హెడ్‌ కానిస్టేబుల్‌ జానకిరామ్, ఏ2 జొల్లు శివకు హెడ్‌ కానిస్టేబుల్‌ అరవింద్, ఏ3 జొల్లు నవీన్‌కు కానిస్టేబుల్‌ బాలు రాథోడ్, ఏ4 చెన్నకేశవులుకు కానిస్టేబుల్‌ శ్రీకాంత్‌ హ్యాండర్లుగా ఉన్నారు.

హ్యాండర్‌ కానిస్టేబుల్స్‌ చేతికి లాఠీలు గానీ తుపాకులు గానీ ఇవ్వలేదు. చటాన్‌పల్లి సర్వీస్‌ రోడ్డుకు ఉదయం 5:30 గంటల కల్లా చేరుకున్నాం. ఉదయం 6 గంటల ప్రాంతంలో దిశ వస్తువులు దాచి ఉంచిన ప్రాంతాన్ని ఆరిఫ్‌ గుర్తించాడు. ఏసీపీ ఆదేశాల మేరకు ఆ ప్రాంతంలో కిందికి వొంగి మట్టిని నేనే తొలగించా. పాలిథిన్‌ కవర్‌లో సెల్‌ఫోన్‌ కనిపించింది. కవర్‌ మీద ఉన్న మట్టిని తొలగించాను. సెల్‌ఫోన్‌ బయటకు తీయలేదు. అదే సమయంలో ఎన్‌కౌంటర్‌ సంఘటన జరిగింది..’అని నరసింహారెడ్డి తెలిపారు. 

ఆరిఫ్‌ నా పిస్టల్‌ లాక్కున్నాడు     
‘ముందుగా జానకిరామ్‌ కళ్లల్లో మహ్మద్‌ ఆరిఫ్‌ మట్టి కొట్టి వెనక్కి నెట్టేశాడు. ఆ తర్వాత తన చేతికి ఉన్న క్లచ్‌లను తానే విడిపించుకున్నాడు. వెంటనే పారిపోతున్నాడని జానకిరామ్‌ అరవడంతో కింద వంగి ఉన్న నేను ఎడమ వైపునకు తిరిగా. వెంటనే నా కళ్లల్లోకి కూడా ఆరిఫ్‌ మట్టి విసిరేశాడు. ఆ వెంటనే ఆరిఫ్‌ తన రెండు చేతులతో నా బెల్ట్‌కు ఉన్న పిస్టల్‌ను పర్స్‌తో సహా బలంగా లాగాడు. వెంటనే ‘అరేయ్‌ ఉరకండ్రా’అంటూ అరిచాడు.

దీంతో మిగిలిన ముగ్గు రు నిందితులు కూడా హ్యాండ్లర్‌ కానిస్టేబుళ్లను వెనక్కి నెట్టేసి ముందు వైపునకు పరుగెత్తారు..’అని వివరించారు. మరి మీ పక్కనే ఉన్న ఆరిఫ్‌ను పట్టుకోవటానికి మీరు ప్రయత్నించలే దా? అని కమిషన్‌ ప్రశ్నించగా.. ‘ఆ సమయం లో కళ్లల్లో పడిన మట్టిని తుడుచుకుంటున్నా. వెంటనే ఆరిఫ్‌ వైపు నుంచి కాల్పులు మొదలయ్యాయి..’అని నరసింహారెడ్డి సమాధానం ఇచ్చారు. ఆరిఫ్‌ మీ పిస్టల్‌ను లాగే సమయం లో ఏసీపీ సురేందర్‌ ఏం చేస్తున్నారని ప్రశ్నించగా.. తాను కిందికి వొంగి మట్టిని తవ్వుతుంటే ఏసీపీతో సహా మిగిలిన ఎస్కార్ట్‌ సిబ్బంది దృష్టి అంతా ఇటువైపే పెట్టారని తెలిపారు. 

ఎవరు మట్టి విసిరారో చూడలేదు 
ఎస్కార్ట్‌గా వచ్చిన అందరు పోలీసుల కళ్లల్లో మట్టి పడిందా? అని త్రిసభ్య కమిటీ ప్రశ్నించగా.. తనకు తెలియదని, అరవింద్, వెంకటేశ్వర్లు కళ్లల్లో మట్టి పడటం అయితే తాను చూశానని నరసింహారెడ్డి తెలిపారు. పంచ్‌ విట్నెస్‌లైన అబ్దుల్‌ రవూఫ్, రాజశేఖర్‌ ముఖ కవళికలు, శరీరాకృతులు గుర్తు లేవని, వారిని చూస్తే మాత్రం గుర్తుపడతానని చెప్పారు. 

కమిటీ ముందు 9 ఎంఎం పిస్టల్‌ 
‘దిశ’ఎన్‌కౌంటర్‌ సమయంలో నరసింహారెడ్డి వద్ద ఉన్న 9 ఎంఎం పిస్టల్, దాని పర్సును కమిషన్‌ ముందుంచాలని మంగళవారం త్రిసభ్య కమిటీ ఆదేశించిన నేపథ్యంలో.. బుధవారం 9 ఎంఎం పిస్టల్‌ను, 10 బుల్లెట్లతో కూడిన మ్యాగజైన్‌ను తీసుకొచ్చారు. అయితే సంఘటన సమయంలో వినియోగించిన 9 ఎంఎం పిస్టల్‌ను సీజ్‌ చేశారని, దీంతో వేరే 9 ఎంఎం పిస్టల్‌ను తీసుకొచ్చామని, తుపాకీని పెట్టుకునేందుకు వినియోగించిన నైలాన్‌ పర్స్‌ ఫోరెన్సిక్‌ ల్యాబ్‌లో ఉందని నరసింహారెడ్డి చెప్పారు.  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement