దాడులు చేసుకుంటున్న యువకులు
కిలేశపురం(ఇబ్రహీంపట్నం): ఈత సరదా యువకుల మధ్య చిచ్చురేపింది. రెండు వర్గాలుగా విడిపోయి ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. ముగ్గురు గాయపడగా ఒక యువకుడు వైద్యశాలలో చికిత్స పొందుతున్నాడు. స్థానిక ఎన్టీటీపీఎస్ బూడిద చెరువు నుంచి వెలువడే నీళ్లు చఫ్టా ద్వారా కృష్ణానదిలో కలుస్తాయి. చఫ్టా వద్ద జాలువారే నీటిని వాటర్‌ఫాల్స్‌గా భావించి యువకులు ఈత కొట్టేందుకు వస్తుంటారు. ఆదివారం ఫ్రెండ్‌షిఫ్ డే కావడంతో అధిక సంఖ్యలో యువకులు అక్కడకు చేరుకున్నారు.
బైక్‌ల విషయంలో మొదలై...
స్టాండ్ వేసిన బైక్‌లు ఒకదానిపై ఒకటి పడటంతో ఇరువర్గాల మద్య గొడవ ప్రారంభమైంది. అప్పటికే మద్యం మత్తులో తూగుతున్న యువకులు ఘర్షణకు దిగారు. హైవే వద్దకు చేరుకునే సమయానికి యువకుల మధ్య వివాదం తారస్థాయికి చేరింది. తోపులాటతో ప్రారంభమై చివరికి కర్రలు, రాళ్లు, పడిగుద్దులతో ఒకరిపై ఒకరు దాడిచేసుకున్నారు. ముఖ్యంగా ముగ్గురు యువకులను తీవ్రంగా చావబాదారు.
కిలేశపురంలో యువకుల మధ్య తీవ్ర ఘర్షణ జరిగింది. నగరానికి చెందిన యువకులు దేవిశెట్టి దివాకర్, కరమద్ది సాయి, కోట్ల అరుణ్, ముద్రబోయిన నాగేశ్వరరావు, తెనాలి శ్రావణ్‌కుమార్, తాసెట్టి శరత్, చలసాని నాగరాజు, షేక్ షాహీల్, బొమ్మశెట్టి కుమార్ పేద కుటుంబాలకు చెందిన వారు. చదువుల పేరుతో ఇళ్ల నుంచి బయటకు వచ్చి సరదా కోసం వీరు చేస్తున్న పనులు తల్లిదండ్రులకు తలవంపులు తెచ్చాయి.
ఈ సంఘటనపై స్పందించిన సీఐ శ్రీధర్‌కుమార్ మాట్లాడుతూ.. కిలేశపురంలో యువకుల మధ్య జరిగిన ఘర్షణలో ఒక యువకుడు తీవ్రంగా గాయపడ్డాడని చెప్పారు. ప్రస్తుతం వైద్యశాలలో చికిత్స పొందుతున్నాడని పేర్కొన్నారు. ఈ కేసులో ఇప్పటికే 10 మందిని అదుపులోకి తీసుకున్నామన్నారు. రెండు వర్గాలపై కేసులు పెడతామన్నారు.
10 మంది అరెస్ట్...
ఇప్పటి వరకు 10 మంది యువకులను అదుపులోకి తీసుకున్నట్లు వెస్ట్ జోన్ ఏసీపీ హనుమంతరావు తెలిపారు. మిగిలిన వారి కోసం విజయవాడ చిట్టినగర్, పాలప్యాక్టరీ ప్రాంతాల్లో గంజాయి స్థావరాల వద్ద గాలిస్తున్నామన్నారు. అక్కడ జరిగింది గ్యాంగ్‌వార్ కాదన్నారు. ఘటనలో పాతనేరస్తులు లేరని, ఒక్కరు కూడా చనిపోలేదని, స్థానికులు గొడవలో పాల్గొనలేదన్నారు. అందరూ నున్న, ప్రకాశ్‌నగర్, సింగ్‌నగర్ ప్రాంతాలకు చెందిన యువకులని వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment