ప్రమాదానికి ముందు చెర్వుగట్టులో సెల్ఫీ తీసుకున్న రామకృష్ణ కుటుంబసభ్యులు
సాక్షి, చౌటుప్పల్ రూరల్ (నల్గొండ): దైవదర్శనానికి వెళ్లొస్తున్న ఓ కుటుంబానికి మార్గమధ్యలో అనుకోని ఆపద ఎదురైంది. ఆపి ఉన్న డీసీఎంను బైక్‌ను ఢీకొనడంతో తండ్రీకుమారుడు మృత్యువాతపడగా, తల్లీ కొడుకు అంపశయ్యపై కొట్టుమిట్టాడుతున్నారు. పోలీసులు, బంధువులు తెలిపిన వివరాల ప్రకారం.. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలోని లక్కారం గ్రామానికి చెందిన డాకోజీ రామకృష్ణ(45)ది రెక్కాడితేగాని డొక్కాడని బీదకుటుంబం. లక్కారం స్టేజీ వద్ద చిన్న హేర్ సెలూన్ దుకాణాన్ని నిర్వహిస్తున్నాడు. ఇతడికి భార్య లక్ష్మి(40), ఇద్దరు కొడుకులు ఉన్నారు. పెద్ద కొడుకు మణిచరణ్(13) పెద్ద అంబర్‌పేటలో 8వ తరగతి చదువుతున్నాడు. చిన్న కొడుకు ఈశ్వర్‌సాయి(11). ఇతడి మానసిక స్థితి సరిగా లేదు. ఇంటి వద్దే ఉంటున్నాడు.
రామకృష్ణ అయ్యప్ప భక్తుడు. 18ఏళ్లుగా అయ్యప్ప దీక్ష చేపడుతున్నాడు. చెర్వుగట్టు రామలింగేశ్వరస్వామి అన్నా కూడా ఎనలేని భక్తి. ఈ నెల 12న శబరికీ వెళ్లాడు. అయ్యప్పను దర్శనం చేసుకొని ఈ నెల18న తిరిగొచ్చాడు. శబరికి వెళ్తూ చెర్వుగట్టుకు వెళ్లి దర్శనం చేసుకొని వెళ్లాడు. శుక్రవారం ఉదయం భార్య, ఇద్దరు కొడుకులతో కలిసి పల్సర్ బైక్‌పై నార్కట్‌పల్లి మండలంలోని చెర్వుగట్టుకు వెళ్లాడు. దైవ దర్శనం పూర్తి చేసుకొని మధ్యాహ్నం తర్వాత వెనుదిరిగారు. చౌటుప్పల్ మండలం పంతంగి టోల్ ప్లాజా దాటాక, ఆరెగూడెం క్రాస్‌రోడ్డు సమీపంలో ఓ డీసీఎం ఎక్సెల్ ఇరిగిపోవడంతో డ్రైవర్ రోడ్డు పక్కన ఆపి హైదరాబాద్‌కు వెళ్లాడు.
చదవండి: (అన్నా.. అని వేడినా కనికరించలేదు.. సోదరిని, తల్లిని సైతం వీడియో తీసి..)
రోడ్డు పక్కన ఆగి ఉన్న డీసీఎంను రామకృష్ణ తన బైకుతో వెనుక నుంచి బలంగా ఢీ కొట్టాడు. ఈ ప్రమాదంలో రామకృష్ణ తల చిట్లి పోయి అక్కడికక్కడే మృతిచెందాడు. బైకుపై ముందు కూర్చున్న చిన్నబాబు తలకు, భార్య తలకు, ముఖానికి తీవ్రగాయాలయ్యాయి. మధ్యన కూర్చున్న పెద్దబాబు కడుపునకు తీవ్రగాయాలయ్యాయి. అంబులెన్సులో రామకృష్ణ, పెదబాబు మణిచరణ్‌లను చౌటుప్పల్‌లోని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. రామకృష్ణ చనిపోయినట్టు డాక్టర్లు నిర్ధారించడంతో పోస్టుమార్టం నిమిత్తం అక్కడే ఉన్న మార్చురీకి తరలించారు. తీవ్రంగా గాయపడిన మణిచరణ్‌ను హైదరాబాద్‌లోని కామినేని ఆస్పత్రికి తరలించారు.
లక్కారంలో విషాద ఛాయలు
చౌటుప్పల్ : ఒకే కుటుంబానికి చెందిన నలుగురిలో తండ్రీకొడుకులు చనిపోవడం, తల్లీ కొడుకులు చా వుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతుండడంతో ల క్కారం గ్రామంలో విషాధఛాయలు అలుముకున్నా యి. విషయం తెలుసుకొని గ్రామస్తులు, బంధువులు తండోపతండాలుగా చౌటుప్పల్ ప్రభుత్వాస్పత్రి కి తరలివచ్చారు. బంధువుల రోదనలతో ఆస్పత్రి ప్రాంగణం మారుమ్రోగింది. కామినేని ఆస్పత్రిలో మృతి చెందిన ఈశ్వర్‌సాయి మృతదేహాన్ని ప్రభుత్వాస్పత్రికి తీసుకొచ్చారు. పోలీస్ ఇన్‌స్పెక్టర్ శ్రీ నివాస్, ఎస్‌ఐ అనిల్‌లు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
క్షతగాత్రులను డాక్టర్ వర్షిత్‌రెడ్డి కారులో ఎక్కిస్తున్న స్థానికులు
క్షతగాత్రులను చూసి.. చలించిన యువ డాక్టర్
వికారాబాద్ జిల్లా పరిగి ఎమ్మెల్యే మహేష్‌రెడ్డి కుమారుడు వర్షిత్‌రెడ్డి నార్కట్‌పల్లిలోని కామినేని మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ రెండో సంవత్సరం చదువుతున్నాడు. ఇదే సమయంలో తన కారులో హైదరాబాద్‌కు వెళ్తున్నాడు. రోడ్డు ప్రమాదం చూసి ఆగాడు. అంబులెన్సులోని రెండు స్ట్రెచర్ల మీద తండ్రి, పెద్ద కొడుకులను తరలించారు. తల్లి, చిన్న కొడుకుల నాడి పట్టి చూశాడు. తీవ్రగాయాలపాలై ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నారు.
సకాలంలో ఆస్పత్రికి తరలిస్తే ప్రాణాలను కాపాడొచ్చని, వారిద్దరినీ తనకారులో వేసుకొని హైదరాబాద్‌లోని కామినేని ఆస్పత్రికి తీసుకెళ్లి, జాయిన్ చేశాడు. అక్కడ చిన్న బాబు చనిపోయాడు. తల్లి చికిత్స పొందుతోంది. యువ డాక్టర్ ఔదార్యం పట్ల అందరూ అభినందిస్తున్నారు. ‘గోల్డెన్ అవర్‌లో ఆస్పత్రిలో చేర్చితే ప్రాణాలను కాపాడొచ్చని యువడాక్టర్‌గా చలించా. అంబులెన్సులో పంపుదామంటే స్ట్రెచర్లు లేవు, ప్లేస్ లేదు. ఇంకో అంబులెన్సు కోసం వేచి చూసి సమయం వృథా చేయలేక నా కారులోనే హైదరాబాద్‌కు తీసుకొచ్చా’ అని వర్షిత్‌రెడ్డి ‘సాక్షి’కి తెలిపారు. అయినా బాబు చనిపోవడం బాధగా ఉందని విచారం వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment