కమలాపూర్: వీధి కుక్కలు వెంటపడటంతో తప్పించుకునే ప్రయత్నంలో ఓ బాలుడు ట్రాక్టర్ కిందపడి దుర్మరణం పాలైన విషాదకర ఘటన హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలంలోని మర్రిపల్లిగూడెంలో మంగళవారం చోటు చేసుకుంది. పోలీసుల వివరాల మేరకు.. మర్రిపల్లిగూడేనికి చెందిన ఇనుగాల జయపాల్–స్వప్న దంపతుల ఒక్కగానొక్క కుమారుడు ధనుష్ (10) ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 6వ తరగతిలో చదువుతున్నాడు.
తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా మంగళవారం విద్యా శాఖ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. ధనుష్ ఈ ర్యాలీలో పాల్గొనేందుకు వెళ్తున్న క్రమంలో వీధి కుక్కలు వెంట పడ్డాయి. వాటినుంచి తప్పించుకునే ప్రయత్నం చేస్తుండగా అదే గ్రామంలోని రిక్కల నారాయణరెడ్డికి చెందిన ట్రాక్టర్‌ను డ్రైవర్ తోట విజయేందర్ అతివేగంగా, అజాగ్రత్తగా నడుపుతూ వచ్చి బాలుడుని ఢీకొట్టాడు. ప్రమాదంలో ధనుష్ ట్రాక్టర్ కింద పడిపోయి తీవ్రంగా గాయపడ్డాడు.
గమనించిన స్థానికులు వెంటనే కమలాపూర్ ప్రభుత్వాస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. తెలంగాణ దశాబ్ది ఉత్సవాలే తమ కుమారుడిని బలి తీసుకున్నాయని, ఈ ఉత్సవాలు లేకుంటే తమ కుమారుడు బతికేవాడని ధనుష్ తల్లిదండ్రులు విలపించారు. ధనుష్ తండ్రి జయపాల్ ఫిర్యాదు మేరకు ట్రాక్టర్ యజమాని నారాయణరెడ్డి, డ్రైవర్ తోట విజయేందర్‌లపై పోలీసులు కేసు నమోదు చేశారు.
ప్రభుత్వం పరిహారం ఇవ్వాలి: ఈటల
హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ విద్యార్థి ధనుష్ కుటుంబ సభ్యులతో ఫోన్లో మాట్లాడి పరామర్శించారు. ధనుష్ కుటుంబానికి ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించి ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ పాడి కౌశిక్‌రెడ్డి కమలాపూర్ ప్రభుత్వాస్పత్రికి చేరుకుని విద్యార్థి మృతదేహాన్ని పరిశీలించారు. బాధిత కుటుంబీకులను ఆదుకుంటామని హామీ ఇచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment