sirajuddin
-
కాల్పులు జరిపింది ఆ ముగ్గురే!
సాక్షి, హైదరాబాద్: ‘దిశ’నిందితులపై లాల్మదార్, రవి, సిరాజుద్దీన్ అనే ముగ్గురు పోలీసులు ఎదురు కాల్పులు జరిపారని అప్పటి ఆమన్‌గల్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ (ఎస్హెచ్ఓ) కొండా నరసింహారెడ్డి (ప్రస్తుతం బాచుపల్లి పీఎస్ ఇన్స్పెక్టర్గా ఉన్నారు) జస్టిస్ వీఎస్ సిర్పుర్కర్ త్రిసభ్య కమిటీ ఎదుట వాంగ్మూలం ఇచ్చారు. ‘దిశ’సీన్ రీ–కన్స్ట్రక్షన్, ఎన్కౌంటర్ సమయంలో ఎప్పుడు ఏం జరిగిందనే అంశంపై కమిషన్ బుధవారం ఆయన్ను విచారించింది. ‘పారిపోకండి, కాల్చకండి, లొంగిపోండి.. అంటూ షాద్‌నగర్ ఏసీపీ వాసం సురేందర్ రెండు మూడుసార్లు అరిచి నా నిందితులు కాల్పులు ఆపలేదు. దీంతో తొలుత లాల్‌మదార్‌ను గాలిలోకి కాల్పులు జరపాలని ఏసీపీ ఆదేశించారు. అయినా ముద్దాయిలు ఫైరింగ్ ఆపకపోయే సరికి లాల్మదార్, రవి, సిరాజుద్దీన్ ముగ్గురినీ ఎదురు కాల్పులు జరపాల్సిందిగా ఆదేశించారు..’అని నరసింహారెడ్డి తెలిపారు. నిందితులలో ఆరిఫ్, చెన్నకేశవులు కాల్పులు జరపడం తాను చూశానని పేర్కొన్నారు. ముగ్గురు పోలీసులు ఏ పొజిషన్లో ఉండి కాల్పులు జరిపారో తాను గమనించలేదన్నారు. కాల్పులు పూర్తయ్యాక నిందితుల మృతదేహాలను మీరు చూశారా? అని ప్రశ్నించగా.. లేదని సమాధానం ఇచ్చారు. కాల్పుల్లో పోలీసులు అరవింద్, వెంకటేశ్వర్లుకు గాయాలయ్యాయని, వాళ్లు స్పృహ కోల్పోయి పడిపోయారని తెలిపారు. 108 అంబులెన్స్ స్ట్రెచర్‌లో క్షతగాత్రులను షాద్‌నగర్ ఎస్ఐ, వాళ్ల సిబ్బంది పోలీసు వాహనంలో తీసుకెళ్లారని వివరించారు. అంబులెన్స్‌లో తీసుకెళ్లాలని సూచించలేదా అని ప్రశ్నించగా.. లేదని చెప్పారు. ‘దిశ’వస్తువులు బయటకు తీసినప్పుడే ఎన్కౌంటర్ ‘షాద్‌నగర్ ఏసీపీ సురేందర్ నిందితులను చటాన్‌పల్లిలోని రవి గెస్ట్ హౌస్‌కు తీసుకురమ్మని ఆదేశించడంతో.. 2019 డిసెంబర్ 5వ తేదీన అర్ధరాత్రి ఒంటి గంటకు నలుగురు నిందితులతో చర్లపల్లి జైలు నుంచి బయలు దేరాం. ఉదయం 3 గంటల సమయంలో ఏసీపీ నలుగురు నిందితులకు ఒక్కొక్కరికి ఒక్కో కానిస్టేబుల్ చొప్పున హ్యాండ్లర్ (నిందితుల చేతికి బేడీలు వేసి పట్టుకోవడం) విధులను వేశారు. ఏ1 మహ్మద్ ఆరిఫ్‌కు హెడ్ కానిస్టేబుల్ జానకిరామ్, ఏ2 జొల్లు శివకు హెడ్ కానిస్టేబుల్ అరవింద్, ఏ3 జొల్లు నవీన్‌కు కానిస్టేబుల్ బాలు రాథోడ్, ఏ4 చెన్నకేశవులుకు కానిస్టేబుల్ శ్రీకాంత్ హ్యాండర్లుగా ఉన్నారు. హ్యాండర్ కానిస్టేబుల్స్ చేతికి లాఠీలు గానీ తుపాకులు గానీ ఇవ్వలేదు. చటాన్‌పల్లి సర్వీస్ రోడ్డుకు ఉదయం 5:30 గంటల కల్లా చేరుకున్నాం. ఉదయం 6 గంటల ప్రాంతంలో దిశ వస్తువులు దాచి ఉంచిన ప్రాంతాన్ని ఆరిఫ్ గుర్తించాడు. ఏసీపీ ఆదేశాల మేరకు ఆ ప్రాంతంలో కిందికి వొంగి మట్టిని నేనే తొలగించా. పాలిథిన్ కవర్లో సెల్‌ఫోన్ కనిపించింది. కవర్ మీద ఉన్న మట్టిని తొలగించాను. సెల్‌ఫోన్ బయటకు తీయలేదు. అదే సమయంలో ఎన్కౌంటర్ సంఘటన జరిగింది..’అని నరసింహారెడ్డి తెలిపారు. ఆరిఫ్ నా పిస్టల్ లాక్కున్నాడు ‘ముందుగా జానకిరామ్ కళ్లల్లో మహ్మద్ ఆరిఫ్ మట్టి కొట్టి వెనక్కి నెట్టేశాడు. ఆ తర్వాత తన చేతికి ఉన్న క్లచ్‌లను తానే విడిపించుకున్నాడు. వెంటనే పారిపోతున్నాడని జానకిరామ్ అరవడంతో కింద వంగి ఉన్న నేను ఎడమ వైపునకు తిరిగా. వెంటనే నా కళ్లల్లోకి కూడా ఆరిఫ్ మట్టి విసిరేశాడు. ఆ వెంటనే ఆరిఫ్ తన రెండు చేతులతో నా బెల్ట్‌కు ఉన్న పిస్టల్‌ను పర్స్‌తో సహా బలంగా లాగాడు. వెంటనే ‘అరేయ్ ఉరకండ్రా’అంటూ అరిచాడు. దీంతో మిగిలిన ముగ్గు రు నిందితులు కూడా హ్యాండ్లర్ కానిస్టేబుళ్లను వెనక్కి నెట్టేసి ముందు వైపునకు పరుగెత్తారు..’అని వివరించారు. మరి మీ పక్కనే ఉన్న ఆరిఫ్‌ను పట్టుకోవటానికి మీరు ప్రయత్నించలే దా? అని కమిషన్ ప్రశ్నించగా.. ‘ఆ సమయం లో కళ్లల్లో పడిన మట్టిని తుడుచుకుంటున్నా. వెంటనే ఆరిఫ్ వైపు నుంచి కాల్పులు మొదలయ్యాయి..’అని నరసింహారెడ్డి సమాధానం ఇచ్చారు. ఆరిఫ్ మీ పిస్టల్‌ను లాగే సమయం లో ఏసీపీ సురేందర్ ఏం చేస్తున్నారని ప్రశ్నించగా.. తాను కిందికి వొంగి మట్టిని తవ్వుతుంటే ఏసీపీతో సహా మిగిలిన ఎస్కార్ట్ సిబ్బంది దృష్టి అంతా ఇటువైపే పెట్టారని తెలిపారు. ఎవరు మట్టి విసిరారో చూడలేదు ఎస్కార్ట్‌గా వచ్చిన అందరు పోలీసుల కళ్లల్లో మట్టి పడిందా? అని త్రిసభ్య కమిటీ ప్రశ్నించగా.. తనకు తెలియదని, అరవింద్, వెంకటేశ్వర్లు కళ్లల్లో మట్టి పడటం అయితే తాను చూశానని నరసింహారెడ్డి తెలిపారు. పంచ్ విట్నెస్‌లైన అబ్దుల్ రవూఫ్, రాజశేఖర్ ముఖ కవళికలు, శరీరాకృతులు గుర్తు లేవని, వారిని చూస్తే మాత్రం గుర్తుపడతానని చెప్పారు. కమిటీ ముందు 9 ఎంఎం పిస్టల్ ‘దిశ’ఎన్కౌంటర్ సమయంలో నరసింహారెడ్డి వద్ద ఉన్న 9 ఎంఎం పిస్టల్, దాని పర్సును కమిషన్ ముందుంచాలని మంగళవారం త్రిసభ్య కమిటీ ఆదేశించిన నేపథ్యంలో.. బుధవారం 9 ఎంఎం పిస్టల్‌ను, 10 బుల్లెట్లతో కూడిన మ్యాగజైన్‌ను తీసుకొచ్చారు. అయితే సంఘటన సమయంలో వినియోగించిన 9 ఎంఎం పిస్టల్‌ను సీజ్ చేశారని, దీంతో వేరే 9 ఎంఎం పిస్టల్‌ను తీసుకొచ్చామని, తుపాకీని పెట్టుకునేందుకు వినియోగించిన నైలాన్ పర్స్ ఫోరెన్సిక్ ల్యాబ్‌లో ఉందని నరసింహారెడ్డి చెప్పారు. -
ఆప్ అభ్యర్థిగా సిరాజొద్దీన్
సాక్షి,నిజామాబాద్ అర్బన్: ఆమ్ఆద్మీ పార్టీ అభ్యర్థిగా నిజామాబాద్ అర్బన్ నియోజక వర్గం నుండి ఎమ్మెల్యేగా అభ్యర్థిగా పోటీచేస్తానని రిటైర్డ్ జిల్లా వైద్యాధికారి సిరాజొద్దీన్ పేర్కొన్నారు. మంగళవారం తన నివాసంలో విలేకరుల సమావేశం లో మాట్లాడారు. ఆమ్ఆద్మీ పార్టీ సిద్ధాంతాలు న చ్చాయని ప్రజలకు సేవ చేయాలనే తపనతో ఆ సిద్ధాంతాల ప్రకారం ప్రజా సేవ చేస్తానన్నారు. అందుకు పార్టీ తరపున నిజామాబాద్ నియోజక వర్గంలో ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీచేస్తానని తెలిపారు. ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ఎంతో అద్భుతంగా ప్రజాసేవ చేస్తున్నాడని ముఖ్యంగా అవినీతిని రూపుమాపడంతో ఆమ్ఆద్మీ పార్టీ పోరాటం చేస్తుందన్నారు. పార్టీ సిద్ధాంతాలు నచ్చి పోటీచేస్తున్నట్లు ప్రకటించారు. మరో రెండు, మూడు రోజుల్లో బీ–ఫాం అందుతుం దని అనంతరం నామినేషన్ దాఖలు చేస్తానన్నా రు. ఈ సమావేశంలో ఆమ్ఆద్మీ పార్టీకి చెందిన జిల్లా నాయకులు ఉన్నారు. -
డిమాండ్ల అంగీకారం అభినందనీయం
సిద్దిపేట జోన్: బీడీ కమీషన్‌దారుల డిమాండ్లను యాజమాన్యాలు అంగీకరించడం అభినందనీయమని ఆ సంఘం మెదక్ జిల్లా గౌరవ అధ్యక్షుడు సిరాజుద్దీన్ అన్నారు. గురువారం సీపీఐ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ రెండు రోజులుగా నిజామాబాద్‌లో బీడీ కమీషన్ దారుల డిమాండ్లపై కార్మిక సంఘాలు, యాజమాన్యాల మధ్య చర్చలు జరిగాయన్నారు. ప్రస్తుతం ఇస్తున్న కమిషన్ కంటే అదనంగా చెల్లించేందుకు యాజమాన్యాలు ముందుకు రావడం జరిగిందన్నారు. అదేవిధగా గుర్తింపు కార్డులు అందజేయడానికి వారు ఒప్పు కోవడం జరిగిందన్నారు. సమావేశంలో సీపీఐ నాయకులు ఎక్బాల్, శోభన్, పాషా తదితరులు పాల్గొన్నారు. -
వరంగల్ మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నిక
హైదరాబాద్ : వరంగల్ మహానగరపాలక సంస్థ మేయర్‌గా నన్నపనేని నరేందర్, డిప్యూటీ మేయర్ గా సిరాజుద్దీన్‌లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అనంతరం 58 డివిజన్ల కార్పొరేటర్లతో ప్రమాణ స్వీకారం చేయించారు. ప్రెసిడింగ్ అధికారిగా జాయింట్ కలెక్టర్ ప్రశాంత్ పాటిల్ వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి, ఎంపీలు గుండు సుధారాణి, దయాకర్, ఎమ్మెల్యేలు కొండా సురేఖ, దాస్యం వినయ్‌భాస్కర్, ధర్మారెడ్డి, రమేశ్, తదితరులు పాల్గొన్నారు. మేయర్ ఎన్నిక సందర్భంగా తెరాస శ్రేణులు పెద్ద ఎత్తున బాణాసంచా పేలుస్తూ సంబరాలు చేసుకున్నారు. గ్రేటర్ వరంగల్‌లో 58 డివిజన్లకు గానూ 44 డివిజన్లలో టీఆర్ఎస్ గెలుపొందిన విషయం విదితమే. నరేందర్ 19వ డివిజన్ నుంచి పోటీ చేసి 881 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. సిరాజుద్దీన్ 41వ డివిజన్ నుంచి బరిలో నిలిచి గెలిచారు. -
భగ్గుమన్న భూ తగాదాలు
ధారూరు: భూతగాదాలు భగ్గుమన్నాయి. ఇరువర్గాల వారు రాళ్లు, కట్టెలతో దాడులకు దిగడంతో మండల పరిధిలోని రాళ్లచిట్టెంపల్లిలో శనివారం ఉద్రిక్తత నెలకొంది. ఘర్షణలో ఇరవై మంది గాయపడగా నలుగురి పరిస్థితి విషమంగా ఉంది. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. రాళ్లచిట్టెంపల్లి గ్రామానికి చెందిన బాబుమియాకు కొడుకు గోరెమియా, కూతుళ్లు మహబూబ్‌బీ, ఆలంబీ, ఖాజాబీ, షహదా, ఘోరీ, అప్సర ఉన్నారు. బాబుమియా తన చిన్న కూతురు అప్సరకు ఇల్లరికం అల్లుడిని తీసుకురావాలని తనకున్న పొలంలో మూడెకరాలను దానపత్రం ఇచ్చాడు. పొలం గిరిగిట్‌పల్లి గ్రామంలో ఉంది. కొన్నాళ్ల క్రితం బాబుమియా చనిపోయాడు. అప్సరను సోదరుడు గోరెమియా పట్టించుకోకపోవడంతో ఆమె తన భూమిని అమ్మకానికి పెట్టింది. అదే గ్రామానికి చెందిన సిరాజుద్దీన్ రూ. 5 లక్షలకు బేరం కుదుర్చుకుని రూ. 2 లక్షలు అడ్వాన్సుగా చెల్లించి రిజిస్ట్రేషన్ చేసుకున్నాడు. మిగతా డబ్బును కొన్నాళ్ల తర్వాత అప్సర పెళ్లికి వినియోగించాడు. తను కొన్న భూమిని సిరాజుద్దీన్ గోరెమియా దాయాదులైన సులేమాన్, ఉస్మాన్‌లకు రూ. 7 లక్షలకు విక్రయించాడు. ఈక్రమంలో కొంతకాలంగా గోరెమియా తన దాయాదులతో పాటు సిరాజుద్దీన్‌తో గొడవపడుతున్నాడు. ఈ విషయమై శనివారం ఉదయం గ్రామంలో పంచాయితీ పెట్టినా ఫలితం లేకుండా పోయింది. ఈక్రమంలో వాగ్వాదం జరిగి గోరెమియా, సిరాజుద్దీన్ వర్గీయులు ఘర్షణకు దిగారు. కట్టెలు, రాళ్లు, కారంపొడితో దాడి చేసుకున్నారు. గోరెమియా వర్గానికి చెందిన కావలి రాములమ్మ, వెంకట్‌రెడ్డి, శివశంకర్‌రెడ్డితో పాటు మరో వర్గానికి చెందిన ఆకుల ఉస్మాన్, ఖాజా మైనొద్దీన్‌లతో పాటు మొత్తం 20 మందికి గాయాలయ్యాయి. కావలి రాములమ్మ, వెంకట్‌రెడ్డి, శివశంకర్‌రెడ్డి, ఆకుల ఉస్మాన్‌ల పరిస్థితి విషమింగా ఉండడంతో నగరంలోని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. కాగా గొడవకు కారణమైన ఇరువర్గాలకు చెందిన వారిని పోలీసులు ఠాణాకు తరలిస్తుండగా కొందరు మహిళలు అడ్డుకున్నారు. తమ వారిని వదిలి పెట్టాలని డిమాండు చేయగా పోలీసులు వారిని చెదరగొట్టారు. అనంతరం అప్సరను డీఎస్పీ నర్సింలు విచారించి వాంగ్మూలం సేకరించారు. ఇరువర్గాలకు చెందిన వారిని అరెస్టు చేశామని డీఎస్పీ తెలిపారు. రాళ్లచిట్టెంపల్లిలో డీఎస్పీ నర్సింలుతో పాటు ఇద్దరు సీఐలు, ఐదుమంది ఎస్ఐలు, 30 మంది పోలీసులు పికెట్ నిర్వహిస్తున్నారు. గ్రామాన్ని సందర్శించిన జిల్లా ఎస్పీ రాళ్లచిట్టెంపల్లిలో ఉద్రిక్తత నె లకొనడంతో ఎస్పీ రాజకుమారి శనివారం రాత్రి గ్రామాన్ని సందర్శించి వివరాలు సేకరించారు. ఘటనకు దారి తీసిన అంశాలపై ఇరువర్గాలతో మాట్లాడారు. గ్రామంలో అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పికెట్ ఏర్పాటు చేశారు. రెచ్చగొట్టే వారిపై చర్యలు తీసుకోవాలని ఎస్పీ రాజకుమారి డీఎస్పీ నర్సింలుకు సూచించారు.